* * *
Continued from Part II
కేరళలో ఉండేదన్న మాతృస్వామ్య వ్యవస్థ గురించిన వివరాలు తెలుసుకోవాలన్నకోరిక కేరళలో కాలు పెట్టినప్పటినుండి నన్ను వెంటాడుతూనే ఉంది. మేము దిల్లీలో ఉన్న రోజుల్లో సాయంత్రపు నడక కోసం ప్రక్కనే ఉన్న పార్క్కు వెళుతూండేదాన్ని. అక్కడ మా ఇంటి దగ్గర పంజాబీ స్త్రీ ఒకరు తరచు నన్ను పలకరిస్తూ ఉండేది. ఆమె ఒక రోజు అడిగింది’ మీ దక్షిణాదిన కేరళ రాష్ట్రంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉందని విన్నాను. నిజమేనా?’ అని. నాకూ ఆ వివరాలు గురించిన కుతూహలం చాలా కాలంగా ఉందని, ప్రస్తుత పరిస్థితులు తెలియవు అని చెప్పేసేను.అలెప్పీలో ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని నాకు పరిచయం అయ్యారు. కేరళ, మేఘాలయ లలో ఉందని చెప్పే మాతృస్వామ్య వ్యవస్థ ఇప్పుడు కేరళలో లేదని చెప్పింది. పూర్వపు రోజుల్లో పురుషుడు ఒకరికి మించి స్త్రీలతో సంబంధాలను కలిగి ఉండటంతో ఇంటి వ్యవహారాలు, సామాజిక, సాంస్కృతిక వ్యవహారాలు, పిల్లల్నికనే విషయంలో నిర్ణయం వంటి విషయాల్లో స్త్రీకి పూర్తి అధికారం ఉండేదని, దీనిని మాతృస్వామ్య వ్యవస్థలో ఒక రకమైన పధ్ధతిగా ‘మరుమక్కత్తియం’ పేరుతో పిలిచేవారని చెప్పింది.
రానురాను అక్కడి సమాజంలో ఈ పధ్ధతి, అంటే కుటుంబ వ్యవహారాల్లో స్త్రీ నిర్ణయాధికారాలు పాతకాలపు భూస్వామ్య వ్యవస్థ చిహ్నాలుగా భావించి సమాజంలో నిరసన ఆరంభమైందని, కేరళ ప్రభుత్వం 1975 సంవత్సరంలో ఉమ్మడి కుటుంబం పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. పటిష్టమైన వివాహ వ్యవస్థ, పురుషుడు ఒక్కరినే వివాహం చేసుకోవాలన్న నియమం సమాజంలో అమలు చెయ్యటం మొదలైంది. స్త్రీకి గార్డియన్ గా పురుషుణ్ణి నిర్ణయించటంతో సమాజంలో పూర్తి పితృస్వామ్య వ్యవస్థ నెలకొల్పబడింది. అయినా ఇదివరలో కూడా స్త్రీ కి కేవలం ఆస్తి హక్కు మాత్రమే వారసత్వ హక్కుగా వచ్చేదనీ, మిగిలిన కుటుంబ పరమైన అధికారాలన్నీ పురుషుడి చేతిలోనే ఉండేవని చెప్పుకొచ్చింది.ప్రపంచంలోనే మాతృస్వామ్య వ్యవస్థ అంటే కుటుంబంలో స్త్రీకి పూర్తి స్థాయిలో తిరుగులేని అధికారాలు అనేవి ఎక్కడా లేవని ఆమె తీర్మానించింది. మేఘాలయాలో ఖాసీ, గారో, జాంటియా తెగల్లో కనిపించే ఆధిపత్యత కూడా ఈ కోవలోకి చెందినదే అని తేల్చేసింది. అయినా ఇప్పటికీ కేరళలో కొన్ని కుటుంబాలలో మగపిల్లలు తల్లి పేరును ఇంటిపేరుగా వాడుకోవటం ఉందని చెప్పింది. పుట్టే బిడ్డ మగబిడ్డ కావాలనే ఇక్కడ కూడా ప్రజలు కోరుకుంటారని చెప్పింది.
