* * *
కాళ్లల్లో చక్రాలు ఉన్నాయేమో అన్నట్టు ప్రతి నాలుగు నెలలకీ ఒకసారి రైలెక్కి దేశం మీదకి వెళ్లిరావటం అలవాటైపోయిందీ మధ్య. రేపు మనది కాదు కదా అన్నవాస్తవం వెన్ను తడుతున్నట్టూంది. దాని తాలూకూ అభద్రత మొదలైనట్టుంది లోపల్లోపలెక్కడో. మన దేశం వైరుధ్యాలపుట్ట అని తెలిసున్నదే. ముఖాలు ఏప్రాంతాల వారివైనా కొద్దో గొప్పో తేడాలతో మనవాళ్లే అని చెప్పుకోగలం. మన వాళ్లు అంటే మనదేశ ప్రజలని మాత్రమేనండీ, కులాలు, మతాలు కావుసుమా. ఈ వైరుధ్యాల మధ్య మనం అంతా ఒక్కటే అన్నది ఎన్నోరూపాల్లో వ్యక్తమవుతూనే ఉంటుంది. అలాటివి ఎన్నో ఎన్నెన్నో గమనిస్తూ ఉంటాను దేశంలో ఏ మూలకెళ్లినా. అదో కుతూహలం, ఒక సరదా. సహజంగా కనిపించే రూపురేఖలు దాటి ఇంకేదో సారూప్యతని వెతుకుతుంది మనసు. ఎందుకంటే ఎవరిని చూసినా ఏదో బాంధవ్యం ఉన్నదేమో అనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచం నాది, వీళ్లంతా నావాళ్లు అని నమ్మకం కాబోలు.
రోజూ వార్తా పత్రికలు చదువుతుంటే ఒకేలాటి సమస్యలు, నేరాలు దేశమంతా కనిపిస్తుంటే ఈ ఐకమత్య భావన ఎక్కడికీ పోదు అనిపిస్తుంది. మొన్నామధ్య రైల్లో వెళ్తూంటే ప్రక్కన కూర్చున్న పెద్దమనిషి చుట్టు జరుగుతున్న నేరాలు, ఘోరాలు గురించి మాట్లాడుతున్నాడు. ఆ క్రితం రోజు బెంగళూరులో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని ఒక క్యాబ్ డ్రైవరు రాత్రివేళ దారి తప్పించి, చెయ్యకూడని నేరం చేసి ఆమె మరణానికి కారణం అవటం గురించి చర్చ నడుస్తోంది. నలుగురూ నాలుగురకాలుగా మాట్లాడుతున్నారు. నిష్కారణంగా హింసించి , ప్రాణాన్ని తీసెయ్యటం ఎంత అమానుషం! ఈ క్యాబ్ డ్రైవర్లకి మానవత్వం ఉండదా? వీళ్లకి కుటుంబాలు ఉండవా? మంచి చెడులు ఎవరూ చెప్పరా? చిన్నప్పుడు కూడా ఎలాటి నీతి కథలు వినలేదా? చదువు, సంస్కారాలు నేర్వలేదా? చదువుకోకపోవటానికీ, ఇలాటి అమానుష ప్రవర్తనకి సంబంధం ఉందా? చదువుకుంటే మానవత్వంతో ప్రవర్తిస్తాడని గ్యారంటీ ఉందా? ఏ మతమో, విశ్వాసమో ఏమీ లేకుండనే పెరిగేడా? ఏ మతమైనా కానీ మంచిని గురించే కదా నేర్పేది! మరి ….ఎందుకిలా? చుట్టూ ఉన్న నలుగురూ రకరకాల అభిప్రాయాలు చెబుతున్నారు. అవును, ఎవరిని అడగాలి. జరుగుతున్న అన్యాయాలకి నిస్సహాయంగా చూస్తూ, బ్రతికేస్తున్న మనం కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమేమో అనే ఒక బాధ మనసును తొలుస్తూనే ఉంది.
