* * *
ఈ మధ్య మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఉన్న గురుద్వారా గురించి విని అక్కడికి వెళ్లేం. చాలా పెద్ద పట్టణం. విశాలమైన వీధులు. దాదాపు ఆరు లక్షల పైగా జనాభా ఉంది. ఇది మహారాష్ట్రలో 8వ పెద్ద పట్టణంగా చెబుతారు. నాందేడ్ పట్టణానికి ఉత్తరంగా గోదావరి నది ప్రవహిస్తూ ఉంది.
*
అన్ని ప్రధాన కూడళ్లలోనూ ‘ సైలెంట్ సిటీ- బెటర్ సిటీ- సే నో టు హార్న్’ అన్న బోర్డులు కనిపించాయి. వాటిని చూసి ఆశ్చర్యపోలేదు కానీ ముచ్చటగా ఆ మాటలని అమలులో పెడుతున్న అక్కడి ప్రజల్ని చూసి అక్కడున్న రెండు రోజులూ తెగ ఆశ్చర్య పోయాను ఎందుకంటే, మన జనానికి ఏదైనా ఒక నియమం ఉంటే అది తోడే దాకా ( అంటే అది అతిక్రమించేసే దాకా) తోచదు కదా. ఒక సరదా అనండి, లేదా ఒక కొంటెతనం అనండి. ఏమవుతుందో చూద్దాం అనే కుతూహలం కూడా కావచ్చు. ఈ విధమైన ధోరణి చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. కానీ దానికి భిన్నంగా కనిపించిందీ పట్టణం. అదే అంటే వేదాంతిలా నవ్వేడు మా క్యాబ్ డ్రైవర్. నా అభిప్రాయాన్ని ఒప్పుకోలేనన్న అతని అభిప్రాయం అర్థమైంది. అతను అక్కడి వాడు కనుక ఆ విషయం నాకంటే స్పష్టంగా ఎరిగున్నవాడే మరి.
ఈ శబ్ద కాలుష్యం లేకపోవటం పూణే నగరాన్ని జ్ఞాపకం తెచ్చింది. అక్కడ ఇలాటి బోర్డులు లేకపోయినా రోడ్లమీద వాహనాలు ఎలాటి అనవసర శబ్దాల్ని చెయ్యవు. అంత పెద్ద నగరంలో, ఆ ట్రాఫిక్ లో సుశిక్షితులైన సైనికుల్లా అలా వాహనాలు రోడ్ల మీద ప్రయాణించటం చూస్తుంటే చాలా బావుంటుంది.
దీనికి భిన్నంగా దిల్లీ నగర వీధులు వాహనాలు చేసే ధ్వనికాలుష్యంతో హోరెత్తి పోతుంటాయి. దేశరాజధాని హోదాలో ఉన్న ఆ నగరంలో అవసరం ఉన్నా, లేకపోయినా ప్రతి వాహనం అసహనాన్ని ప్రకటిస్తూనే ఉంటుంది. సిగ్నల్ ఫ్రీ రోడ్లలో కూడా గందరగోళం సృష్టిస్తుంటారు. మిగిలిన దేశంలో ప్రజలకంటే కొంచెం ఎక్కువ హక్కులు ఉన్నట్లు ప్రకటిస్తుంటారు. ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆకుపచ్చని దీపం కనిపించక ముందే ముందు వాహనం మీదకి దూసుకొస్తూన్నట్లు హార్న్ మోగించి అల్లరి మొదలు పెడతారు. ఇక్కడ వయసుకు సంబంధం లేదు. టీనేజ్ పిల్లలూ అంతే. తలనెరిసిన వాళ్లు అంతే. బహుశా ఇది ఒక అనారోగ్యం. మరి అసహనాన్ని నిస్సంకోచంగా పబ్లిక్ లో ప్రదర్శించే తీరుని ఏమని అందాం?
గాంధీజీ ఒక చోట చెబుతారు-‘నేను అత్యంత సిగ్గుపడే క్షణాలు బహిరంగంగా నాకోపాన్ని అదుఫు చేసుకోలేకపోయిన సందర్భాలు’ అని. అలాటి నిజాయితీ, ఉత్తమ సంస్కారం అలవడేందుకు మనం చాలా కృషి చెయ్యాలి.