కేరళ అనగానే అక్కడ ప్రతి సంవత్సరం జరిగే స్నేక్ బోట్ రేస్ మన మనసుల్లో మెదులుతుంది. అది అలెప్పీలోని ‘పున్నమడ’ సరస్సులో జరుగుతుంది. దీనిని మలయాళ భాషలో ‘వల్లమ్ కలి’ అంటారు. వల్లం కలి అంటే ఇంలీషులో ‘బోట్ రేస్’ గా చెప్పవచ్చు. ఈ రేసు స్నేక్ ఆకారంలోని బోట్లలో జరగటం వలన స్నేక్ బోట్ రేస్ గా చెబుతారు. ప్రతి ఆగష్టు రెండొ శనివారం ఇది జరుగుతుంది. నీటీ మీద జరిగే క్రీడలలో ఈ స్నేక్ బోట్లు అతిపెద్దవైన క్రీడా పరికరాలుగా చెబుతారు. జవహర్ లాల నెహ్రూ 1952లో కేరళ వచ్చినప్పుడు ఆయనకు ఈ బోట్లలో అద్భుతమైన స్వాగతం లభించింది. ఈ బోట్ లో ప్రయాణించిన నెహ్రూ తనకు కలిగిన ఆనందాన్ని తెలియజేసేందుకు ఒక రోకింగ్ ట్రోఫీని బహుమతిగా ఇచ్చారు. దానిపైన ‘ట్రావన్కోర్-కొచ్చిన్ లలోని ప్రత్యేకమైన సామాజిక జీవితాన్ని తెలియజేసే ఈ బోట్ రేస్ విజేతలకు ఈ ట్రోఫీ’ అని అక్షరాలు రాసి ఉంటాయి. స్నేక్ బోట్లే కాకుండ ఇంకా అనేక రకాలైన బోట్ల రేసులు ఇక్కడ జరుగుతాయి. ఇది ఇక్కడి సందర్శకులకి అతి ప్రధాన ఆకర్షణ.
ఇక్కడి నుండి పాలక్కాడ్ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులో ప్రయాణం చేసేం. కేరళలో రోడ్డు రవాణా శాఖ వారి బస్సులలో ప్రయాణించదలచేవారికి అక్కడి ఇరుకైన రహదారుల్లో అతి వేగంగా నడిపే బస్సు డ్రైవర్లను చూసినప్పుడు కాస్త ఖంగారు అనిపించకమానదు.ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే కేరళ జాతీయ మార్గాలు, రాష్ట్ర మార్గాలు ఇరుకైనవి. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో రహదారుల్ని మరింత వెడల్పు చేసే ప్రయత్నంలో ఉండగా కేరళ మాత్రం చాలా సంవత్సరాలు దీనిని వ్యతిరేకించింది. ప్రకృతి సంరక్షణ గురించిన ఆలోచనే దీనికి కారణం.తమిళనాడులో లాగే స్థానిక బస్సు సర్వీసులు, ఆఫీసు కార్యాలయాలు, బోర్డులు అన్నీ స్థానిక భాష మలయాళం లోనే ఉంటాయి. మేము కేరళలో తిరుగుతున్నప్పుడు రాష్ట్ర రవాణా వారి బస్సులలో తిరుగుదామని కొన్ని చోట్ల ప్రయత్నించినప్పుడు ఏ బస్సు ఎక్కాలో, ఎటువెళ్ళి ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. చదువురాని వాళ్లుగా అవస్థ పడ్డాము. నగరాల్లో ఇంగ్లీషు మాట్లాడేవాళ్లు కనిపిస్తారు. చిన్నచిన్నపట్టణ, పల్లె ప్రాంతాల్లో స్థానిక భాష తెలియక పోతే చాలా కష్టం అనిపించింది. పాలక్కాడ్ పశ్చిమ కనుమల పాదాల వద్ద ఉంది. ఈ ప్రాంతం అందమైన కొండలకు, వన్య ప్రాణ సంరక్షణ కేంద్రాలకు, అడవులకు, డ్యాములకు, నదులకు, అరుదైన పక్షులకు, చారిత్రక కట్టడాలకు,సాంప్రదాయ ఆయుర్వేద వైద్య కేంద్రాలకు పేరుపొందింది. ఇది సందర్శకులను పర్యాటకానికి ఆకర్షించే ప్రాంతం. పలక్కాడ్ జిల్లా లో నెల్లియమ్పతి కొండలు, సైలెంట్ వేలీ నేషనల్ పార్క్ వంటి ఆకర్షణలున్నాయి. పాలక్కాడ్ లో పెద్ద బజారు అనేక రకాలైన సాంప్రదాయ గంటలు, నెమలి ఆకారంలో ఉన్న దీపపు సెమ్మెలు, ట్రావెన్కూర్ చీరలు కు ప్రసిద్ధి. అంతేకాక త్రిసూర్ తరవాత పాలక్కాడ్ లో బంగారు ఆభరణాలుకు అనేక దుకాణాలున్నాయి.
పాలక్కాడ్ లో 500 సంవత్సరాల క్రితం నిర్మించిన జైన దేవాలయం చూడదగ్గది. ఇక్కడి భగవతి అమ్మవారి దేవాలయాలు రెండు ప్రసిధ్ధమైనవి. ఒకటి స్వయంభూ అమ్మవారు. ‘ఏమూర్ భగవతి’ అమ్మవారి దేవాలయం గురించిన ఒక కథ ప్రచారంలో ఉంది. ఒక భక్తుని కోరిక మన్నించిన అమ్మవారు అతనికి దర్శనం ఇచ్చేందుకు సమ్మతించి, ఆ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వరాదని షరతు పెడుతుంది. కాని ఆ భక్తుడు అమ్మవారు తనను అనుగ్రహించి దర్శనం ఇవ్వబోతూందన్న విషయాన్ని తనలో ఉంచుకోలేక అందరికీ చెప్పేస్తాడు. అమ్మవారు దర్శనం ఇవ్వబోతూండగా అక్కడ చేరిన ప్రజలని చూసి అంతలోనే మాయమవుతుంది. అక్కడి వారికి ఆమె తాలూకు చెయ్యి ఒక్కటే చూసే భాగ్యం కలుగుతుంది. అందువల్లనే అక్కడి గర్భ గుడిలో దేవత విగ్రహం బదులుగా ఒక ‘ఎత్తిన చేయి’ రూపాన్ని పూజిస్తారు. ఇక్కడ దేవతను రోజులోని మూడు సమయాల్లో మూడు రూపాల్లో పూజిస్తారు. ఉదయసమయాన అమ్మవారిని సరస్వతిగానూ, మధ్యాహ్నం లక్ష్మిగానూ, సాయంత్రం దుర్గగానూ పూజిస్తారు. దేవీ నవరాత్రులు ఇక్కడ ఘనంగా జరుపుతారు.
పాలక్కాడ్ కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘నెల్లియంపతి’ కొండలు ఇక్కడి వేసవి విడిది. ఇక్కడ పర్వతారోహణ కు మంచి ఆదరణ ఉంది. పాలక్కాడ్ కు 12 కిలోమీటర్ల దూరంలో ‘మలంపుర’ డ్యాం , దాని చుట్టూ ఉన్న అందమైన తోట ‘కేరళ రాష్ట్రానికి బృందావనం’గా పేరుపొందింది. ఇక్కడ ఆకుపచ్చని లాన్స్, నదులు, చుట్టూ కొండలు, అనేకరకాల పూల తోటలు, అనేక రకాల స్నేక్స్ కలిగిన స్నేక్ పార్క్, చిన్నపిల్లలకోసం నిర్మించిన పార్క్ చూడదగ్గవి. ఈ రిజర్వాయర్ లో చేపలు పట్టేందుకు, బోట్ విహారానికి అనువైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ జపాన్ స్టైల్ లో ఒక పూల తోట కూడా ఉంది. భరతపుర నది మీద హ్యాంగింగ్ బ్రిడ్జ్ చెప్పుకో తగ్గది. ఈ తోటల మీదుగా 60 అడుగుల ఎత్తులో ఉన్న రోప్ వే మార్గంలో 20 నిముషాలపాటు విహరించవచ్చు. ఇది దక్షిణ భారతంలోని మొదటి రోప్ వే. ఇంతే కాక ఇక్కడ ఈ తోటల నడుమ ఒక రోడ్ రైలు కూడా ప్రత్యేక ఆకర్షణ. మొదటి రాక్ గార్డెన్ రూపకర్త, చండీఘడ్ ను నిర్మించిన నేక్ చంద్ దిల్లీ లోని అప్పుఘర్, ముంబై లోని ఎస్సెల్ వరల్డ్ నమూనాలతో కేరళలోని మొదటి అమ్యూజ్ మెంట్ పార్క్ మలంపుర లో నిర్మించాడు. ఇది ఫ్యాంటసీ పార్క్ గా పేరు పొందింది. ఇక్కడ ఆకర్షణీయమైన యక్షి శిల్పం చెప్పుకోదగ్గది.
పాలక్కాడ్ కోట పాలక్కాడ్ పట్టణం మధ్యలో ఉంది. ఇది అత్యంత సుందరమైనది. కేరళలో సంరక్షించబడుతున్న కోటలలో ఉత్తమమైనది. ఇది 18 వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ చేత నిర్మించబడింది. పశ్చిమకనుమల కిరువైపుల ఉన్న ప్రాంతాల మధ్య సంబంధ బాంధవ్యాల కొరకు ఇది నిర్మించబడింది. దీనిని ఇప్పుడు ఫోర్ట్ మైదాన్ లేదా కొత్త మైదానం అని పిలుస్తారు. ఇక్కడ క్రికెట్ మాచ్ లు, ఎగ్జిబిషన్లు , సభలు జరుగుతుంటాయి. ఒకప్పుడు ఇక్కడ టిప్పు సుల్తాన్ కు చెందిన ఏనుగులు, గుర్రపు శాలలు ఉండేవి. ప్రస్తుతం మృతవీరుల స్మారకం స్తంభం, రాప్పాడి అనే పేరున్న ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, జిల్లా పర్యాటక శాఖవారి కార్యాలయం ఈ కోట ఆవరణలో ఉన్నాయి. కోట ప్రక్కనే ‘వాటిక’ అనే చిన్నపిల్లల పార్క్ ఉంది. కోట చుట్టూ ఉన్నవాకింగ్ ట్రాక్ మీద ఉదయం ,సాయంత్రం అనేకమంది నడిచేందుకు వస్తారు. పాలక్కాడ్ లో సంక్రాంతి సమయంలో ఎద్దులకు పరుగు పందేలు జరుగుతాయి.
ఇక్కడ నుండి తిరువనంతపురం ప్రయాణమయ్యాం. 1991 వరకు దీనిని ట్రివేండ్రం గా పిలుస్తున్నప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం ఈ నగరాన్ని తిరువనంతపురంగా స్థిరపరిచింది. ఇది కేరళ రాష్ట్రానికి రాజధాని నగరం. ఇక్కడ ప్రపంచ ప్రసిధ్ధి పొందిన అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. అనంత అంటే శేషు, పద్మనాభుడు అంటే విష్ణుమూర్తి. అనంతునిమీద శయనించిన పద్మనాభుని రూపం తిరువనంతపురానికి ఒక గుర్తుగా ఉంది. ఈ దేవాలయం అతి పురాతనమైనది మరియు అత్యంత సంపన్నమైనది. ఈ నగరం కరమణ, కిల్లీ నదుల తీరంలో ఉంది. ఈ నగరాన్ని గాంధీజీ ‘ఎవర్ గ్రీన్ నగరం’ గా పిలిచేవారు. తిరువనంతపురం కేరళలోని కొచ్చి తరువాత రెండవ పెద్ద నగరం. ఇక్కడ పన్నెండు లక్షల పైగా జనాభా ఉంది. ఈ రాష్ట్రానికి చెందిన 80శాతం ఐ.టి. ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇస్రో, విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్, కేరళ యూనివర్శిటీ మొదలైన అనేక ప్రముఖ విద్యాలయాలు, సంస్థలు ఉన్నాయి. తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇక్కడ ఉంది.
2012 సంవత్సరంలో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కేరళలో నివసించేందుకు ఉత్తమ నగరంగా దీనిని గుర్తించింది. కొచ్చిన్తో పాటు ఇది రాష్ట్రంలో ఉన్న 2 టయర్ సిటీ. ఇతర దక్షిణాది రాష్ట్ర రాజధానులలో ఉన్నట్టు ఇక్కడ పెద్ద పరిశ్రమలు లేవు. ముఖ్యమైనది, అభివృధ్ధిచెందినదీ ఐ.టి. పరిశ్రమ మాత్రమే. అనేక ప్రైవేటు ఛానెళ్లు ఇక్కడ విస్తారంగా రావటంతో వానికి అనుబంధంగా అనేక వృత్తులు, ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఇక్కడ హ్యాండ్ లూమ్, కొబ్బరి పీచు పరిశ్రమ కూడా ప్రసిధ్ధమైనవి. ఇక్కడ తీర ప్రాంతంలో రేవు పట్టణాల అభివృధ్ధి అంతగా జరగక పోవటం వలన ఈ ప్రాంతం మరింతగా అభివృధ్ధి చెందలేక పోయింది.
అనంత పద్మ నాభుని దేవాలయం అత్యంత విశాలమైనది. దేవాలయంలోకి పురుషులు కేవలం ధోతీ తో మాత్రమే అనుమతింపబడతారు.ఈ దేవాలయం అత్యంత సందడిగా ఉండే షాపింగ్ ప్రాంతంలో ఉంది. దీని చుట్టూ తూర్పుకోట కవచంలా ఉంది. ఇప్పటికీ ఈ దేవాలయం పైన ట్రావన్ కోర్ రాజ వంశీయుల ఆధిపత్యం నడుస్తోంది. కాని వారి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఇప్పుడు కోర్టులో వాదన జరుగుతోంది. ఈ గుడిలో ఒక మార్మికత ఉంది. గుడి అందాన్నివర్ణించే ప్రయత్నం చెయ్యను, ఎందుకంటే దానికి న్యాయం చెయ్యలేను.మూడు తలుపులు ఉంటాయి గర్భగుడికి. అది చీకటి మయం. ఈ దేవాలయంలోని అనంత పద్మ నాభుడు శేషుని వాహనంగా చేసుకుని పవళించిన అతి పెద్ద విగ్రహం ఉంది. ఒక తలుపు లోంచి తల భాగం, మరో తలుపులోంచి నడుము భాగం, మరో తలుపులోంచి కాళ్ళు, పాదాలు చూడాలి. నల్లని రాతి విగ్రహం కళకళ లాడుతూ మన ప్రాణాల్ని జివ్వు మనిపిస్తుంది. శ్రీరంగం లోని దేవాలయం కళ్ల ఎదుట కనపడక మానదు. ఈ దేవాలయం చుట్టూ అతి పెద్దదైన ఆవరణ ఉంది. చుట్టూ అనేక పెద్దపెద్ద దీపపు సెమ్మెలు వెలుగులు చిమ్ముతూ కళ్లకి, మనసుకి ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని, అమృతత్వాన్ని అందిస్తాయి. ఇక్కడ దేవాలయానికి వచ్చిన స్థానిక స్త్రీలు స్థానిక వేషధారణతో వచ్చారు. తెల్లని చీరను ఆంధ్రులు కట్టే దానికి భిన్నంగా ఒక క్రొత్త పద్ధతిలో కట్టుకున్నారు. వెంట్రుకలను వదులుగా జారుముడిగా వేసుకున్నారు. అందరూ పువ్వులను ధరించారు. దేవాలయంలో ఎంతసేపైనా నిలబడి అనంత పద్మనాభుని దర్శించుకోవచ్చు. దేవాలయం బయట కు వస్తే అత్యంత రద్దీగా ఉన్న వీధులు, జన సమ్మర్దం కనిపిస్తాయి.
ఇక్కడ లైట్ మెట్రో రైలు, ముంబాయి మోడల్ సబర్బన్ రైలు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తిరువనంతపురం దేశీయ విదేశీ సందర్శకులకు మంచి ఆకర్షణ కేంద్రంగా ఉంది. ఇక్కడ కోవలం బీచ్, శంఘుముఖం బీచ్ ప్రముఖమైనవి. ఇక్కడి జూ లోని అవిటిదైన సింహాన్ని నెలల తరబడి పరిశీలించిన యాన్ మార్టెల్ తన ‘లైఫ్ ఆఫ్ పై’ పుస్తకాన్ని రాశారని చెబు తారు.కోవలం బీచ్ తిరువనంత పురం నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరాన ఉంది. కోవలం అంటే కొబ్బరితోట. ఈ తీరం వెంబడి కనువిందు చేసే కొబ్బరితోటలను బట్టే ఈ బీచ్ కి కోవలం అన్నపేరు వచ్చింది. ఈ బీచ్ ను మొదటగా ట్రావన్కోర్ రాజులు అభివృధ్ధి చేసారు. ఇక్కడ సందర్శకులకి సెప్టెంబరు నుండి మే నెల వరకూ అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక్కడి ఆయుర్వేద సెలూన్లు దేశ విదేశ సందర్శకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.70 వ దశకంలో హిప్పీలు ఈ బీచ్ ను ప్రపంచం దృష్టికి తెచ్చారు. ఇక్కడి సముద్ర తీరంలో 17కిలో మీటర్ల పొడవున విస్తరించిన బీచ్ ని మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు. బీచ్ కు బీచ్ కు మధ్య ప్రకృతి సహజంగా ఏర్పడిన శిలలు దీనికి కారణం. మొదటి బీచ్ లైట్ హౌస్ బీచ్. ఇక్కడి లైట్ హౌస్ ఎరుపు, తెలుపు రంగులలో ప్రత్యేకంగా కనువిందు చేస్తుంది. ఆ తర్వాత హవా బీచ్. ఇది పౌర్ణమి రోజుల్లో ప్రత్యేకంగా చూడదగ్గది. మూడవది సముద్ర బీచ్. సముద్ర బీచ్ లో సందర్శకుల సందడి కనిపించదు. లైట్ హౌస్ బీచ్, హవా బీచ్ సందర్శకులతో నిత్యం కళకళ లాడుతూ ఉంటాయి. హవా బీచ్, సముద్ర బీచ్ ప్రతి ఉదయం చేపలు పట్టే వారితో హడావుడిగా ఉంటుంది.
తిరువనంతపురం లో కేరళ పర్యాటక శాఖ నడుపుతున్న హోటల్ లో వసతి బుక్ చేసుకున్నాం. ఇది ఐదంస్థుల భవనం. రైల్వేస్టేషన్ కు ప్రక్కనే ఉంది. సౌకర్యంగా కూడా ఉంది. మీరూ ప్రయత్నించవచ్చు. ఈ ప్రాంతం గుండా ఎన్.హెచ్.47 వెళుతోంది. ఇది సేలం నుండి కన్యాకుమారి వరకు రోడ్డు కలిగి కొచ్చి, త్రిసూర్, పాలక్కాడ్ లను కలుపుతోంది. ఒకటవ రాష్ట్ర ముఖ్య రహదారి నగరం గుండా వెళుతోంది. మలయాళం ముఖ్య భాష కాగా, తమిళం, ఇంగ్లీషు, హిందీ, కొంకణ్, ఉర్దూ కూడా వినిపిస్తాయి. అక్షరాస్యత శాతం ఎక్కువగా కనపడుతుంది.
ట్రావెన్కోర్ రాజ వంశీయులు కళలను ప్రోత్సహించారు. గొప్ప సంగీత విద్వాంసుడు మహారాజ స్వాతి తిరుణాల్, ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు రాజారవివర్మ ఈ ప్రాంతాలనుండి వచ్చినవారే. ఆగష్టు-సెప్టెంబరు ప్రాంతాల్లో ఓణమ్ పండుగ సమయంలో పర్యాటక వారోత్సవాలను ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుతారు. ‘కలరిపయట్టు’ అనే మార్షల్ ఆర్ట్ ఇక్కడ పేరుపొందినది. దీనికి తగిన శిక్షణ ఇచ్చే కేంద్రాలు ఈ నగరంలో ఉన్నాయి. కేరళ సాంప్రదాయ నృత్యకళ ‘కథాకళి’కి కూడా అనేక శిక్షణా కేంద్రాలు న్నాయి. ఇక్కడి భోజనం ప్రత్యేకమైనది. వంటలలో సుగంధ ద్రవ్యాలతో పాటు కొబ్బరినీ, కొబ్బరినూనె నూ ఉపయోగిస్తారు. శాకాహార, మాంసాహార వంటలు అనేక రుచులలో దొరుకుతాయి.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోతగ్గవిషయం బిక్షాటన లేకపోవటం. ఈ రాష్ట్రం చాలా సంవత్సరాలుగా కమ్యూనిష్టు సిద్ధాంతాలను అనుసరించే ప్రభుత్వాల చేతుల్లో ఉంది. దేవాలయాల దగ్గర కానీ ఇతర పబ్లిక్ స్థలాలలో కాని బిచ్చగాళ్లు కనిపించరు. రైల్వే స్టేషన్ శుభ్రంగా ఉంది. ఇక్కడ క్రికెట్, ఫుట్ బాల్ ఎక్కువ ప్రజాదరణ పొందిన ఆటలు. తిరువనంతపురంలో 2007 సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుండి బిక్షాటన ను రద్దు చెయ్యబడింది. తరువాత ఎర్నాకుళం, పలక్కాడ్, కొఝికోడ్ లలో కూడా బిక్షాటన పూర్తిగా రూపు మాపగలిగేరు. ఈ వృత్తిలో ఉన్నవారికి అనేక పునరావాస కేంద్రాలు నెలకొల్పి వారికి ఒకచోట నివసించే ఏర్పాటును ప్రభుత్వం చేసింది. దీనివలన బిక్షాటన చేసే వారి నుండి ఈ ప్రాంతాలకొచ్చే దేశ, విదేశ సందర్శకులకి విముక్తి కలిగింది. ఇంచుమించుగా కేరళ రాష్ట్రమంతా ఇప్పుడు బిక్షాటన కనిపించదు. కర్నాటక, తమిళనాడు నుండి వచ్చిన వలసదారులు మాత్రమే ఈ వృత్తిలో ఉండేవారని, స్థానికులైన కేరళీయులు కష్టపడి పనిచేసే మనస్తత్వం గలవారని, ఆత్మ గౌరవం కలవారని చెబుతారు.
కేరళలో చెప్పుకోదగ్గ మరొక విషయం ఇక్కడి ప్రజలు అధిక అక్షరాస్యత సాధించటమే కాకుండా రాజకీయంగా, సామాజికంగా ఎక్కువ చైతన్యవంతులు. ఇక్కడి స్త్రీలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా విజయవంతంగా ఎదిగారు. ఇక్కడ నూరు శాతం అక్షరాస్యత సాధించటంతో ఒకప్పుడు ఉద్యోగావకాశాలకు ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఇక్కడి స్త్రీలు, పురుషులు వలస వెళ్తూండేవారు. ఇప్పుడు స్వయం సమృధ్ధి సాధించే దిశగా ఎదుగుతూ, వలసలను కొంతవరకు నియంత్రించుకో గలుగుతున్నారు. కేవలం విద్య ద్వారా నిశ్శబ్దంగా సాధించు కుంటున్న విజయాలు ఇవి.
ఇక్కడ ఆడశిశువులను భ్రూణ హత్యలు చెయ్యటం కనిపించదు. సమాజంలో స్త్రీకి రక్షణ ఉంది. వరకట్నం లాటి ఆచారం ఇంకా ఉన్నప్పటికీ, కట్నం కోసం ఆడపిల్లలను హత్య చెయ్యటం లాటివి ఎక్కువగా కనిపించవు. ఆరోగ్యకరమైన సమాజంకోసం ఇక్కడి స్త్రీలు పనిచేస్తున్నారు. ఇది ఈ ప్రాంతపు వారు సాధించిన విజయం. కానీ స్త్రీ ని అణగద్రొక్కే విషయంలో మిగిలిన సమాజాలకంటే కొంత మెరుగ్గా ఉన్నా స్త్రీల పరిస్థితి మరింత మెరుగవవలసిన అవసరం ఉంది.
కేరళల్లో తిరుగుతున్నంత సేపూ నీటిలో కదిలే పడవ మీదో, చుట్టూ కమ్ముకున్న కొండల మధ్యనో, అడవులను జ్ఞప్తికి తెచ్చే చిక్కని వృక్షసంపద మధ్య సంచారమో, జలపాతాల దూకుడును చూస్తూ వాటివెంట ఆకాశం హద్దుగా ఊహల్లోకి ప్రయాణిం చటమో ………..ఎదో ఎదో ఒక కమ్మని భావం మనసును పట్టి లాగుతూ ఉంది. పదిహేను రోజులు కేరళ చూసేందుకు ఏమాత్రం సరిపోవని తెలుసున్నదే. మరికొన్ని ప్రాంతాలను ముందుగా ఎంచుకుని మరొక సారి, మరొక సారి కేరళ ప్రయాణాన్నికొనసాగించ వలసిందే అనుకుంటూ తిరుగు ప్రయాణం మొదలుపెట్టేం. మళ్లీ ఎప్పుడో ఆ అందాల ప్రపంచం మధ్యకి ?……..
The End
Pingback: ప్రకృతి ఒడి- కేరళ Part II – ద్వైతాద్వైతం
Oh my God, I have to urgently visit Kerala and see Anantha Padmanaabha temple!!
LikeLike