వెళ్లవలసిన ప్రాంతం చేరటం, రైలు దిగి హోటల్కి వెళ్లి మర్నాడు చెయ్యవలసిన యాత్రకు సకలం సిధ్ధం చేసుకోవటం అయింది. తెల్లవారి ఠంచనుగా ముందుగా బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చేసింది. సమయపాలన బావుంది. నాతో పాటు నా మేనకోడలు ప్రియ ఉంది. ప్రయాణం మొదలు పెడుతూనే ‘ మంచి హిందీ పాటలు విందాం ‘ అంది క్యాబ్ డ్రైవర్తో. అతను సలీమ్. ఇరవై-పాతిక ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నాడు. చక్కగా డ్రెస్ చేసుకుని హుందాగా ఉన్నాడు. అతను అన్నాడు, ‘ మేడమ్, ప్రయాణం మొదలు పెడుతూ ప్రతిరోజూ ఒక పావుగంట ఆధ్యాత్మిక సంగీతం వినటం అలవాటు. మీకు అభ్యంతరం లేకపోతే……….’ వెనక్కి తిరిగి చాలా పొలైట్ గా అడిగేడు. అతని అలవాటు, నమ్మకం గౌరవించడానికి నాకు, ప్రియ కి అభ్యంతరం అనిపించక సరే అన్నాం. నాకు ముచ్చట వేసింది ఆ పిల్లవాడి మాటతీరు, అతని అలవాటు.
ఇక్కడ ఆశ్చర్యం కలిగించిందేమిటంటే దేశానికి తూర్పున, పశ్చిమాన, దక్షిణాన, ఉత్తరాన కూడా అన్ని చోట్లా క్యాబ్ డ్రైవర్లు ఇలాటి ఒక సంప్రదాయాన్ని(?), ఆధ్యాత్మిక వైఖరినీ చూబించటం బావుంది. ఎందుకంటే ఒక విశ్వాసమో, లేదా ఆలోచనో మనిషిని మరింత బాధ్యతాయుతంగా తయారు చేస్తుంది. ఇలాటి నమ్మకాలు కనీసం వారిలో పాపభీతిని కలిగిస్తాయి. అయితే వీరంతా దాదాపు యువకులే. దుస్తులు విషయంలోను, కంటికి కనిపించే తీరులోనూ వయసు ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్నో లేదా ఒక నిర్లక్ష్య ధోరణినో ప్రదర్శిస్తున్నట్లున్నా వృత్తిపరమైన బాధ్యత పట్ల గౌరవ సూచకంగా మెలగటం మెచ్చుకోతగ్గది. నిజానికి అలాటి ప్రవర్తన వారి వృత్తికి అవసరం కూడా. ఎక్కువ మంది స్కూలు చదువులు ఎరగమనే చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ మన సమాజపు ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు తెలియనిదేముంది? పాఠశాలలు, ఉపాధ్యాయులు లేని చోట వ్యక్తుల ప్రవర్తనని తీర్చిదిద్దేందుకు మతపరమైన విశ్వాసాలు, ఆధ్యాత్మిక వాతావరణం కొంతవరకు సహాయం చేస్తాయి. తప్పుఒప్పుల అవగాహన కలిగిస్తాయి.
అన్నట్లుగానే పావుగంట తరువాత చక్కని అభిరుచి ఉన్న పాటలు పెట్టేడు. నాలో ఉన్న జర్నలిస్ట్ బుధ్ధి అతన్ని సహజంగానే కబుర్లలోకి దింపింది. ఆ ప్రాంతం గురించిన వివరాలు, మధ్య మధ్య తన స్వవిషయాలు ఓపిగ్గా చెబుతున్నాడు. ఆశ్చర్యకరంగా అతను స్కూల్ కే వెళ్లలేదని చెప్పాడు . ఇంగ్లీషు తప్పులు లేకుండా మాట్లాడటం చూసి చదువుకున్నవాడనే అనుకున్నాను. ఒకసారి గుజరాత్ లో ద్వారక నుండి పోరుబందరు వస్తూంటే క్యాబ్ డ్రైవరు తన కుటుంబం గురించి చెబుతూ తనూ, తన భార్య పిల్లల చదువుల కోసం కష్టపడుతున్నామని, తమకు అక్షరాలు కూడా రావని చెప్పాడు. పట్టుదలగా పిల్లలని మంచి స్కూల్లో, అదీ ఇంగ్లీషు మీడియం స్కూల్లో పొరుగూళ్లో చదివిస్తున్నానని చెప్పాడు. ఆ రోజు రైల్లో వారు మాట్లాడిన మాటలు ఆనాటి సంఘటన తాలూకు బాధ, ఆవేశంలో వెలిబుచ్చినవి. కానీ నిజానికి తమకంటూ ఒక నిర్ణీతమైన ప్రవర్తన, తమ కుటుంబం గురించి చెబుతున్నప్పుడు కనిపించే ఒక గర్వం, ప్రేమ క్యాబ్ డ్రైవర్లు చాలా మందిలో చూస్తూనే ఉన్నాను. బహుశా నాలాగే మరెంతో మంది ఈలాటి అనుభవాన్ని చూస్తూనే ఉంటారు.