అయినా దిల్లీ వరకూ ఎందుకు గానీ, మన ఆంధ్ర దేశంలో ఈ శబ్ద కాలుష్యం చెప్పుకోదగ్గ తీవ్రస్థాయిలోనే ఉంది. ఇక్కడి వేడి వాతావరణానికి తగ్గట్టు జనం రోడ్డు మీదకి వచ్చేసరికి కనీస మర్యాదల్ని, స్వభావ సిధ్ధంగా ఉన్నసంస్కారాల్ని ప్రక్కకి తోసి ప్రక్కనే ప్రయాణిస్తున్న వాహనదారుణ్ణి , ఎదురుగా వచ్చే వాహనదారుణ్ణీ కూడా విసిగించి, తమలోని అసహనాన్ని ఇంచక్కా వారిలోకీ ఇంజెక్ట్ చేస్తారు.
ఈ మధ్య మా బంధువులు అమెరికా నుండి వచ్చారు. వాళ్లకి నా డ్రైవింగు స్కిల్స్ చూబించాలని ఉబలాట పడి విజయవాడ లో ప్రధాన రహదారి ఎమ్.జి.రోడ్డు మీద ఒక అరగంట తిప్పి తీసుకొచ్చాను. వాళ్లల్లో ఒక ఆరేళ్ల పిల్లవాడు నిర్మొహమాటంగా చెప్పేసేడు, ‘ ఆంటీ మీ డ్రైవింగు ఓకే. కానీ యు హాంక్ ఎ లాట్’. వాడి మొహం అప్రసన్నంగా ఉంది మరి. వాళ్ళమ్మ పాపం సర్ది చెప్పబోయింది, ‘మరి రోడ్డుమీద అన్ని రకాల వాహనాలు వెళ్తున్నాయి కదా, దారి ఇమ్మని వాళ్లకి చెప్పాలిగా ‘ అంటూ నావైపు చూసింది మొహమాటంగా.
వాడు చిత్రంగా చూసాడు నావైపు, వాళ్ల అమ్మ వైపు. వాడికి అమెరికా రోడ్లు, ఆ ట్రాఫిక్ గుర్తొచ్చి ఉంటుంది. వాళ్ల అమ్మ మాత్రం ఇల్లు చేరే వరకు, ‘ ఆంటీ డ్రైవింగ్ చాలా బావుంది, ఇన్ని రకాల వాహనాలమధ్య ,ఇంత బిజీ రోడ్డులో డ్రైవ్ చెయ్యటం మాటలు కాదు’ అని చెబుతూ కొడుకు వైపు ఓ చూపు గట్టిగా చూసింది. వాడు ఆ విషయం వదిలి కార్టూన్ నెట్ వర్క్ చూడటంలో మునిగి పోయాడు ఇల్లు చేరుతూనే.
ఇంతకీ నాందేడ్ ప్రయాణం గురించి మొదలెట్టి ఇరుకిరుకు ట్రాఫిక్లోకి మళ్లించేసేను మిమ్మలందరినీ. నాందేడ్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు గ్రహించాను ఈ ట్రిప్ లో. ఇది సికింద్రాబాదు-మన్మాడ్ సెక్షన్లో ఉన్న పెద్ద రైల్వే స్టేషన్. స్టేషన్ శుభ్రంగా ఉంది. నిత్యం 48 జతల రైళ్లు ఈ స్టేషన్ మీదుగా నడుస్తుంటాయి. ఎన్.హెచ్. 222, 204, 161 ఈ పట్టణం మీదుగా వెళ్తున్నాయి. ఇక్కడ సిక్కులకు పవిత్రమైన గురుద్వారా ఉండటంతో సంవత్సరానికి పది మిలియన్ల మంది దాకా యాత్రీకులు ఈ ప్రదేశాన్ని దర్శిస్తారుట.
*
ఇక్కడ గురుద్వారా చూడదగిన ప్రదేశం. ఇది విశాలమైన ఆవరణలో ఉంది. మహారాష్ట్రలో కాక పంజాబు రాష్ట్రంలో ఉన్నట్టు అనిపించింది ఆ వాతావరణం, అక్కడ అసంఖ్యాకంగా ఉన్న సిక్కుమతస్థులనూ చూసినప్పుడు. అసలు ఈ పట్టణానికి శిక్కులకీ మధ్య సంబంధం ఏమిటని ఆరా తీస్తే……….
