* * *
Continued from Part I
కొచ్చి లేదా ఎర్నాకుళం జిల్లాలో శ్రీ ఆదిశంకరాచార్య జన్మ స్థలం కలడి చూడ దగ్గ ప్రదేశం. ఇది కొచ్చి నుండి మున్నార్ వెళ్లే జాతీయ రహదారి మీద ఉంది. ‘కలడి’ ని చూడటం ఒక గొప్ప అనుభవం. ప్రపంచానికి అద్వైత సిధ్ధాంతాన్ని అందించిన శ్రీ శంకరాచార్యుల జన్మ స్థలం కలడి.
*
కలడి అన్న మాటకు మలయాళంలో ఉన్న అర్థం ‘పాద ముద్ర’. పూర్వం ఈ గ్రామానికి ‘ససలం’ అన్న పేరు ఉండేది. కలడిగా మారడం వెనుక ఒక కథ చెబుతారు. శంకరాచార్యులు చిన్నతనంలో ఆయన తల్లి ఆర్యంబ ప్రతిరోజూ మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళి పూర్ణ నదిలో స్నానం చేసేవారు. ఒక రోజు అలా నడిచి వెళ్తూ కళ్లు తిరిగి పడిపోవటం చూసిన బాల శంకరాచార్య దుఖించి, శ్రీ కృష్ణుని ప్రార్ధించగా, ప్రసన్నుడైన శ్రీ కృష్ణుడు ‘శంకరా, పూర్ణ నది నీ పాద ముద్రల వైపుగా ప్రవహిస్తుంది’ అని దీవిస్తాడు. ఆవిధంగా పూర్ణ నది తన ప్రవాహాన్ని శంకరుని పాదముద్రల వైపుగా మళ్లించుకుందట. పూర్ణ నది శంకరుని పెరటి తోటలోకి ప్రవహించిందని చెబుతారు. కలడి క్షేత్రం ఒక పసివాడికి అతని తల్లి పట్ల ఉన్న ప్రేమను, శ్రీకృష్ణునికి ఆ బాలుని పట్ల కలిగిన దయను తెలియజేస్తుంది. ఇక్కడే శ్రీ శంకరులు ‘అచ్యుత అష్టకం’ రాసినది. పూర్ణ నదిని అప్పటి నుండి పెరియార్ గా పిలవటం మొదలైంది.
శృగేరి మఠం వారు ఇక్కడ శ్రీ శంకరాచార్యుల దేవాలయాన్ని నిర్వహిస్తున్నారు. అదేకాక శృగేరిలో కొలువై ఉన్న శారదాంబ దేవాలయం కూడా ఉంది. ఆర్యంబ సమాధిని కూడా చూడచ్చు. కలడిలో శ్రీ ఆది శంకర ‘కీర్తి స్తంభ మండపం’ కంచికామకోటి మఠం వారి ద్వారా నిర్మించబడింది. ఇది ఎనిమిది అంతస్థుల నిర్మాణం. ఎనిమిది అంతస్థులలోనూ గోడలమీద శంకరాచార్యుని జీవిత కథను చిత్రించారు. కేవలం మూడు రూపాయల రుసుముతో ఈ మండపం పైకి మెట్లమీదుగా వెళ్తూ ఆ గోడలమీద రచించబడిన శ్రీ శంకరాచార్యులవారి జీవిత కథను చిత్రాల సహితంగా చూడవచ్చు.
*
ఇక్కడ బస చేసేందుకు వసతి గురించి అడిగినప్పుడు, ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నస్థలంలోని ఆశ్రమ గదులలో ఒక పాఠశాలను నడుపుతున్నారని, ప్రస్తుతం పాఠశాల కొరకు క్రొత్త భవంతి నిర్మాణంలో ఉందని చెప్పారు. పాఠశాలను ఆ భవంతిలోకి మార్చిన తరువాత ఆ గదులను సందర్శకులకొరకు వసతిగా ఇవ్వగలమనీ, కానీ అక్కడ కనీస వసతులు కూడా ఉండవని, నేలపై పడుకోవాలని అక్కడి అర్చకులు చెప్పారు. పచ్చనిమొక్కలు, తీగల మధ్య ఆ దేవాలయ ప్రాంగణం అతి సహజంగా ప్రకృతిలో భాగంగా కనిపించింది. ఆ దేవాలయం జాతీయ రహదారి పైన ఉన్నప్పటికీ రోడ్డు మీద కనిపించే హడావుడికి, వినిపించే చప్పుళ్లకు సంబంధం లేనట్లు తనదైన ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఒదిగి ప్రశాంతంగా ఉంది.