మరెందుకు జరగరానివి, అమానుషమైనవి మనమధ్య జరుగుతున్నాయి? అవన్నీ క్షణకాలపు ఆవేశాలేనా? తమవైన ఆవేశాల పట్ల , అసహనాల పట్ల అదుపు లేకపోవటమేనా కారణం? ఈ ఆవేశాల్ని, అసహనాల్ని దారి మళ్లించుకోగల మానసిక స్థిరత్వం, ఆలోచన, విచక్షణా కొరవడటమేనా కారణం? అవును. అందుకే శరీరం మీద, ఆలోచనమీద, చేతల మీద అన్నింటిమీదా నియంత్రణని సాధిం చవలసి ఉంది. దానికి శారీరక, మానసిక వ్యాయామం, శిక్షణ ఎవరికివారు తమదైన శైలిలో ఇచ్చుకోవలసిందే. అందుకోసం మనం కాషాయం కట్టనక్కరలేదు. ఎదుటివారిని గౌరవించగలిగితే చాలు.
నా ఆలోచనల మధ్య క్యాబ్ ఆగటం చూసి ఉలికిపడ్డాను. మా ఎదురుగా ఒక మినీ లారీ లాటిది అడ్డం పెట్టబడి ఉంది. ఆ డ్రైవరు దిగి వచ్చి సలీమ్ ని డోర్ తియ్యమని అడగటం, ఇతను తియ్యటంతోటే అవతల వ్యక్తి సలీమ్ చెంపల మీద గట్టిగా రెండు దెబ్బలు వెయ్యటం చూసి, నేను వెనక సీట్లోంచి దిగాను. ‘ఏమిటి జరుగుతోంది ‘ అని అడుగుతుంటే ఆవతల వ్యక్తి తడబడుతున్న మాటలతో చెప్పాడు, ‘నా బండిని దాటి వెళ్లిపోతున్నాడు, లెక్కలేదా?’ అన్నాడు. నాకు అర్థం కాలేదు కానీ అతను బాగా త్రాగి ఉన్నాడని అర్థం అవుతోంది. అతని తో పాటు ఉన్న మరొకతను ‘పద,పద’ అంటూ అతన్ని చెయ్యి పుచ్చుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. తాగిన వ్యక్తి పిచ్చి బలంతో అతని చేతులు తోసేసి,’ మేడం, చెప్పండి, నా బండి ముందు వెళ్తోంది కదా, నన్ను ఓవర్ టేక్ చేసేసి దర్జాగా వెళ్లిపోతున్నాడే. అదేనా పధ్ధతి?’ అన్నాడు తడబడుతూనే. నాకు అతని పరిస్థితి అర్థమైంది. త్రాగి ఒళ్లు తెలియని స్థితిలో డ్రైవ్ చేస్తున్నాడు, అతను మాట్లాడేది అతనికే తెలియని స్థితి.
‘నేను అనారోగ్యంతో ఉన్నాను. హాస్పిటల్ కి వెళ్లే తొందరలో ఉన్నాం ‘ అని అతన్ని సమాధానపరిచే ప్రయత్నం చేస్తూ, అతని కూడా ఉన్న వ్యక్తిని డ్రైవింగ్ తెలుసో లేదో కనుక్కుని అతన్ని డ్రైవ్ చెయ్యమని, జాగ్రత్తగా గమ్యం చేరమని హితబోధ చేసి కారు ఎక్కేను. సలీమ్ ని అడిగేను, ‘ సలీమ్, నీకు అతను ముందే తెలుసున్నవాడా?’ అని. ‘లేదు మేడమ్, ఇక్కడ మతకలహాలు తరచు జరుగుతూంటాయి. అతను నన్ను కొట్టినప్పుడు నేను తిరగబడితే తాగి, ఒళ్లు తెలియని స్థితిలో ఉన్న అతను వెంటనే పడిపోతాడు. కానీ ఈ గొడవ నలుగురి కళ్లల్లో పడీ, అందరూ పోగైతే పెద్ద గొడవ అయిపోతుంది. ఇక్కడ హిందువులు, ముస్లింలు అందరం కలిసి జీవిస్తున్నాం. ఇలాటి వాటిని పెద్దవి చేసుకుంటే కొందరి తలలు పగులుతాయి. అందుకే మౌనంగా ఊర్కున్నాను, నా తప్పు లేదని తెలుసు. కానీ…………….అల్లా చూసుకుంటాడు’ అన్నాడు తను నమ్మిన ధర్మాన్ని తలుచుకుంటూ. నాకు నోట మాట రాలేదు. అతని సంస్కారానికి అభినందించకుండా ఉండలేకపోయాను.