* * *
ప్రకృతితో ప్రేమలో పడని వారెవరుంటారు?! బహుశా మనం ప్రకృతిలో భాగం కావటమే దానికి కారణం కావచ్చు. ఎన్నో సౌకర్యాల మధ్య జీవిస్తున్నామనలో పెరుగుతున్న అసహనానికి కారణం ప్రకృతికి దూరంగా జరుగుతూండటమే. అభివృధ్ధి పేరుతో మన చుట్టూ కృత్రిమ ప్రపంచాన్ని నిర్మించు కుంటున్నాం. అభివృధ్ధి కాదనలేనిదే కానీ మన జీవితాల్లోంచి ఏం పోగొట్టుకుంటున్నామో గ్రహించుకుని పొరపాట్లను సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. ప్రకృతి గురించిన ప్రస్తావన వచ్చిందంటే మనదేశంలోని ఒక ప్రాంతాన్ని అప్రయత్నంగానే తలుచుకుంటాం. అవును, అది కేరళ. ఈ రాష్ట్రం ప్రకృతిని ఆవాహన చేసుకున్నట్టుంటుంది. ప్రకృతిని చిన్నాభిన్నం చెయ్యకూడ దన్నట్లు అక్కడి రోడ్లు విశాలం చేసే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలం చెయ్యలేదు. తమ రాష్టంలో జాతీయ రహదారులను విస్తరించే ఆలోచనను ఇప్పుడిప్పుడు ఆమోదిస్తోంది. అక్కడి ఇరుకైన రోడ్లు చూసినప్పుడు ఇది ప్రత్యక్ష్యంగా అర్థమవుతుంది. విదేశీ సందర్శకులకీ, స్వదేశీ సందర్శకులకీ మనదేశంలో మొట్టమొదటి పర్యాటక ప్రాంతంగా కేరళ మాత్రమే జ్ఞాపకం వస్తుందన్న వాస్తవం తెలుసుకుంటే అక్కడి పరిసరాలను స్థానికులు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో అర్థం అవుతుంది.
చిన్నప్పుడు భౌగోళిక పాఠాల్లో చదువుకున్న రోజులనుంచీ కేరళ రాష్ట్రం అంటే ఒక ఆరాధన. అక్కడి కొండలు, నదులు, జలపాతాలు, పచ్చదనం, వీటన్నిటినీ మించిన అక్కడి మాతృస్వామ్యపు వ్యవస్థ ఆ రాష్ట్రం పట్ల మిగిలిన దక్షిణాది రాష్ట్రా లన్నిటిలోకీ ఎక్కువ ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించింది.కేరళ అందాలు చూసేందుకు ఒక్క యాత్ర సరిపోదని తెలుసు. అందుకోసం ముందుగా కొన్ని నిర్ణీత ప్రాంతాలు ఎంచుకుని వెళ్లాలని అనుకున్నాం. ఏ ప్యాకేజీ టూర్ ప్రోగ్రాములు కాకుండా స్వంతంగా ఒక ప్లాన్ వేసుకుని వసతిని బుక్ చేసుకున్నాం. కొన్ని చోట్ల ప్రభుత్వ టూరిజం శాఖ నడిపే హోటళ్లు బుక్ చేసుకున్నాం. అన్నీ ప్రయోగాలే కదా స్వంత ప్యాకేజీ అంటే.
*
కేరళ చిన్న రాష్ట్రం. భారత దేశంలో జనాభా గణాంకాల ప్రకారం ఇది పన్నెండవ స్థానం లో ఉంది. దక్షిణ భారతంలో కేరళ రాష్ట్రం ప్రకృతి అందాల విషయంలో కాశ్మీరుతో పోల్చబడుతుంది. ఇది వంద శాతం అక్షరస్యత సాధించిన ప్రాంతం. ఇక్కడ శిశు మరణాల రేటు కూడా అతి తక్కువగా చెబుతారు. స్త్రీ విద్య విషయంలోనూ, జీవన ప్రమాణాల విషయంలోనూ ఇక్కడ ప్రజలు మంచి స్థాయిన్ని సంపాదించారు. ఇక్కడ ఆయుర్వేద వైద్యం ప్రపంచ ప్రఖ్యాత మైనది. బ్యాక్ వాటర్స్, వాటర్ ఫాల్స్, వరి పొలాలు, కథాకళి లాటి కళా రూపాలు, అనేక రకాల భోజన రుచులు, చారిత్రకంగానూ, సాంస్కృతికంగానూ పేరుపొందిన కట్టడాలు…ఇలా అనేక ప్రత్యేకతలు కలిగిన ఈ రాష్ట్రం ఎవరికైనా మొట్టమొదటి పర్యాటక స్థలంగా జ్ఞాపకం రావటంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ దేశంలోని అనేక ఇతర ప్రాంతాలకి భిన్నంగా కమ్యూనిష్టు భావజాలంతో కూడిన ప్రభుత్వాలు, ప్రజలు కనిపిస్తారు. ప్రజలు రాజకీయంగా చాలా చురుకుగా ఉంటారు. కన్నూర్, పాలక్కాడ్ ప్రాంతాలు కమ్యూనిష్టు పార్టీకి ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. కేరళ మొదటి కమ్యూనిష్టు ముఖ్యమంత్రి శ్రీ పి. కృష్ణ పిళ్లై. కేరళలో ఈయనే కమ్యూనిష్టు పార్టీ ని స్థాపించినవాడు.
కేరళ పండుగలు గురించి చెప్పాలంటే ఆగష్ట్ నెల రెండవ వారం నుండి సెప్టెంబరు రెండవ వారం మధ్య కాలంలో ఒక పదిరోజుల పాటు జరుపుకునే ఓనమ్ పండుగ ప్రముఖమైనది. వ్యవసాయదారులకి పంట చేతికి వచ్చే సమయం ఇది. మహాబలి అనే ప్రజారంజకుడైన రాక్షసరాజుని వామనావతారంలోని విష్ణుమూర్తి పాతాళానికి త్రొక్కివేయటం, ఆ తర్వాత రాక్షస రాజుకు సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను చూసుకుందుకు భూమి మీదకు వచ్చే వరం ఇవ్వటం జరిగిందని చెబుతారు. ఆ వరం వల్లనే మహాబలి ఓనమ్ సమయంలో తన ప్రజలని చూసుకుందుకు భూమి పైకి వస్తాడని నమ్మకం. ఈ సమయంలో ప్రజలు రాజుని స్వాగతించేందుకు ఇళ్ల ముందు పువ్వులతో అల్లిన రంగురంగుల తివాచీలను పరుస్తారు. రంగులతో అందమైన ముగ్గులను అలంకరిస్తారు. ఓనం పండుగను పురస్కరించుకుని మలయాళీ స్త్రీలు తిరువతిరకళి పేరుతో నృత్యం చెయ్యటం ఒక వేడుక. పులి వేషాలు మొదలైన అనేక వేడుకలను సామూహికంగా జరుపుకుంటారు. పెద్ద పెద్ద విందువినోదాలలో జనమంతా పాల్గొంటారు. ఓనమ్ కాకుండా క్రిస్టమస్, మహాశివరాత్రి, బక్రిద్, ఇదుల్ ఫితర్, ఇంకా అలప్పురలో ప్రతి సంవత్సరం జరిప్ ‘స్నేక్ బోట్ రేస్’ పండుగ ముఖ్యమైనవి.
కొన్నేళ్ల క్రితం పర్యాటకం ద్వారా వచ్చే లాభాలను అధికం చేసేందుకు, నష్టాలను అల్పస్థాయికి తగ్గించేందుకు ‘బాధ్యతాయుత పర్యాటకం’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆలోచన మొదలైంది. 2007 సంవత్సరంలో సందర్శకులని అమితంగా ఆకర్షించే కేరళలో దేశంలోనే మొదటిసారిగా ‘బాధ్యతాయుత పర్యాటకం’ కోవలం, కుమరకోమ్, థెక్కడి మరియు వైతిరి అనే నాలుగు ప్రాంతాలలో ప్రారంభించారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చినందు వలన 2012 నుండి దీనిని కేరళలో మరికొన్ని ప్రాంతాలకి విస్తరించారు.
భారతదేశంలోనే మొదటిసారిగా పర్యాటకుల కొరకు ‘హోం స్టే’ అన్న క్రొత్త ఆలోచన కూడా కేరళలో ప్రారంభమైంది. పర్యాటకులకు స్థానికుల ఇళ్లలోనే వసతి సౌకర్యం కలిగించటం దీని ఉద్దేశ్యం. ముఖ్యంగా ఈ సౌకర్యం ఫోర్ట్ కొచ్చి ఏరియాలో జ్యూయిష్ బిల్డింగులలో ఏర్పాటు చేయ్యటం మొదలు పెట్టేరు. క్రమంగా అలెప్పీ, కొట్టాయం , కొల్లం వంటి ప్రాంతాలలో కూడా అక్కడి పోర్చుగీసు బంగళాలను సందర్శకుల వసతి కోసం సిధ్ధం చేసేరు.
స్వయంగా ఇలాటి వసతి ఏర్పాట్లు చెయ్యదలచుకొనే కుటుంబాలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ఈ వసతి నిర్వహణకు ప్రభుత్వం కూడా అనేక నియమాలు, ప్రమాణాలు నిర్దేశించింది. ఇలాటి హోంస్టే లో ఉండదలచినవారి భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. వసతి తో పాటు ఆ ప్రాంతాలకు సమీపంలోని పర్యాటక స్థలాలను చూబించటం, భోజన సదుపాయం కలుగచేయటం కూడా ఆయా కుటంబాలవారు ఏర్పాటుచేస్తున్నారు. ఇది చక్కని ఏర్పాటు. స్థానికులతో కలిసి అక్కడి జీవన పరిస్థితులను అవగాహన చేసుకుందుకు, వారి భోజనాది అలవాట్లు తెలుసుకుందుకు ఇది చక్కని ఏర్పాటు.
కేరళలో మోరల్ పోలిసింగ్ గురించి చెప్పుకోవాలి. భార్యా భర్తలు కాని వారు స్తీ పురుషులు కలిసి మెలిసి తిరగటం లాటివి వీరు అంగీకరించరు. కనీసం ఇలాటివి నగరాల్లో చెల్లుబాటు అయినప్పటికీ పట్నాలలో ప్రజలు సహించరు. ఇక్కడి వారి సంప్రదాయ దుస్తులు ముండు మరియు నెరియత్తుగా పిలుస్తారు. స్త్రీలు దుస్తులను ధరించే విధానం తెలుగు స్త్రీల కంటే భిన్నంగా ఉంటుంది. కేరళ అనగానే కొబ్బరితోటలు, కొబ్బరిపీచు పరిశ్రమ, కేరళ హ్యాండ్ లూమ్ పరిశ్రమ, సుగంధ ద్రవ్యాలు గుర్తొస్తాయి. కొబ్బరికాయలు, సముద్ర శంఖాలతో చేసిన అనేక రకాల వస్తువులు అలెప్పీలో ఎక్కువగా చూడవచ్చు. కొచ్చిలో పెద్ద సుగంధద్రవ్యాల మార్కెట్ ఉంది. ఇక్కడి టీ తోటలు గురించి చెప్పనవసరంలేదు. ఇక్కడి ప్రముఖ బ్రాండ్ టీ ‘కన్నన్ దేవన్’. ఇక్కడ కాఫీ కంటే టీ కి ప్రజాదరణ ఉంది. కేరళలో వేడి తట్టుకునేందుకు ఈ ప్రాంతమంతా రకరకాల పండ్ల రసాలను అమ్మే దుకాణాలు కనిపిస్తాయి. కొబ్బరిబొండాలైతే చెప్పనక్కరలేదు. ఎక్కడబడితే అక్కడ దొరుకుతాయి. సహజమైన కొబ్బరినీరు ఆ వాతావరణంలో సాంత్వన కలుగ చేస్తుంది. ఇక్కడి మంచినీరు అంత ఆరోగ్యకరమైనది కాదనీ, మినరల్ వాటర్ త్రాగటం తప్పని సరి అని చెబుతారు.
దక్షిణాసియాలోనే ప్రధమంగా ‘ఎకో టూరిజం’ అనేది కేరళలో మొదలైంది. తిరువనంతపురం లో ‘అక్కలమ్ టూరిస్ట్ విలేజ్’ కేరళ ప్రాంతపు పల్లె జీవితాన్ని సందర్శకులకి అనుభవంలోకి తెస్తుంది. అలాగే కొచ్చి దగ్గర ‘కుంబలంగి మోడల్ విలేజ్’ కూడా సందర్శకులకి వసతిని అందిస్తూ, అక్కడి స్థానికులతో కలిసి కొంతకాలం జీవించే అవకాశం కలిగిస్తోంది. పర్యాటకులను ఆకర్షించే ఇటువంటి నమూనా గ్రామాలను దేశంలో మరి కొన్ని చోట్ల కూడా చూడవచ్చు. ఉదాహరణకి రాజస్థాన్ లోని జైపూర్ నగరంలో ‘చోఖీధానీ’ వంటి నమూనా గ్రామాలకు సందర్శకుల నుండి అత్యంత ఆదరణ ఉంది.
కేరళ యాత్రకి ముందుగా విజయవాడ నుండి కొచ్చిన్ కు బయలుదేరేం. కొచ్చిన్ కి కొచ్చి లేదా ఎర్నాకుళం అన్న పేర్లు కూడా ఉన్నాయి. దేవుని భూమి గా పిలువబడే ఈ రాష్ట్రంలో కొచ్చిన్ భారత దేశానికి సౌత్ వెస్ట్ న ఉన్న నగరం. ఇది అరేబియా మహా సముద్రపు ఒడ్డున అత్యంత కీలకమైన ప్రదేశంలో ఉండటం చేత , అంతర్జాతీయంగా అనేక ప్రాంతాలకి రవాణా మార్గాలు కలిగి ఉండటంతో దీనిని ‘క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ’ అంటారు. కేరళకు కొచ్చిన్ ను ముఖ ద్వారం గా చెబుతారు. కేరళ రాష్ట్ర అందాలను కొచ్చిన్ నుండి మొదలు పెట్టి చూడాలని చెబుతారు. కొచ్చిలో దిగి స్టేషన్ నలువైపులా తిరిగి చూస్తూ దాదాపు ఒక గంట అక్కడే కాలక్షేపం చేసి, కాఫీ త్రాగి అప్పుడు హోటల్ కి బయలుదేరేం. రైల్వేస్టేషన్ శుభ్రంగా ఉంది. మహాత్మ గాంధీ రోడ్డులో మేము వసతి బుక్ చేసుకున్న హోటల్ కి వెళ్తూ నగరాన్ని కళ్లు విప్పార్చుకుని చూసాను. దుకాణాలన్నీ రోడ్డు లెవెల్ లో ఉండటం ఆశ్చర్యం వేసింది. అక్కడ వర్షాకాలంలో ఆ దుకాణాలు ఎలా నిర్వహిస్తారో తెలియలేదు. కొచ్చిలో మెట్రో రైలు కోసం జరుగుతున్న పనులతో రోడ్లు కాస్త అస్తవ్యస్తంగా కనిపించాయి.
*
కేరళ రాష్ట్రానికి కొచ్చిన్ వాణిజ్య పరంగానూ, పారిశ్రామిక పరంగానూ అతి ముఖ్యమైన నగరంగా తయారైంది. భారత దేశానికి పశ్చిమతీరంలో ముంబాయి తరువాత కొచ్చిన్ రెండవ ముఖ్య నగరం. ప్రపంచ స్థాయి రేవుపట్టణంగా ఎదగటం వల్ల, ఇంకా అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతోనూ కొచ్చిన్ నుండి ప్రపంచంలోని అనేక ముఖ్య ప్రాంతాలకి రాకపోకల సదుపాయం ఉంది. ఈ రాష్ట్రానికి తూర్పున పశ్చిమ కనుమలు, పశ్చిమాన అరేబియా సముద్రం ఉన్నాయి. ఇది భూమధ్య రేఖకి దగ్గరగా ఉంది. అంతేకాక సముద్రానికి, పర్వత శ్రేణులకి దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతం ఒక విశిష్టమైన వాతావరణ పరిస్థితులను కలిగి ఉంది. నిజానికి కొచ్చిచిన్న పట్టణం. కానీ రానురాను పట్టణం బాగా పెరిగిపోవటంతో చుట్టుప్రక్కల ప్రాంతాలని తనలో కలుపుకుంది. ఇలాటి పరిస్థితి నగరాలుగా పెరుగుతున్న అనేక పట్టణాల విషయంలో మామూలే. కొచ్చిన్ ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఎర్నాకుళం అనేది కేరళలోని పరిపాలనా పరమైన వ్యవహారాలకు ముఖ్య పట్టణంగా ఉంది. ఇప్పుడు వాస్తవానికి కొచ్చిన్, ఎర్నాకుళం ఒక్కటే. ప్రపంచ ట్రావెల్ మరియు టూరిస్ట్ కౌన్సిల్ వారి గణాంకాల ప్రకారం ప్రపంచంలోని మొదటి మూడు టూరిస్ట్ ప్రాంతాలలో ఒకటిగా కొచ్చిన్ నిర్ణయించబడింది. నేషనల్ జియోగ్రఫిక్ ట్రావెలర్ ప్రోగ్రాములో ‘ జీవిత కాలంలో చూడదగిన 50 ప్రదేశాలలో కొచ్చిన్ ఒకటి’ గా చెబుతారు.
ఇక్కడ దాదాపు 25 లక్షల జనాభా ఉంది. కేరళలో ఇది పెద్ద నగరం. జూన్ నుండి సెప్టెంబరు వరకూ భారీ వర్షాలు ఉంటాయి. అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు ఆహ్లాదకర వాతావరణం తో పాటు అప్పుడప్పుడు వర్షం పడుతూఉంటుంది. మార్చి నుండి మే నెల వరకు వేసవి ఎక్కువగానే ఉంటుంది. భూమధ్య రేఖకు కేవలం పది డిగ్రీల దూరం లో ఉండటం వలన సంవత్సరం పొడవునా వేడి, ఉక్కపోత ఉంటాయి. కొచ్చి పేరు గురించి అనేకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ‘కొచఝి’ అనే మలయాళ పదం నుండి కొచ్చి పేరు వచ్చిందని, దాని అర్థం ‘చిన్న సముద్రమ’ని చెబుతారు. కొందరు ఈ పేరుని ఇక్కడకు వర్తకం కోసం వచ్చిన చైనీయులు పెట్టేరని చెబుతారు. మరొక మాట ‘కాచి’ అంటే రేవు పట్టణం అనీ ఆ విధంగా ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడున్న కొడుగల్లూర్ రేవుపట్టణం 14 వశతాబ్దంలో పెరియార్ నదికి వచ్చిన వరదల తాకిడికి కొట్టుకుపోయిందని, కాలక్రమేణా ప్రకృతి సిధ్ధంగా తయారైన రేవుపట్టణమే కొచ్చి అనీ చెబుతారు. కొచ్చి అనేది స్థానికమైన పేరు. కానీ విదేశీయులు పెట్టిన పేరు కొచ్చిన్ . ఈ ప్రాంతం పదునాల్గవ శతాబ్దం నుండి సుగంధ ద్రవ్యాల ఎగుమతి కి పేరుపొందింది. యూరోపియన్ల మొదటి వలస ప్రాంతం ఇది. ఇక్కడ క్రిస్టియన్లు అధికంగా కనిపిస్తారు.