ఈ పట్టణం మీదుగా సిక్కుల మొదటి గురువు గురు నానక్ దక్షిణాది వైపు ప్రయాణించారు. పదవ సిక్కు గురువైన గురుగోవింద్ సింగ్ తన ఆఖరి మజిలీగా ఇక్కడకి వచ్చిఇక్కడే నిర్యాణం చెందారు. అంటే సిక్కుల మొదటి గురువు, ఆఖరి గురువు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడే గురుగోవింద్ సింగ్ తనను ఆఖరి గురువుగా ప్రకటించుకుని, తన అనంతరం సిక్కుల పవిత్ర గ్రంధమైన ‘గ్రంధ సాహిబ్’ ను సిక్కుల పవిత్ర గురువుగా ప్రకటించారు. అదే గురు గ్రంధ సాహిబ్. రంజిత్ సింగ్ ఈ గురుద్వారాను కట్టేడు. గురుగోవింద్ సింగ్ అవశేషాలను, అనేక ఆయుధాలతో సహా ఇక్కడ గురుద్వారాలో ఉంచారు. లోపలకి ప్రవేశించేముందు ద్వారానికి ఇరుప్రక్కలా కత్తిని నడుమున ధరించిన స్త్రీలు నిలబడి, సందర్శకులను ఒక పద్ధతిలో వరుసగా పంపుతున్నారు. స్త్రీలు, పురుషులూ కూడా తలమీదుగా వస్త్రాన్ని కప్పుకున్నారు. ఈ రకమైన తలపై ఆచ్చాదన ధరించే విషయాన్ని ఉత్తరాది ఆలయాల్లో, పవిత్ర స్థలాల్లో చూస్తాము. మేము వెళ్లిన ఆ సాయం సమయం రంగురంగుల విద్యుత్ దీపకాంతుల మధ్య గురుద్వారా అత్యంత సుందరంగా కనిపించింది. లోపల ప్రార్ధన చదువుతున్నారు. అనేక వందల మంది అక్కడ ఆవరణలో కూర్చుని ఉన్నారు. అది శెలవురోజు కాదు, వారాంతపు రోజు కాదు అయినా ఆ రద్దీ చూస్తే ఆశ్చర్యం వేసింది.
*
ఇది అన్ని మతాల ప్రజలు సందర్శించవచ్చన్న బోర్డ్ ను గురుద్వారా ముఖ ద్వారం దగ్గర పెట్టారు. ఇక్కడి కట్టడం ప్రత్యేకమైనది. అద్భుతమైన పనితనంతో కూడిన గోడలు, పైకప్పు భాగాలు కళ్లు తిప్పుకోనీయవు. దేశంలో సిక్కులకున్న ఐదు ప్రధానమైన ప్రార్ధనా స్థలాలలో ఇక్కడ నాందేడ్ లో ఉన్న గురుద్వారా ఒకటి. యాత్రీకులకోసం విశాలమైన వసతి సముదాయం, ఒక విశాలమైన హాలులో శుభ్రమైన పరిసరాలలో నిర్విరామంగా యాత్రీకులకోసం అందిస్తున్న భోజన సదుపాయం (లంగరు హౌస్) , యాత్రీకులు సేద తీరేందుకు చక్కని ఉద్యానవనాలు, రంగురంగుల సంగీతాన్ని అందించే ఫౌంటెన్లు తో గురుద్వారా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడ వడ్డించిన భోజనం కూడా సాత్వికాహారం. చపాతి, వరి అన్నం, ఆకుకూర పప్పు, దుంపలు, బఠాణీలతో చేసిన మరొక కూర, పరవాన్నం తో రుచికరంగా అందిస్తున్నారు. అక్కడక్కడ హుండీలు ఉన్నాయి. హుండీలో కానుకలు వెయ్యమని ఎవ్వరూ ప్రత్యేకంగా ప్రోత్సహించరు. బయట ఉన్న దుకాణాల సముదాయంలో సిక్కులు ధరించే అనేక వస్తువుల్ని అమ్ముతున్నారు.
పట్టణం చాలా వరకూ శుభ్రంగా ఉందని చెప్పచ్చు. చక్కని దక్షిణాది అల్పాహారాలు కూడా దొరుకుతాయి , అదీ మితిమించని ధరలలో. రెండురోజులు సరదాగా గడిపి రావచ్చు. మన తెలంగాణా జిల్లాలైన ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ జిల్లాలు నాందేడ్ కు దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. అందువల్లనే నాందేడ్ లో మరాఠీ తో పాటు తెలుగు భాషను కూడా వింటాం.
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike