* * *
అంతులేని ఉద్వేగాల్ని మూటగట్టుకుని,
నా మీద దాడి చేస్తున్నావని ఆ తొలినాటి సమావేశం చెప్పలేదు !
ప్రపంచం పట్ల అభావంగా ఉన్న మమకారపు చెలమను
ఆ క్షణమే నిశ్శబ్దంగా త్రవ్వి తీస్తున్నావనీ తెలీలేదు !
కమ్ముకుంటున్న చీకటి రొజాయిల మధ్య నువ్వేదో చెబుతున్నట్టే ఉంది ……
వెచ్చని సూర్య కిరణాల్నిచూసి కేరింతలు కొట్టే ఉదయాలు,
నిద్రెరుగని కన్నుల్ని విస్తుపోయి చూస్తున్నాయి !
ఇప్పుడు ……..
నా ప్రమేయం లేకుండానే ఋతువులు మారుతున్నాయి……….
సముద్ర తీరాన్ని పలకరించే వేసవి సాయంకాలాలు,
నా మౌనాన్ని తాకి విస్తుపోతున్నాయి !
వర్షపు చినుకులు నన్నల్లుకున్న జలపాతాలై,
నా ఆనంద నాట్యానికై ఎదురుచూస్తున్నాయి !
సంవత్సరాల మధ్య సంధిని కుదిర్చే శీతగాలులు,
సంగతేంటని అడుగుతున్నాయి !
పరుగెత్తే నగరంలో నా ఏకాంతపు ద్వీపంలో………..
జవాబు కోసం తడుములాడుతుంటే
జనారణ్యంలోనూ అడవి పూల గుబాళింపు ఉంటుందనీ,
నెమ్మది నెమ్మదిగా ఆ మత్తు
నా అణువణువులోనూ ఇంకుతూ వస్తోందని తెలియనేలేదు !
యౌవనారంభపు రోజులు……….
అమ్మ మీద బెంగతో దిగిన రైలే ఎక్కి వెనక్కి పరుగెత్తే మనసు….
మరుపుకే రాని ఆ దిగుళ్లు క్రొత్తగా బాధిస్తున్నాయి !
కూనిరాగాల మధ్య అలవోకగా నడిచి వెళ్ళే నన్ను
ఆ మూలగా పసితనం పులుముకున్న అల్లరి మబ్బు అలా నిలేస్తోందేం?
నిలువ నీయని ఏ భావ తరంగం
నన్ను నీ వైపుగా పరుగులెత్తించిందో !
నిక్షిప్తమై ఉన్న ఇన్హిబిషన్స్ అన్నింటిని
గాలిపటాల్ని చేసి ఎటు ఎగురవేసిందో !
యధాలాపంగా, పలకరింపుగా , చెయ్యందుకున్నంత తేలిగ్గా
నీ మనసునూ అందుకోబోయానన్న వాస్తవం
నన్ను వణికిస్తుంటే …………
నాలో ఉరకలేసే నయాగరాలలో
ఊపిరాడక ఒంటరిగా మునకలేస్తున్నది నేనే, ఉక్కిరిబిక్కిరవుతున్నదీ నేనే!
అకస్మాత్తుగా నాకీ అశాంతి శాలువానెవరు కప్పారు?
నా అసహనానికి హద్దులెవరు చెరిపేసారు?
నీతో సహా ప్రపంచమంతా ఏం పట్టనట్టు తన చుట్టూ తాను తిరుగుతుంటే,
రహదారి ప్రక్కగా ఒత్తిగిల్లిన పసుపు రంగు గడ్డిపూలు మాత్రం
నన్ను చిరునవ్వుతో పలకరించాయి !
హద్దులెరుగని నీలాకాశం ఆపేక్షగా నా భుజాలపైకి వాలింది !
ఇప్పుడైనా…………..
ఓసారిలా వచ్చి నువ్వు చేసిన గాయాన్ని(?) చూడు !
అద్భుతం అండి….
LikeLike
ఊపిరి ఆడని అలజడి లా ఉంది ఈ కవిత, అద్భుతం!
LikeLiked by 1 person