కేరళ రాష్ట్రంలో ఉత్తరంగా ఉన్నత్రిస్సూర్ జిల్లాలోని ప్రముఖ పుణ్య స్థలం గురువాయూరు చూసేం. ఇక్కడ త్రిస్సూర్ గురించి చెప్పుకోవాలి.
త్రిస్సూర్ ఒకప్పుడు కొచ్చిన్ రాజవంశీయులకి ముఖ్య పట్టణంగా ఉండేది. ఇది కేరళకి సాంస్కృతిక రాజధానిగా పేరొందింది. ఇది ‘తెక్కినాడు మైదాన్’ అనే చిన్న కొండమీద ఉన్నది. ఇక్కడ బంగరు ఆభరణాలు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు తయారవుతాయి. కేరళలోని బంగారు నగల వ్యాపారంలో 70 శాతం ఇక్కడ తయారవుతుంది. దాదాపు రెండు లక్షల మందికి ఉపాధిని ఇస్తోంది.
కొన్ని దశాబ్దాల ద్రితం ఈ ప్రాంతంలో 58 బ్యాంకులకు చెందిన ప్రధాన కార్యాలయాలు ఉండేవి. అందువలన రిజర్వు బ్యాంకు దీనిని బ్యాంకింగ్ పట్టణంగా పిలిచేది. ఇప్పటి ధనలక్ష్మి బ్యాంక్, లార్డ్ క్రిష్ణ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మొదలైన అనేక ప్రముఖమైన ప్రైవేటు బ్యాంకులు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ ఉన్న మూడు వేలకు పైగా ఉన్న చిట్ ఫండ్ కంపెనీలు 35 వేల మందికి ఉద్యోగాలను సమకూరుస్తున్నాయి. ఆయుర్వేద మందుల తయారీకి ఇది ముఖ్య కేంద్రం. ఇంకా జాయ్ లుక్కాస్, జోస్ లుక్కాస్, కల్యాణ్ గ్రూపుకు చెందిన నగల ముఖ్య కేంద్రాలు ఇక్కడివే. అనేక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థలు కూడా ఇక్కడ పెద్ద వస్త్ర పరిశ్రమను నడుపుతున్నాయి. త్రిసూర్ ను చుట్టుప్రక్కలున్న స్థానిక ప్రజలు ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడ ఐ.టి. పరిశ్రమ కూడా పెద్దది.
కేరళ సంగీత, నాటక అకాడమీ, లలితకళా అకాడమీ, కేరళ సాహిత్య అకాడమీ ఇక్కడే ఉన్నాయి. ప్రతి సంవత్సరం జరిగే ‘కేరళ అంతర్జాతీయ నాటకోత్సవాల’కి త్రిసూర్ ఆతిథ్యం ఇస్తూ వస్తోంది. కేరళ లో నాటకానికి మంచి ప్రజాదరణ ఉంది. ఈ మీడియం ద్వారానే ముఖ్యంగా కమ్యూనిష్టు భావజాలవ్యాప్తికి దోహదం జరిగిందిక్కడ. ప్రముఖ రచయితలైన ఎమ్.టి. వాసుదేవన్ నాయర్, సారా జోసఫ్ ఇక్కడివారే.
ఏప్రిల్ లేదా మే నెలలో ‘త్రిస్సూర్ పూరమ్’ పండుగ అత్యంత శోభాయమానంగా జరుగుతుందిక్కడ. త్రిసూర్ జిల్లాలో చారిత్రకంగా పేరొందిన అనేక దేవాలయాలున్నాయి. అందులో ముఖ్యంగా ‘వడకున్నాథన్’ దేవాలయం, ‘గురువాయూర్ ‘దేవాలయం చెప్పుకోదగ్గవి. వడక్కునాథన్ దేవాలయం పరశురాముడు స్థాపించినట్లు చెబుతారు. ఇది కేరళ కు చెందిన ప్రత్యేక వాస్తు శిల్పం తో నిర్మించబడింది. త్రిసూర్ జిల్లాలో ‘కొడంగళూర్’ తాలూకాలో ఉన్న ‘చేరామన్ జుమా మసీదు’ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడి మసీదుపైన హిందూ మత సంస్కృతి కనిపిస్తుంది. ఇక్కడ అఖండ దీపం వెలుగుతుంటుంది. అన్ని మతాల ప్రజలూ, భక్తులు ఇక్కడి అఖండ దీపంలో నూనెను పోసి వెళ్లవచ్చు.
