బ్యూటీషియన్ – గూడెం చెప్పిన కథలు – సారంగ Apr, 2016

* * *

APRIL 14, 2016 14 COMMENTS

gudem

ఆరోజు క్లాసులో అశోక్ అల్లరి శ్రుతిమించడంతో వాడిని గట్టిగా మందలించేను. ప్రక్క బెంచీలో కూర్చున్న మాలతి తన పుస్తకాలు పదేపదే తీసి దాస్తున్నాడని ఫిర్యాదు చేసింది. చదువులో చురుగ్గా ఉంటాడని వాడి అల్లరిని ఇష్టంగానే భరిస్తూ ఉంటాను. కానీ ఒక్కోసారి అది హద్దులు దాటుతోందనిపిస్తోంది.

‘ చదువుకుందుకు స్కూలుకి రండి, ఇలాటి పిచ్చిపనులు కోసం అయితే స్కూలుకి రావడం అనవసరం. ఇంట్లో అమ్మానాన్నలు మంచి చెడు ఏమీ చెప్పరా మీకు’ కోపంగా అన్నాను. ఏమనుకున్నాడో వాడు తలవంచుకుని నిలబడ్డాడు కాని మాట్లాడలేదు. తెలివైన వాడు, వాడిని సరైన దారిలోకి మళ్లించాలి.

స్టాఫ్ రూమ్లో అశోక్ ప్రస్తావన తెస్తే, వాడి గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది అని చెప్పేరు. వాడికి ఇంట్లో చెప్పేవాళ్లు ఎవరూ లేరు, వాడు చేసే అల్లరికి హద్దూ లేదు. వాడిని ఎవ్వరూ బాగు చెయ్యలేరని, ఏడాదిగా వాడు ఆ స్కూల్లో జేరిందగ్గర నుంచి వాడి ఇంటినుండి ఇప్పటి వరకూ ఎవ్వరూ వచ్చి వాడి మంచిచెడ్డలు అడగలేదని అందరూ ఏకగ్రీవంగా చెప్పేసేరు. వాడంతట వాడే ఎలాగూ స్కూలు మానేసేరోజు ఒకటి వస్తుందని తేల్చేసేరు. వాడి ఇంటికి వెళ్లి పెద్దవాళ్లతో మాట్లాడాలని అనుకున్నాను .

సాయంకాలం గూడెంలో క్లాసు ముగించి వస్తుంటే మేరీ ఎదురైంది. పలకరింపుగా నవ్వాను. ఆమెను అప్పుడప్పుడు అక్కడ చూస్తూనే ఉంటాను. నాతో ఏదో మాట్లాడాలన్నట్టు గబగబా నాదగ్గరకి వచ్చింది.

‘ టీచరుగారూ, కొన్ని ప్రత్యేక కులాలలోని ఆడవాళ్లకి ప్రభుత్వం బ్యూటీషియన్ కోర్సు ఉచితంగా నేర్పిస్తోంది. పదోక్లాసు ప్యాసైనా, ఫెయిలైనా అర్హత ఉంది. బస్సుపాస్ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది. ఒక్క ఆరువారాలు కోర్సు నేర్పి ఒక ఉద్యోగం కూడా చూబెడుతుంది. ఒక్కో గ్రామం నుంచీ ముగ్గురుకి అవకాశం ఇస్తున్నారు. ప్రొద్దున్నుంచీ గూడెంలో తిరుగుతున్నాను. ఒక్కరు కూడా నేర్చుకుందుకు ముందుకు రాలేదు. ఇక ఈ రోజుకి వెళ్లిపోతున్నాను. రేపు మళ్లీ రావాలి. ఈ గూడెంలో అలాటి వారెవరైనా మీకు తెలుసా టీచరుగారూ?’ అంది అలసటతో ముఖం అద్దుకుంటూ.

గూడెంలో ముగ్గురు నలుగురు అమ్మాయిలు పదోక్లాసు వరకు చదివి మానేసిన వాళ్లున్నారు. నిజమే. వాళ్లను గురించి కనుక్కోవాలి. వాళ్ల పేర్లు చెప్పాను.

మేరీ నిస్పృహగా చూసింది, ‘వాళ్లని కలిసేను టీచరుగారూ, ‘మావోళ్లు పెళ్ళి చేస్తారు’ అంటూ సిగ్గుపడి పోయారు ఆ పిల్లలు, తాము ఏమీ నేర్చుకోవలసిన అవసరం లేదని చెప్పేసేరు. పెళ్ళిళ్లైనా, ఎక్కడున్నా చేతిలో పని ఉంటుంది, అవసరానికి కుటుంబాన్ని ఆదుకుంటుంది అని చెప్పినా వినలేదు. మీరు కూడా చెప్పిచూడండి కాస్త. పేర్లు ఇచ్చేందుకు టైమెంతో లేదు.’ అంటూ ఆలస్యమవుతోందని వెళ్లిపోయింది.

మేరీ మాటలకి ఆశ్చర్యం వేసింది. తమకంటూ ఒక వృత్తి ఉచితంగా నేర్పిస్తామంటే వద్దంటున్నారే. వీధిలో అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే ఆ అమ్మాయిలు కళ్లముందు కదిలారు. నేను చెప్పి చూస్తాను అని మేరీ కి మాట ఇచ్చాను.

                           మర్నాడు క్లాసుకి కాస్త ముందుగానే బయలు దేరేను. భవాని, సుజాత, లావణ్య ….అందరినీ కలిసాను. ఎవ్వరూ బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుందుకు ముందుకు రాలేదు. ఎవరి కారణాలు వారికున్నాయి. ముఖ్య కారణం మాత్రం పెళ్ళి! ఎప్పుడు కుదురుతుందో తెలియదు, కుదిరినా ఒక విద్య నేర్చుకుందుకు ఏవిధంగా అది అడ్డమో నాకు అర్థం కాలేదు. కానీ నలుగురూ చక్కగా వాళ్లకు వచ్చినంతలో తమ అందాలకి మెరుగులు దిద్దుకున్నారు.

ఆ విషయం గురించి వాళ్లని అభినందించి,  ‘అదే పని మరింత నైపుణ్యంతో చెయ్యచ్చు. అది జీవనోపాధిని కూడా ఇస్తుంది’ అని చెప్పినా ససేమిరా అన్నారు.

సుజాత ఇంటి దగ్గర మాత్రం ఆమె మేనమామ భార్య ఇంట్లోంచి బయటకు వచ్చి చెప్పింది,

‘టీచరుగారూ, నిన్న ఒకామె వచ్చి ఇయన్నీ చెప్పింది. మీరు కూడా ఇట్టాంటియన్నీ చెప్పబోకండి. ఇప్పటికే మేం చాలా బాథలు పడ్డాం. మా వోళ్ళ పిల్ల ఇలాగే ఏదో నేర్సుకుంటానంటూ మొదలెట్టి, ఆనక ఎవరినో ప్రేమించానంటూ చెప్పాపెట్టకుండా ఇల్లిడిచి పోయింది. పరువుతక్కువ పనులు……ఇదిగో ఈ సుజాత, దీని తమ్ముడు అశోకు మా ఆడపడుచు బిడ్డలు. ఈళ్ల బాధ్యత మామీద ఉంది. అశోకు మీ బళ్ళో చదువు కుంటున్నాడు లెండి. ఈ పిల్లకి పెళ్ళి చేసి పంపేస్తే మా బరువు తగ్గుతుంది. ఇప్పుడీ పిల్ల సంపాదించి మాకు పెట్టక్కర్లేదు. మీరెళ్లిపొండి టీచరుగారూ, మా ఇంటాయనొస్తే గొడవ చేస్తాడు, ఇట్టాంటియన్నీ ఆయనకి గిట్టవ్.’ అంది.

ఎంత చెప్పినా వాళ్ల తీరు వాళ్లదే. చేసేదేమీ లేక వెనక్కి తిరిగాను. అశోక్ గుర్తొచ్చాడు. కాని వాడు తల్లిదండ్రుల దగ్గర ఉండడన్న విషయం ఇప్పటిదాకా తెలియదే. వాడి విషయం మాట్లాడేందుకు ఇది సమయం కాదనిపించింది.                                                       

                        దసరా శెలవులు ముగిసి స్కూలు మొదలైంది. అటెండెన్స్ తీసుకుంటుంటే అశోక్ రాలేదని గమనించాను. వాడే కాదు చాలామంది శెలవులు అయిపోయాక కూడా నాలుగురోజులు వరకూ గైర్హాజరు అవటం మామూలే. మెల్లిగా ఒక్కక్కరే వస్తున్నారు. వాడి గురించి అడిగితే ‘స్కూలుకి రానన్నా’డని కబురు చెప్పేరు తోటి పిల్లలు. మరునాడు తప్పక రమ్మన్నానని చెప్పి పంపినా వాడు రానేలేదు. ఆ నాలుగు రోజులూ గూడెంలోనూ కనపడలేదు వాడు. విషయం ఏమిటో కనుక్కోవాలి.

                         ఆరోజు ప్రొద్దున్నే స్కూల్ కి బయలుదేరుతుంటే మా వీధిలో క్రొత్తగా కడుతున్న ఇంటి దగ్గర తాపీ పనివాళ్లతో అశోక్ కనిపించాడు. గబగబా దగ్గరకి వెళ్లి, ‘స్కూలు మానేసి ఇదేం పని అశోక్’ అన్నాను.

‘ మా మామయ్య కి రోడ్ ప్రమాదంలో కాళ్లకి బాగా దెబ్బలు తగిలేయి టీచర్. నిన్ననే హాస్పటల్ నుండి ఇంటికి తీసుకొచ్చేం. ఆయన ఇంక పనిలోకి వెళ్లలేడు. అందుకే నేను పనిలోకి వచ్చేను.’ సీరియస్ గా చెప్పేడు.

అశోక్ ప్రక్కన ఉన్న అతను చెబుతున్నాడు,

‘ ఏడాది క్రితం వీడి అమ్మానాన్న లారీ ప్రమాదంలో చనిపోయారు. మేనమామ వీడినీ, వీడి అక్కనీ తీసుకొచ్చేడు. కానీ ఇంతలో ఇట్టాంటి పరిస్థితి దాపురించింది.’ అశోక్ తలమీద ఇటుకల బరువుతో పనుల్లోకి జొరబడుతున్నాడు. వాడి వెనకే పని అందుకుంటున్న సుజాత………….

అశోక్ కి తల్లిదండ్రులు లేరన్న విషయం జీర్ణించుకోలేక పోయాను. వాడూ ఎన్నడూ చెప్పనే లేదు. మేన మామ కుటుంబం బాధ్యత ఇక వీడిదేనా? అప్రయత్నంగా కళ్లు తడి బారాయి. ఆరోజు నేను కోప్పడి నప్పుడు వాడి తల్లిదండ్రుల ప్రస్తావన తెచ్చేను. వాడి ఆనాటి మౌనం ఇప్పుడు అర్థమవుతోంది. వాడి అల్లరి, చిలిపితనం వెనుక ఇంత వేదన!

క్లాసులో చెప్పిన పాఠాలు అల్లరి మధ్య కూడా విని జవాబులు చెప్పే అశోక్ కళ్లముందు కదిలేడు. ఇంక పైన ఆ దృశ్యం కనిపించదా? వాడి చదువు సంగతి ఏమవుతుంది?

నెల క్రితం మేరీ చెప్పిన ప్రభుత్వ పథకంలో ఇప్పుడు సుజాతకి అవకాశం దొరికేలా చూడాలి. ఆ అమ్మాయి నీడ పట్టున పని చేసుకుని ఆర్థికంగా తన కాళ్లపైన తను నిలబడే అవకాశం అని అప్పుడు ఒప్పించ లేకపోయాను. ఇంటి జరుగుబాటుకి, తమ్ముడి చదువుకి అవసరమన్న విషయం ఇప్పుడైనా నచ్చ జెప్పాలి అనుకుంటూ స్కూలు వైపు దారితీశాను.

మీ మాటలు

  1. రమణ పి.ఎన్ says:

    బాగా రాసేరు. గవర్నమెంట్ ఇచే అవకాశాలు అందుకోకపోతే వాళ్ళు ఇంకా అలాగే కష్ట పడాలి. ఏదో తోచిన విధంగా గవర్నమెంట్ కూడా వీళ్ళ కోసం ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటోంది.ఎవరి మీద జాలి పడగలం!!

  2. sreedevi canada says:

    రమణ గారు బాగా చెప్పేరు, టీచర్స్, గవర్నమెంట్ తనకి తోచిన విధం గా సహాయం చేస్తున్నారు కాని వీళ్ళ జీవితాలు ముందు అడుగు వెయ్యటం లేదు. దీనికి కారణం పెద్ద వాళ్లకి చదువు విలువ తెలియక పోవడం మరియు చదువు కోవడం అనేది long process to get benefits . ఏది ఏమైనా మన టీచర్ గారు తన పరిధిలో సహాయం అందించడం లో ఉన్న తపన హర్షించ దగినది .

  3. అయ్యో వెర్రి పిల్లలు…పాపం మేనమామ దగ్గర ఉండడం వాళ్ళ ఇలాంటి నిర్ణయం తీసుకోవల్సి వచిందేమో. మేనమామ పెళ్ళాం కూడా తప్పు లేదు .. బాధ్యతా తీర్చుకోవడమే కర్తవ్యమ్ మరి. ఈ కోణం లో చూసినా అందరూ సరైన పనే చేసినట్టు ఉన్నారు కాని…చివరికి పిల్లలే చదువు లేక వాళ్ళ పెద్ద వాళ్ళ లాగే బతక వలసి వస్తోంది.

  4. వాళ్ళ జీవితాలు ఉద్ధరిద్దామని ట్రై చేస్తున్నా అవి అందుకోలేకపోతే నష్టపోయేది వాళ్ళే .కాని వాళ్ళకున్న కారణాలు వాళ్ళకున్నాయి .అమాయకముగా జీవిన్చేస్తున్న్రు ఆశ్చర్యంగా వుంది చదువుతున్న కొద్ది .రచయిత్రి గారికి ధన్యవాదాలు

  5. చంటి గారు చెప్పింది అక్షరాల నిజం. సరైన నిర్ణయం తీసుకునివచ్చిన అవకాశాలు అందిపుచుకుని jeevitaalu బాగుచేసుకోవలసిన బాధ్యతా కూడా vaalla మీద వుంది . రచయిత్రి గారికి ధన్యవాదాలు .

  6. seshu chebolu says:

    కష్టాల మీద కష్టాలు. అసలే తల్లి తండ్రులు లేని పిల్లలు, మేనమామ మీద ఆధార పడిన పిల్లలు పైగా ఇప్పుడు ఇంకో కష్టం!!
    ప్రభుత్వ పధకాలు చాల వరకు మనకి తెలీవు. అవి మొదల పెట్టడంతో పాటు వాటిని ప్రజల దాక వచ్చేలా చేసే బాధ్యత ప్రభుత్వానిది. చాల వరకు అలాంటివి ఎవరికీ తెలీకుండా పోతాయి. కొన్ని సార్లు తెలిసిని ఆ పదకాలని ఉపయోగించు కోవాలంటే ఎక్కడికి వేళ్ళలో తెలీదు. ప్ల్స్చ్. ఈ కదా చదివితే ఎక్కడ మొదలు పెట్టాలో తెలియకుండా ఉంది. అనురాధగారికి మా కృతజ్ఞతలు ఎలాంటి చిన్న – పెద్ద సమస్యలు మా ముందికి తెచ్చినందుకు.

  7. lakshmi padmini nadella says:

    ప్రభుత్వాలు పేదవారి గురించి అనక విధాలుగా సహాయం చేస్తున్నారు అయినప్పటికీ వీళ్ళ జీవితాలు ముందు అడుగు వెయ్యటం లేదు. దీనికి ప్రధాన కారణం చదువు విలువ తెలియక పోవడం మరియు దాని ఫలితం వెంటనే రాకపోవడం .
    టీచర్ గారు వాళ్ళ పరిస్తితి గ్రహించి సహాయం అందించడం లో ఉన్న తపన గొప్పది. ఇటువంటి అంశాన్ని ఎంచుకొన్నందుకు రచిత్రి గారికి కృతజ్ఞతలు.

  8. NADELLA SURYANARAYANA says:

    బ్యూటీషియన్ కథని రచయిత్రి చక్కగా వివరించారు. పల్లెల్లలో బయటకి కనిపించని సమస్యలు ఈ విధంగా రచయిత్రి గారు తెలేయజేసిన విధానము బాగుంది.

  9. శేషు చేబోలు గారు సరిగ్గా చెప్పేరు….ప్రభుత్వ పధకాలు చాల వరకు మనకి తెలీవు. అవి మొదల పెట్టడంతో పాటు వాటిని ప్రజల దాక వచ్చేలా చేసే బాధ్యత ప్రభుత్వానిది. చాల వరకు అలాంటివి ఎవరికీ తెలీకుండా పోతాయి. కొన్ని సార్లు తెలిసిని ఆ పదకాలని ఉపయోగించు కోవాలంటే ఎక్కడికి వేళ్ళలో తెలీదు. మన టీచర్ గారి లాంటి వారి ప్రయత్నాలు హర్షించ తగినది.

  10. నాదెళ్ళ సూర్యనారాయణ గారు కూడా ఒక్క ముక్క ఎంతో బాగా చెప్పేరు… ”పల్లెల్లలో బయటకి కనిపించని సమస్యలు ఈ విధంగా రచయిత్రి గారు తెలేయజేసిన విధానము బాగుంది”. తీరికి సమయం లో వారికీ చదువు చెప్తూ ఏదో రకం గా వారిని వృది లోకి తేవాలని ఈ రచనల ద్వారా వారి సమస్యలని మన ముందుకి తెస్తున్నారు.

  11. అశోక్ లాంటి పిల్లలు ఎంత కష్ట పడితే పైకి రాగలరు ? యాకుబ్ గారి బుజ్జి కధలో లాగ క్రియేటివిటీ తో గల గల నవుతూ పెరగవలసిన పిల్లలు యాంత్రింకం గ రోజు కూలితో పెరుగుతున్నారు. తల్లి తండ్రుల ప్రేమ ఉంటె చాలు వీళ్ళకి పెద్ద చదువులు రాకపోయినా. కథ చాల జాలి వేసేలగా రాసేరు.

  12. పొరపాటున యాసిన్ గారి పేరు బదులు యాకుబ్ గారిది quote చేసినందుకు క్షమించగలరు.

  13. Lakshmi ramesh dasika says:

    There are a few schemes provided by the government, but the needy and the deserving children are unable to avail them because of lack of awareness and access to necessary and timely information. The teacher’s effort to create awareness about these schemes ( beautician course) among the students and parents is praise- worthy.

  14. D G Sekhar says:

    Changing the people in the society can be done by writers like you . Well done and congratulations for the wonderful story .

* * *

One thought on “బ్యూటీషియన్ – గూడెం చెప్పిన కథలు – సారంగ Apr, 2016

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.