విదేశీ వర్తకులైన చైనీయులు, డచ్, బ్రిటిష్, అరబ్బులు, ఇటాలియన్లు, పోర్చుగీసు వారు ఈ ప్రాంతాన్ని వాణిజ్య పరంగా చాలా అభివృధ్ధి చేశారు. ఫాహియాన్, వాస్కోడిగామా వంటి ప్రముఖ విదేశీ యాత్రికులు కొచ్చిన్ గురించి అధిక ప్రచారాన్ని ఇచ్చారు. ఇంగ్లీషు వారు దీనిని మిని ఇంగ్లాండ్ గా పిలిచేవారు. ఇన్ని జాతుల, ప్రాంతాల, సంస్కృతుల సమ్మేళనంతో ఇక్కడ మిశ్రమ స్సంస్కృతి కనిపిస్తుంది. ఈ రాకపోకలు వల్లనే ఇక్కడి ప్రజలు క్రొత్తగా వచ్చేమార్పులను స్వాగతించే గుణాన్ని అలవరచుకున్నారు. అయినప్పటికీ సమాజం సంప్రదాయ సమాజమే. కొచ్చిన్ లో చైనా వారి చేపల వలలు చూడవచ్చు. చైనాకి వెలుపలప్రపంచంలో ఈ వలలను ఇక్కడ ఫోర్ట్ కొచ్చి లో మాత్రమే చూడవచ్చు. ఇక్కడి బీచ్ సందర్శకులకు చక్కని విహార స్థలం. సముద్రపొడ్డున యూరోపియన్ శైలిలో నిర్మించిన అనేక కట్టడాలను చూడవచ్చు. సముద్ర తీరం పొడవునా తాజా చేపలతో వండిన అనేక రుచికరమైన వంటకాలు ఇక్కడి చిన్నచిన్న దుకాణాల్లో తయారవుతూ ఉంటాయి. కేరళీయుల బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరంగా, తక్కువనూనెతో తయారుచేసేదిగా ప్రాముఖ్యత పొందింది. ఇడ్లీ, దోశె, ఊతప్పం వంటి అల్పాహారాలు దొరుకుతాయి. ఫోర్ట్ కొచ్చిలో ఫెర్రీ విహారం సందర్శకులకి మంచి అనుభవం.
*
ఇక్కడి ‘సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి’ యూరోపియన్లద్వారా నిర్మించబడింది. వాస్కోడగామా తన మూడవసారి కొచ్చిపర్యటనలో మరణించినప్పుడు ఆయనను ఇక్కడ ఖననం చేసారు. తరువాత ఆయన అవశేషాల్ని పోర్చుగల్ కు తీసుకు వెళ్లిపోయినప్పటికీ ఇప్పటికీ వాస్కోడగామాను ఖననం చేసిన స్థలాన్నిఈ చర్చిలో చూడవచ్చు. ఇక్కడ ‘శాంతా క్రజ్ బసిలిక’ అనే చర్చి కూడా ప్రముఖమైనది. ‘మటాన్ చెర్రీ’ ప్రాంతంలో ఉన్న‘డచ్ ప్యాలస్’ పోర్చుగీసువారితో నిర్మించబడినప్పటికీ, కొచ్చి రాజుల ప్రమాణ స్వీకారోత్సవాలు ఇక్కడ జరిగేవి. ఈ రాజప్రాసాదంలో హిందువులకు పవిత్ర గ్రంధాలైన రామాయణ, మహాభారతాల్లోని సన్నివేశాలు చిత్రించబడిఉన్నాయి. ‘బోల్ఘట్టీ ప్యాలస్’ ఇక్కడ బోల్ఘట్టీ ద్వీపంలో డచ్ వారిచేత నిర్మించబడింది. దీనిని ఇప్పుడు హోటల్ గా తీర్చిదిద్ది కేరళ పర్యాటక శాఖవారు నడుపుతున్నారు. కొచ్చి నుండి చిన్న పడవలలో ఇక్కడికి వెళ్ళవచ్చు. ఇక్కడ చిన్న గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. కొచ్చికి 16 కిలోమీటర్ల దూరంలో హిల్ ప్యాలస్ ఉంది. దీనిని ఇప్పుడు మ్యూజియమ్ గా మార్చేరు. కొచ్చి నగరంలో ‘మంగళవనం’ పేరుతో ఒక బర్డ్ శాంక్చురీ ఉంది. ఇక్కడ స్థానిక పక్షులే కాక వలస పక్షులను కూడా చూడవచ్చు.
కొచ్చి రైల్వే జంక్షన్ దగ్గరలో ఉన్న కొచ్చిన్ కల్చరల్ సెంటర్లో ప్రతిరోజూ సాయంకాలం ‘కథాకళి’ ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ మలయాళంతో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీషు కూడా వాడుకలో ఉంది. ఇక్కడ హిందువులు, క్రిస్టియన్లు, ముస్లిములు, సిక్కులు, జైన్లు, బౌధ్ధులు కూడా కనిపిస్తారు. కొచ్చి నుండి లక్షద్వీప దీవులు దాదాపు 300 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడికి వాయు మార్గాన కానీ నీటి మార్గాన కానీ వెళ్లవచ్చు. లక్షద్వీప దీవులు పేరుకు తగినట్లు లక్ష దీవుల సముదాయం. ఈ దీవులు భారతదేశంలో భాగంగా ఉన్నాయి. ఇవి కేంద్ర పాలిత ప్రాంతం హోదాకలిగి ఉన్నాయి. ఇక్కడ ఈ దీవుల ప్రస్తావన ఎందుకంటే ఈ దీవులు కొచ్చి హై కోర్ట్ పరిధి లోకి వస్తాయి. ఈ దీవులలో ప్రముఖంగా వినిపించే భాష కూడా మలయాళమే.
*
కొచ్చిలో కొబ్బరిపీచు, చెక్క, సముద్ర శంఖాలు, ఇత్తడి, ఏనుగుదంతాలు, గంధం చెక్కతో చేసిన అనేక వస్తువులు ‘కైరలి హాండీ క్రాఫ్ట్ ఎంపోరియమ్’ లో ఎమ్.జి రోడ్ లో చూడవచ్చు. సుగంధ ద్రవ్యాలు, ఇతర అనేక రకాల చిన్నచిన్న చేతి వస్తువులు బ్రాడ్వేలో షాపింగ్ చెయ్యవచ్చు, కానీ బ్రాడ్వేలో వీధులు మాత్రం సన్నని ఇరుకైనవి, ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉంటాయి. కొచ్చిలో ఒక సాయంత్రం నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 47 ,జాతీయ రహదారి 17, కొచ్చి బైపాస్ కలిసే ప్రముఖ స్థానంలో ఉన్న లూలూ మాల్ కి వెళ్లేం. ఉన్నపళంగా అందుకున్న వర్షం, ఆ ఇరుకు రోడ్లలో ప్రయాణం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఇది భారత దేశంలోనే అతి పెద్ద మాల్. 17ఎకరాల స్థలంలో నాలుగు అంతస్థులలో కట్టబడింది. 2013 లో దీనిని 16 బిలియన్ల రూపాయల ఖర్చుతో కట్టేరు. ఇక్కడ రెండవ అంతస్థులో 9 స్క్రీన్లలో సినిమాలు ఉన్నాయి. మూడవ అంతస్థులో ఇండోర్ క్లైమ్ బింగ్ వాల్, 5డి సినిమా వంటి అనేక రకాల సౌకర్యలతో లీజర్ జోన్ ఉంది.
* * *
Pingback: ప్రకృతి ఒడి- కేరళ Part II – ద్వైతాద్వైతం
I though I travelled through Kerala, after reading the blog I felt I should visit “God’s own country” once again at the earliest opportunity.
LikeLike
Thank u Seshu. I like it.
LikeLike