త్రిసూర్ నుండి 29కిలోమీటర్ల దూరంలో ఉన్న గురువాయూర్ రోడ్ మార్గంలో వెళ్లాం. దీనిని ‘భూలోక వైకుంఠం’ గా పిలుస్తారు. విష్ణుమూర్తిని కృష్ణుడి రూపంలో పూజిస్తారిక్కడ. నాలుగుచేతులతో ఉన్న కృష్ణ విగ్రహం శంఖం, సుదర్శన చక్రం, తులసి మాల, కలువ పువ్వులను కలిగి ఉంటుంది. గురువాయూర్ ను ‘దక్షిణాది ద్వారక’ గా చెబుతారు. భారత దేశంలోని ఐదు ప్రముఖ వైష్ణవ దేవాలయాలలో ఇది ఒకటి.
*
గురువాయూర్ లోని దేవాలయంలోని విగ్రహం విష్ణుమూర్తి అవతారమైనా అది కృష్ణుని దేవాలయం గా చెబుతారు. దేవుని గురువాయూరప్పన్ గా పిలుస్తారు. ఈ విగ్రహం పంచలోహాలతో తయారైందని చెబుతారు. ప్రతిరోజూ ఈ విగ్రహానికి నువ్వుల నూనెను రాస్తారు. ఆపైన నీటితో అభిషేకం చేస్తారు. ఆనీటిని పవిత్రతీర్థంగా భక్తులు తీసుకుంటారు. దేవాలయానికి ఉత్తర దిక్కున ‘రుద్రతీర్థం’ అనే నీటి కొలను ఉంది. ఇక్కడ మగవారు చొక్కా లేకుండా మాత్రమే దర్శనానికి వెళ్లాల్సిఉంటుంది. ఆడవారు చీరలు కాని, సల్వార్ కమీజు కాని ధరించవచ్చు. దేవాలయం ఉదయం మూడు గంటలకి తెరుస్తారు.
దక్షిణాది దేవాలయాలకు తమవైన ఏనుగులు ఉండటం ఆచారంగా వస్తోంది. అలాగే గురువాయూర్ దేవాలయానికి సంబంధించి అనేక ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ భక్తులు అనేక రకాల కానుకలను భక్తితో సమర్పిస్తారు, అందులో ఏనుగులను కానుకగా ఇవ్వటం ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ ఏనుగులు దేవాలయం నిర్వహించే అనేక పండుగలలో ప్రముఖ పాత్రని కలిగున్నాయి. గురువాయూర్ ఏనుగులలో ‘కేశవన్ ‘ అన్న ఏనుగు ప్రపంచ ప్రసిధ్ధి పొందింది. కేశవన్ సత్ ప్రవర్తనతో గురువాయురప్పకు సేవ చేసిందని గజరాజు బిరుదును కూడా ఇచ్చారు. 1975 లో వచ్చిన మలయాళ సినిమా ‘గురువాయూర్ కేశవ’ సినిమాకు ఈ ఏనుగు ప్రేరణగా చెబుతారు.
గురువాయూరుకు రెండు కిలోమీటర్ల దూరంలో ‘పున్నత్తూర్ కోట’ అనే ప్రాంతంలో దేవాలయానికి చెందిన దాదాపు 75 ఏనుగులను సంరక్షిస్తున్నారు. ఈ కోట పూర్వం ఒక రాజ వంశీయులకు చెందిన కోట. ప్రస్తుతం ఏనుగుల మ్యూజియంగా మారిన ఈ కోటను ప్రత్యేక అనుమతి రుసుముతో సందర్శించవచ్చు. ఇక్కడ ప్రతి ఉదయం ఏనుగులకు స్నానం చేయించడాన్ని చూడవచ్చు. వాటికి భోజనం తినిపించడం చూడవచ్చు. కొన్ని సంవత్సరాలక్రితం ఇక్కడి ఏనుగులను సంకెళ్లతో కట్టివేసి ఉంచటం, వాటిని సంరక్షించే క్రమంలో కఠినంగా శిక్షించటం మీడియా ద్వారా ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకురాబడింది. దీనికి తగిన చర్యలు తీసుకునే క్రమంలో ప్రభుత్వం ఒక నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. కొన్ని స్వచ్చంద సంస్థలు ఈ ఏనుగులను సంరక్షించేందుకు ముందుకు వచ్చాయి.
*
ఇక్కణ్ణుంచి ‘మున్నార్’ చేరేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాం. దారిపొడవునా పచ్చని తోటలు, జలపాతాలు సందర్శకులను ఒక అద్భుతప్రపంచంలోకి తీసుకువెళ్తాయి.
బ్రిటీషు వారి కాలంలో వేసవి విడిదిగా అత్యంత ఆదరణ పొందిన ప్రాంతం మున్నార్. ఇది ‘ఇడుక్కి’ జిల్లాలో సముద్ర మట్టానికి ఆరువేల అడుగుల ఎత్తున ఉంది. ఇక్కడినుండి నలభై కిలో మీటర్ల దూరంలో ‘మరయూర్’ అనే గ్రామం లో గంధపు చెట్లు సహజంగా పెరుగుతాయి. ఈ ప్రాంతం రెయిన్ షాడో రీజియన్ కావటంతో ఈ చెట్లకి అనువుగా ఉంటుంది.
మున్నార్ లో టీ తోటల వెంట నడవటం ఒక అందమైన అనుభవం. ఇక్కడి పశ్చిమ కనుమల చుట్టూ అనేక పెద్ద జలపాతాలున్నాయి. ఈ జలపాతాలను చూసినప్పుడు నయాగరా జలపాతం గుర్తు రాక మానదు. కానీ నయాగరా అంత పెద్ద జలపాతాలు కావివి. ఇక్కడి జలపాతాలకు మాత్రమే ప్రత్యేకమన్నట్లుండే అత్యంత సుందరమైన ఆకుపచ్చని కొండలు, చెట్లు జలపాతాల చుట్టూ దర్శనమిస్తాయి. మున్నార్ లో ఒక ఇకో పాయింట్ ఉంది. అక్కడ మన మాటలు ప్రతిధ్వనించటం వినవచ్చు.
ఇక్కడి ‘టాటా టీ మ్యూజియమ్’ లో రకరకాల టీ పొడిని ని తయారుచెయ్యటం చూడచ్చు. ఇక్కడ వంద సంవత్సరాల క్రితం నుండి నడుపుతున్నటీ ఫాక్టరీలను చూడవచ్చు. మున్నార్ –కొడైకెనాల్ రోడ్ మీద ఉన్నఎత్తైన స్థలం నుండి తమిళనాడు రాష్ట్రాన్ని చూడవచ్చు. ఇక్కడ ‘నీలకురుంజి’ అనే పువ్వులు 12 సంవత్సరాలకి ఒకసారి పూస్తాయి. ఇది అరుదైన పుష్పం. మున్నార్ చుట్టూ ఉన్న చిన్నచిన్న కొండలమీదకి ఎక్కడం ఒక సాహస కృత్యం. ట్రెక్కింగ్ సరదా ఉన్నవారికి ఇది నచ్చుతుంది. చుట్టూ ఉన్న కొండలు, ఆకుపచ్చని తివచీలు పరిచినట్లుంటాయి. ఇక్కడి సీతాదేవి సరస్సులో సరదాగా చేపలు పట్టే అనేక సందర్శకులను చూశాం.
*
మున్నార్ లో ‘మట్టుపెట్టి’ డ్యాం చూడదగ్గది. ఇంకా ‘బ్లాసమ్ ఇంటర్నేషనల్ పార్క్’ అందమైన పూల వనాలతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ‘సుగంధ ద్రవ్యాల పార్క్’, ‘గులాబీల తోట’ చూడదగ్గవి. ఇక్కడ చిన్నచిన్నటీ బంక్ లలో రుచికరమైన టీ దొరుకుతుంది. చుట్టూ ఆకుపచ్చని ప్రకృతి, ఒక నిముషం వర్షం, ఒక నిముషం ఎండ, మబ్బులు ….ఈ ప్రాంతాన్ని సందర్శించటం ఒక అరుదైన అవకాశం. ఇక్కడ అనేక హోటళ్లు ఉన్నాయి. భోజన సదుపాయం ఉన్నప్పటికీ నాణ్యత విషయంలో చెప్పుకోతగినదిగా లేదు. ఈ ఘాట్ రోడ్ల వెంట ప్రయాణిస్తుంటే మా సిమ్లా ప్రయాణం జ్ఞాపకం వచ్చింది. కానీ సిమ్లా ఘాట్ రోడ్ చాలా ఇరుకుగా, అత్యంత రద్దీగా ఉంది, ఈ రోడ్డు మాత్రం వెడల్పుగా, వాహనాలకి అనువుగా ఉంది.
