* * *
విజయవాడ నుంచి దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లాలో బాపట్ల మండలంలో సూర్యలంక బీచ్ గురించి తెలుసుకుందామని బయలుదేరేం. దాదాపు రెండున్నర గంటల్లో సూర్యలంక బీచ్ ఒడ్డున ఉన్న హరిత రిసార్ట్ చేరుకున్నాం. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖవారిది. విశాలమైన ఆవరణలో బోలెడంత పార్కింగ్ ఏరియా ఉంది. వీకెండ్ కి చుట్టు ప్రక్కల ఉన్న కాలేజీ విద్యార్థులు, విద్యార్థినులు వస్తుంటారని అర్థం అయింది. ఇక్కడ ఎ.సి. మరియు నాన్ ఎ.సి. కాటేజీలు దొరుకుతాయి. వీటి ధర వారాంతంలో మామూలు రోజులకంటే ఎక్కువ ఉంటుంది. రెండు వరసల్లో ఉన్న ఈ కాటేజీలు ప్రామాణికత విషయంలో గొప్పగా ఉన్నాయని చెప్పలేం. కొన్ని ముందు వరసలో ఉన్న కాటేజీలు కాస్త ఎత్తు మీద కట్టబడి ఉన్నాయి. వెనుక వరుసలో ఉన్న కాటేజీలు కూడా వరండాలో కూర్చుంటే సముద్రాన్ని స్పష్టంగా, దగ్గరగా చూబిస్తాయి.
*
మేము వెళ్లినది వారాంతంలో కాబట్టి దాదాపు అక్కడున్న పాతిక కాటేజీలు నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ సముద్రం మన ఇంటి ముందు ఉన్నట్టు ఉంటుంది. విశాలంగా పరుచుకుని ఉన్నబీచ్ వాతావరణం మరికొంత పోషణ కోరుకుంటోంది. రిసార్ట్ లో రెస్టొరెంట్ ఒకటి, బార్ ఒకటి ఉన్నాయి. ఇడ్లీ, దోసె లాటి ఫలహారాలు, కాఫీ, టీ లాటి పానీయాలు సమృధ్ధిగా దొరుకుతాయి. సర్వీస్ ఫరవాలేదనిపించేలా ఉంది. భోజనం కూడా అంతే. అక్కడి ఉద్యోగులు వచ్చిన వాళ్లకి తమకి అవకాశమున్నంతలో అన్నీ అమర్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్లకి చాలా పరిమితులున్నాయి.
*
శుభ్రత విషయంలో, మెయిన్టెనెన్స్ విషయంలో ఇంకా చాలా చెయ్యవలసింది ఉంది. బాపట్ల పట్టణం నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఈ రిసార్ట్ ఉంది. ముందుగా ఆన్ లైన్ ద్వారా కాటేజీ బుక్ చేసుకోవచ్చు. వారాంతాలు కాకుండా మిగిలిన రోజులు నిశ్శబ్దంగానే ఉంటాయి ఈ పరిసరాలు. రిసార్ట్ దగ్గర ఒక పోలీస్ పోస్ట్ ఉంది కానీ కనుచూపు మేరలో ఎలాటి భద్రతా చర్యలు కనిపించలేదు. అందుకే ఇటీవల ఈ బీచ్ లో అనేక దుర్మరణాలు సంభవిస్తున్నాయి. ఎక్కువగా యువత విషయంలో ఇలా జరుగుతోంది.ప్రభుత్వం వారు కొంత శ్రధ్ధపెట్టి ఈ బీచ్ ని మరింత ఆహ్లాదకరంగా, భద్రమైనదిగా రూపొందించాల్సిన అవసరం వంద శాతం ఉంది.మేము వెళ్లిన సమయంలో పవర్ కి పదే పదే అంతరాయం కలగటం ఆశ్చర్యం కలిగించింది, ఆ సమీపంలోనే ఎయిర్ ఫోర్స్ బేస్ ఉన్నప్పటికీ.
*
ఇంతకీ ఈ రిసార్ట్ కట్టి పది సంవత్సరాలు పూర్తైందని తెలిసి ఆశ్చర్యం కలగక మానదు. పదేళ్ల సుదీర్ఘమైన కాలంలో ఇక్కడ జరిగిన అభివృధ్ధి చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఇప్పుడిప్పుడు మొక్కలు నాటుతున్నారు ఆవరణలో. ఒక ప్రక్క నుంచి మొక్కలని తినేస్తూ పశువులు కూడా కనిపించాయి. ప్రభుత్వ శాఖల్లోని అలసత్వం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇంత చక్కని బీచ్ ని మనం సంరక్షించుకుంటూ మంచి పర్యాటక ప్రదేశంగా మార్చుకోవలసిన అవసరం ఉంది. అందునా ఇప్పటి ప్రభుత్వం పర్యాటకం గురించి ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటున్నట్లు చెబుతున్న ఈ సమయంలో. బయట నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతించమని బోర్డ్ అయితే ఉంది కానీ దాన్ని పాటిస్తున్న దాఖలా కనిపించలేదు. ఎయిర్ ఫోర్స్ బేస్ మినహా చుట్టుప్రక్కల మరే ఇతర నిర్మాణాలు లేవు.
*
ఇక్కడికొచ్చిన పర్యాటకుల్లో అన్ని వయసుల వారు కనిపించారు. రొటీన్ జీవితంలోంచి కాస్త మార్పు కోసం సముద్రతీరంలో విహరించి రావటానికి ఒకటి రెండు రోజులు ఇక్కడ ప్రయత్నించవచ్చు.
Yes, it is a dangerous place to go into the sea. One should be cautious before going into the sea. You have explained in detail about the Beach. It is very nice to know more about Resort.
LikeLike
Nice place to get away from home on weekends. But as writer said need to develop more. My mother liked the place however there is no wheel chair facility so she felt difficulty to move around.
LikeLike
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike