* * *
ఈ ఆదివారం హిందూ లో ‘ఆషిష్ కౌల్’ రాసిన ‘ది స్టోన్ పెల్టర్స్’ అనే వ్యాసం చదువుతుంటే ఎన్ని ఆలోచనలో! కాశ్మీరు గురించి ఇక్కడ దక్షిణాదిన ఉన్న మనకి ఏమి తెలుస్తుంది? నిజమే. ఈ వ్యాసంలో కొన్ని వాక్యాలు మనసుని గాయపరుస్తున్నాయి. అనంతనాగ్ ప్రాంతాన్ని ఇస్లామాబాద్ గా అక్కడి విధ్వంసకారులు పిలుస్తుండటం, స్కూళ్లు, కాలేజీలు లేకుండా చదువులు ప్రస్తావనే లేని ఎదుగుతున్న పిల్లలు, వాళ్లు ప్రతిరోజూ తెలవారుతూనే ఇంటినుండి బయటకొచ్చి రోడ్లమీద రాళ్లు విసరటాన్ని విధిగా ఆచరించవలసిన చర్యగా అక్కడ సాయుధులైన ప్రభుత్వ వ్యతిరేకవాదుల కనుసన్నల్లో భయం భయంగా బ్రతకటం……….రాత్రి నిద్రకి మళ్లుతూ, రేపు తెల్లవారకూడదని, అమాయకులకు చీకటిలోనే శాంతి, క్షేమం ఉన్నాయని అక్కడివారు నిత్యమూ కోరుకోవటం, అవన్నీ ఈ వ్యాసకర్తకి చెప్పుకోవటం………
ఏమి జరుగుతోంది? ఎవరి స్వార్థం ఈ అమాయకుల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది? వాళ్లదైన జీవితాన్ని జీవించనీయకుండా వారి హక్కుల్ని లాక్కునే అధికారం ఎవరిది? కాశ్మీరీ పండిట్లు తమ ఇళ్లు, వాకిళ్లు వదులుకుని దేశం నలుమూలలా తమవి కాని ప్రాంతాల్లో అపరిచితుల్లా, అక్కడి స్థానికుల అనుమాన దృక్కుల మధ్య అపరాధుల్లా నిరంతరం జీవిక కోసం వెతుకులాడుతూ, పేదరికం, అభద్రతల మధ్య జీవనాన్ని కొనసాగిస్తూ ……………..ఏమిటిదంతా?
50 సంవత్సరాలు పైబడిన ఒక ముస్లిమ్ సోదరుడు తన చిన్నతనపు రోజులు తలుచుకుంటూ హిందువులతో కలిసి ఈద్, దీపావళి పండుగలను ఒకేలాటి ఉత్సాహంతో చేసుకోవటం, ఒకే పళ్లెంలో కలిసి తినటం, ఆడుకోవటం లాటి అందమైన జ్ఞాపకాలను ఈ వ్యాసకర్త ‘ఆషిష్ కౌల్’ తో పంచుకున్నాడు. కానీ ఇప్పుడున్న యువతరానికి కేవలం మతవిద్వేషం, అసహనం, శతృత్వం మినహా మనుషుల మధ్య ఉండే ప్రేమాభిమానాలు, మమతలు తెలిసే అవకాశమే లేదు. తొంభైల ముందునాటి కాశ్మీర్ మళ్లీ చూడగలమా అని ఆ ముస్లిమ్ సోదరుని వేదన.
కాశ్మీర్ అంటే ప్రకృతిలో ఒదిగి, ప్రకృతితో మమేకమైన భూలోక స్వర్గమని కదూ మనమంతా అనుకుంటాం. నేను పనిచేసిన స్కూల్లో ఒకచోట పదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి పేరు రజోరి. ఉలిక్కి పడ్డాను. ఆ పేరు పెట్టుకున్న కారణం అడిగితే ఆమె తండ్రి సైన్యంలో ఉన్నాడని, ఆమె పుట్టినప్పుడు రజోరిలో ఉన్నందువలన ఆ పేరు పెట్టారని గర్వంగా చెప్పింది. భలే నచ్చింది నాకు.
2007 సంవత్సరంలో మా వారి ఉద్యోగ రీత్యా పూణె లో ఉన్నాం. అక్కడ మావారి ఆఫీసు క్వార్టర్స్ భండార్కర్ రోడ్ లో ఉన్నాయి. ఒకరోజు ప్రొద్దున్న పదిగంటలవేళ ఐదారుమంది అమ్మాయిలు, అబ్బాయిలు వాచ్ మన్ కళ్లు గప్పి వచ్చి తలుపు తట్టారు. తాము కాశ్మీరీలమని, తమకి కొంత ఆర్థిక సాయం కావాలని, కొన్నాళ్లు వసతి కూడా కావాలని అడిగారు. ఏం చెప్పాలి? మేము ఉన్నది ప్రభుత్వ క్వార్టర్స్. అదీకాక ఇది ఎంత సెన్సిటివ్ విషయమో అందరికీ తెలుసు. వారి వెనుకే వాచ్ మన్ పరుగెత్తుకొచ్చి లోపలికి ఎలా వచ్చారంటూ అదిలించి బయటకు వెళ్లగొట్టాడు. ఆ పిల్లలు అందరూ టీన్స్ దాటి జస్ట్ ఇరవైల్లోకి ప్రవేశించిన వయసు. అందంగా, సున్నితంగా ఉన్నారు. ఆ తర్వాత దిల్లీలో ఉన్నప్పుడు కూడా వాళ్ల ఉనికి గురించి, గుంపులు గుంపులుగా స్వంత ఊరు, ఇల్లు, లేకుండా దేశం నలుమూలలకీ విసిరివేయబడిన కాశ్మీరీపండిట్ల గురించి తరచుగా న్యూస్ పేపర్లలో చూస్తుండేదాన్ని. దశాబ్దాల తరబడి కాశ్మీరీల పట్ల జరుగుతున్న ఈ అమానవీయ వైఖరికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా?
2010 ఏప్రిల్ లో కాశ్మీర్ వెళ్లినప్పుడు నాకంటికి కనిపించిన కాశ్మీరం నేను పాఠాల్లో చదివినదీ, విన్నదీ కాదు. అతి పేద ప్రాంతం. అక్కడి సామాన్య ప్రజలు జీవిక దొరికే మార్గం లేక పేదరికంలో మ్రగ్గుతున్నారు. దుమ్మూ, ధూళీ కొట్టుకుపోయిన రోడ్లూ, పోషణ లేక గుండె గుప్పిట్లో పెట్టుకు జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్న ప్రజలు……….ఇదేనా కాశ్మీర్?! నాయని కృష్ణకుమారి గారు వ్రాసిన ‘కాశ్మీర దీపకళిక’ ఎక్కడుంది? ఆమె చూడగలిగిన కాశ్మీరు ఇప్పుడెక్కడుంది? ఏమైపోయింది?
అక్కడ మేము బస చేసిన హోటల్ లో రిసెప్షన్ లో కూర్చున్న యువకులు ఇండియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూస్తూ మనదేశానికి వ్యతిరేకంగా కేరింతలు కొట్టడం చూస్తే ఆశ్చర్యం వేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా అక్కడి సాయుధ దళాలకి తలవంచి ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారనిపిస్తుంది.
రోడ్డుమార్గంలో చాలా ప్రయాణం చేసాం జమ్మూ, కాశ్మీర్ ప్రాంతంలో. అక్కడ అతి సెన్సిటివ్ ప్రాంతం గా హెచ్చరిక బోర్డ్ లు పెట్టిన చోట నామమాత్రపు తనిఖీతో వాహనాలను, మనుష్యులను కూడా వదిలి పెట్టడం చూస్తే అక్కడ ఏం జరుగుతోందో, ఆ ప్రాంతం పైన కేంద్రానికి ఎలాటి పట్టు ఉందో అర్థం కాదు.
ఇవాళ్టి హిందూ పేపరు లోని వ్యాసం నన్ను ఇన్ని ఆలోచనలకి గురి చేసింది. కాశ్మీరు యాత్ర ముగించుకొచ్చాక ఎలావుందంటూ అడిగిన నా స్నేహితులకి అక్కడి దుర్భర దారిద్ర్యం గురించి చెబితే నమ్మలేక పోయారు. కాశ్మీరు పరిస్థితిలో మన తరంలో మార్పు వస్తుందన్న ఆశ కనుచూపు మేరలో కనిపించటం లేదు. దీనికోసం గట్టిగా నడుం కట్టి పని చేసే వాళ్లెవరు?వాళ్లెలాటి త్యాగాలకి సిధ్ధం కావాలి?
ఆ రాష్ట్ర రహదారుల్లో తిరుగుతుంటే ప్రతి ఇంటి ప్రహరీ మీదుగా నిలువెత్తున పెరిగి గుత్తులు గుత్తులుగా విరగబూసిన అమాయక గులాబీలు కళ్లముందు ఇంకా కదులుతూనే ఉన్నాయి. డౌన్ టౌన్ ప్రాంతంగా పిలిచే లాల్ చౌక్ కి మాత్రం వెళ్లొద్దని మా యాత్రని నిర్వహిస్తున్న వ్యక్తి మమ్మల్ని హెచ్చరించాడు. 2010 నాటికంటే ఇప్పటి పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉందని తెలుస్తోంది. భారత దేశపు ఉత్తర దిక్కున సహజమైన అందాల ఆభరణంగా అమరిన మన కాశ్మీరం ఎప్పటికి దురాక్రమణల్నీ, దౌర్జన్యాల్నీ వదిలించుకుని శాంతి గీతం పాడుతుంది?! అక్కడి అమాయక ప్రజలు ఎప్పటికి సంతోషంగా శాంతియుత జీవనాన్ని గడపగలుగుతారు? ఆ రోజులకోసం వేచి చూద్దాం.
Its extremely emotional. Writer has shown us the daily life of Kashmir. Its sad. I am living in a false world hoping it may not be this bad.
God bless Kashmir. Lets wait for a day when everyone realizes there’s only one god and there’s only one religion. In the name of religion, so much destruction is happening. It should stop.
LikeLike
Writer has expressed her anguish very vividly. I got the similar goosebumps while reading the post as when I stand for “Jana Gana Mana ” Where is the solution?? Truly can’t imagine how people can have so much hatred in the name of religion. I have been postponing to visit The Paradise on the Earth since 80s thinking that good days will come!!
I hope those strife free days will come and I will be able to visit andaala kasmiram in this janma…
LikeLike
Reblogged this on ద్వైతాద్వైతం and commented:
శాంతి నిండి, నవ్వుముఖాలు పూసే అందాల కాశ్మీరం గురించి కలలు కనే భారతీయులు దానిని కళ్లముందుకు సాక్షాత్కరించుకుందుకు ఇంకెన్నాళ్లు వేచి ఉండాలో!
LikeLike
It’s true that Kashmir is still a beautiful place by nature, but it comes to life only if /when there’s joy in life.
LikeLiked by 1 person