*
మున్నార్ నుండి రాష్ట్ర పర్యాటక శాఖవారు కొన్ని టూర్లు నిర్వహిస్తున్నారు. ప్రొద్దున్న8 నుండి సాయంత్రం 8 వరకు ఈ టూరు నిర్వహిస్తారు. ఈ టూరులో ముఖ్యంగా చెప్పుకోతగ్గది, ‘ఎరవికులం నేషనల్ పార్క్’. ఇది మున్నార్ నుండి 8 కిలోమీటర్ల దూరం, పదిహేను నిముషాల ప్రయాణం తో చేరుకోవచ్చు. ఇక్కడి ప్రకృతి నిశ్శబ్దంలో ఒక తపస్సుచేస్తున్న ముని లా ఉంటుంది. 19వ శతాబ్దంలో బిటీషువాళ్లు ఈ స్వచ్చమైన అడవిప్రాంతపు అందాలను చూసి దీనికి అధిక ప్రచారం ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా వారి వినోదం కోసం ఇక్కడి జంతువులను నిర్దాక్షిణ్యంగా వేటాడతూండేవారు. రానురాను ఈ ప్రాంతంలోని అనేక రకాల జంతువులు, పక్షులు కనుమరుగయ్యే ప్రమాదం చోటుచేసుకుంది. అందువలన ఇక్కడ వేటాడటాన్ని 1975లో నిషేధించారు.
ప్రపంచంలోనే పూర్తిగా కనుమరుగవుతూ, అంతరించిపోతున్న ‘నీలగిరి ఠార్’ ను ఇక్కడ చూడవచ్చు, ఇంకా సంబార్, ఎరవికులం లంగూర్, ఏషియాటిక్ వైట్ డాగ్, జెయింట్ స్క్విరల్ వంటి అనేక జంతువులను చూడవచ్చు. ఇక్కడి ప్రకృతి మరింత దురాక్రమణలకు లోనుకాకుండా ఈ ప్రాంతాన్ని 1978 లో ప్రభుత్వం ‘నేషనల్ పార్క్’ గా ప్రకటించటం జరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇక్కడి జంతువుల పునరుత్పత్తి ఋతువు కారణంగా మూసివేయబడుతుంది. ఇక్కడి ‘అనముడి పీక్’ దక్షిణ భారతదేశంలోని అతి ఎత్తైన పర్వత శిఖరం. ఇది 2694 మీటర్ల ఎత్తు ఉంది. ఇక్కడి లక్కం జలపాతాలు చూడదగ్గవి. మున్నార్ నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
మున్నార్ నుంచి అలెప్పీకి రోడ్డు మార్గాన ప్రయాణించాం.
*
సముద్రం మధ్యలో ఉండటం, అనేక నదులు ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తూ ఉండటం వంటి భౌగోళిక స్థితిగతులను బట్టి ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఇది అలెప్పీ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతంగుండా ఆరు నదులు ప్రవహిస్తూ ఇక్కడి నుండి 80 కిలో మీటర్ల పొడవు ఉన్న సముద్ర తీరంలో కలిసిపోతాయి. ఈ పట్టణం గుండా ప్రవహించే కాలువలు ‘3 వ జాతీయ నీటి మార్గం’లో భాగంగా ఉన్నాయి. ఈ జిల్లాలో అడవులు, కొండలు కనపడవు.
*
దీనికి పశ్చిమంగా లక్కదీవి సముద్రం ఉంది. పట్టణమంతా అనేక సరస్సులు, మంచినీటి నదులు, లాగూన్స్ ఉన్నాయి. ఇక్కడ ‘చకర’ తీరంలో అధిక ప్రమాణంలో ప్రతి ఏడూ చేపలు, ప్రాన్స్ దొరుకుతాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చే వరదలు ఇక్కడి మట్టిని సారవంతంగా చేసి అధిక సముద్ర సంపదను ఇక్కడ దొరికేందుకు తోడ్పడుతున్నాయి. ఈ ప్రాంతాన్ని కేరళ ధాన్యాగారం గా పిలుస్తారు. ఇక్కడ వ్యవసాయం సముద్ర మట్టానికి క్రిందుగా జరుగుతుంది. ఇలాటి పరిస్థితి ప్రపంచంలోనే అతి తక్కువ ప్రదేశాల్లో కనిపిస్తుంది. ఇక్కడి ‘వెంబనాడు’ సరస్సులోని మెరక ప్రాంతాల్ని వ్యవసాయానికి అనువుగా తయారు చెయ్యటం అనేది శతాబ్దాలుగా జరుగుతున్నది. ఇంకా పంపానది చుట్టుప్రక్కల ప్రాంతాలను నీటి లోతు తక్కువగా ఉన్న ప్రాంతాలను కూడా వ్యవసాయానికి అనువుగా మార్చేరు. అందువలన ఇక్కడ అధిక ప్రాంతం వ్యవసాయం క్రిందికి తీసుకురాబడింది. ఇక్కడ వ్యవసాయం, చేపలు పట్టడం ముఖ్య వృత్తులు. కొబ్బరిపీచు, చేనేత, వివిధ రకాల చేతి వృత్తుల పనులు, ఇక్కడ కనిపిస్తాయి.
ఇక్కడ ఈశాన్య ఋతుపవనాలు, నైఋతీ ఋతుపవనాలు కూడా వర్షాలను ఇస్తున్నాయి. ఈ జిల్లాలో దాదాపు పాతిక లక్షల వరకూ జనాభా ఉంది. హిందువులు, క్రిస్టియన్లు ఎక్కువగానూ, ముస్లింలు కూడా చెప్పుకోదగ్గ పరిమాణంలోనూ కనపడతారు. ఇక్కడ మలయాళం మాత్రమే కాకుండా కొంకిణి, తమిళ భాషలు కూడా మాట్లాడుతారు.అలెప్పీలో హౌస్ బోట్లు ప్రధాన ఆకర్షణ. అంతేకాక అలెప్పీ కి సమీపంగా మరొక ప్రముఖ అందమైన పర్యాటక స్థలం మున్నార్ ఉండటం వలన కూడా ఈ ప్రాంతాలు సందర్శకులని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.
*
అలెప్పీ పట్టణం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, మరియు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. రైలు, రోడ్డూ మార్గాల ద్వారా ఈ పట్టణం అనేక ఇతర ప్రాంతాలకి కలుపబడింది. ఎన్.హెచ్ 47 ఈ ప్రాంతం గుండా వెళ్తుంది. బస్సులు, రైళ్లు, కాక అనేక కాలువలు ఈ పట్టణం గుండా పోవటంతో నీటి రవాణా కూడా ముఖ్య రవాణా మార్గంగా అభివృధ్ధి చెందింది. చుట్టుప్రక్కల అనేక ప్రాంతాలకి చిన్న పడవల ద్వారా, జెట్టీ ల ద్వారా చేరుకోవచ్చు. మనవైపు సిటీ బస్సుల్లో ప్రయాణించినట్లుగా ఇక్కడ బోట్లలో ప్రయాణించటం, చుట్టుప్రక్కల ప్రాంతాలకు నిత్యం ప్రజలు వెళ్లి రావటం చూస్తే క్రొత్తగానూ, సరదాగానూ ఉంటుంది.
*
సందర్శకులు హౌస్ బోట్లలో వసతిని బుక్ చేసుకుని వాటిలో కొన్నాళ్లపాటు ఉండే అవకాశం ఉంది. ఇది ఒక అరుదైన అనుభవం. వసతి గా కాక పోయినా ఈ బ్యాక్ వాటర్స్ మీద పడవ విహారం చెయ్యటం,అదీ అకస్మాత్తుగా పడే చినుకుల మధ్య చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించటం చాలా బావుంటుంది. కాలువల కిరువైపులా పట్టణంలోని రోడ్లు, వాటిపైన నిరంతరం కదులుతున్న ట్రాఫిక్ చూసేందుకు చాలాబాగుంటుంది. దాదాపు రెండు లక్షల జనాభాతో కేరళలో ఇది ఆరవ పెద్ద నగరం గా చెబుతారు. దీనిని ‘అలప్పుర’ అని కూడా అంటారు.
*
మొదటగా ఒక పాతిక, ముప్ఫై సంవత్సరాల క్రితం అలెప్పీ గురించి మన తెలుగు రచయిత శ్రీ కృష్ణగారు రాసిన నవల ‘యాత్ర’ లో చదివాను. ఆ నవల చదివినంత సేపూ ఒక అద్భుత ప్రపంచంలో విహరిస్తాము. అప్పట్లో ఏలూరులోని జిల్లాగ్రంధాలయం నుండి తెచ్చుకుని చదివాను. ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకం కోసం ప్రయత్నించినా దొరకటం లేదు. అప్పటినుండి అలెప్పీ పేరు విన్నప్పుడల్లా అక్కడికి వెళ్లాలన్నఆశ కలుగుతూ ఉండేది. ఆ ఆశ తీరేందుకు ఇన్ని సంవత్సరాలుగా ఎదురుచూడవలసి వచ్చింది. కొచ్చి నుండి ఇది 62 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాల్లో మొదటగా ప్లాన్డ్ గా కట్టిన నగరం అలప్పుర గా చెబుతారు. ఇక్కడి లైట్ హౌస్ కూడా ఈ ప్రాంతాల్లో మొదటిదిగా చెబుతారు.
ఈ నగరమంతా కాలువలు, బ్యాక్ వాటర్స్, బీచిలు ఉండటంతో లార్డ్ కర్జన్ దీనిని ‘తూర్పున ఉన్న వెనిస్’ అని పిలిచారు. ఇక్కడి విశాలమైన బ్యాక్ వాటర్స్ ను బట్టి అలెప్పీని కేరళకు వెనీష్యన్ క్యాపిటల్ గా పిలుస్తారు. ఇక్కడ మలయాళంతో పాటు తమిళం, ఇంగ్లీషు, హిందీ కూడా మాట్లాడుతారు. అలెప్పీ దగ్గరలోని ‘ పున్నమడ’ సరస్సులో ప్రతి సంవత్సరం ఆగష్టు రెండో శనివారం ‘నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్’ జరుగుతుంది. అలెప్పీ బీచ్ అత్యంత సహజమైన, సుందరమైన బీచ్.
అలెప్పీలో కేవలం స్త్రీలు నడుపుతున్న భోజనశాలలను చూసేం. అక్కడ వంట దగ్గరనుండి వడ్డన వరకు, ఇంకా క్యాష్ కౌంటర్ దగ్గర అందరూ స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఉండేదని చెప్పే మాతృస్వామ్య వ్యవస్థ చిహ్నాలు కాబోలు. ఇల్లాటి భోజనశాల లో భోజనం చెయ్యటం ఒక క్రొత్త అనుభవం. భోజనంలో పైనాపిల్ పచ్చడి క్రొత్తగా రుచిగా ఉంది. అలాటి భోజన శాలలో తెలుగు ప్రాంతం నుండి వచ్చిన ఒక స్త్రీ పరిచయం అయింది. ఆమె ఒంటరిగా కొడుకును పెంచుకుంటూ జీవిస్తోంది. ఆమె తన కథను చెప్పుకుంది. తెలుగు రాష్ట్రానికి చెందిన ఆమె పేరు మరియం.
ఒక ముస్లిం యువకుడితో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుని ఆంధ్రా నుండి అతనితో ఇక్కడికి వచ్చేసినట్లు చెప్పింది. కానీ గత కొద్ది కాలంగా అతనితో తెగత్రెంపులు చేసుకుని తన కాళ్లమీద తాను నిలబడి మరి నలుగురు తనలాటి స్త్రీలకు జీవికను చూబించింది. తన కొడుకుని భర్త ముస్లిం మతంలోకి మార్చటాన్ని సహించలేక విడిపోయినట్లు చెప్పింది. తల్లిదండ్రుల్ని, పుట్టిన గడ్డని వదిలి, పరాయి మతస్థుడిని భర్తగా స్వీకరించిన ఆమె కొడుకును మాత్రం తన మతానికి మాత్రమే పరిమితం చేసి భర్త మతాన్ని తృణీకరించటం ఆశ్చర్యపరిచింది. మతమంటే ఒక నమ్మకమేనా లేక దాన్ని మించి మరేదైనా ఉందా?
Continued in Part III
Very delicate yet detailed description!! Wonderful. Pictures are very fresh ..
LikeLike
Pingback: ప్రకృతి ఒడి- కేరళ Part III – ద్వైతాద్వైతం
Pingback: ప్రకృతి ఒడి- కేరళ Part I – ద్వైతాద్వైతం