* * *
ఆ రాత్రి నిన్నూ నక్షత్రాన్నీ నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నాను!
నీ కబుర్ల మాయలో పడి ఆ ఒంటరి నక్షత్రాన్ని కాస్త నిర్లక్ష్యంగానే చూశాను!
ఊహకందని దూరానున్న నక్షత్రాన్ని
నీ సామీప్యం వెక్కిరిస్తుంటే జాలిజాలిగా చూశాను!
ఆకాశం నిండా శరద్రుతువు ఒక మోహపు వెల్లువై కమ్మిన ఈ రాత్రి….
నీ కబురందక ఈ మారుమూల విలవిల్లాడుతున్న నన్ను
ఆ నక్షత్రం చూస్తోంది!
ఊరుకొమ్మంటూ ఎదుట తానున్నానంటూ ఓదారుస్తోంది!