మహేష్ బాబు – గూడెం చెప్పిన కథలు – సారంగ May, 2016

* * *

MAY 12, 2016 13 COMMENTS

gudem

ఆరోజు సాయంకాలం క్లాసుకి వెళ్ళేసరికి రోజూ కంటే క్లాసు ఎక్కువ సందడిగా ఉంది. నాకు అర్థం అయింది, క్లాసులోకి మరో క్రొత్త విద్యార్థి వచ్చిచేరినట్టు. అది మామూలే. ఎవరైనా క్రొత్తగా క్లాసుకి రావటం మొదలుపెడితే అప్పటికే క్లాసుకి వస్తున్న వాళ్లు క్రొత్త వాళ్లని తమలోకి ఆహ్వానిస్తూ, వాళ్లని అనేక ప్రశ్నలతో ఊదరగొట్టేస్తారు. తమ సీనియారిటీని వాళ్లకి అర్థం అయ్యేలా చేసే ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా మన ప్రొఫెషనల్ కాలేజీల్లో ‘ర్యాగింగ్’ హడావుడి లాటిదే. కాకపోతే అది ప్రమాదకరమూ, ఇబ్బందికరమూ కాకుండా అమాయకమైన అల్లరే ఎక్కువ కనిపిస్తుంది వాళ్ల వయసుకు తగినట్టుగా.

అటెండెన్స్ తీసుకుంటూ, క్రొత్త కుర్రాడిని ‘ నీ పేరేమిటి?’ అని అడిగాను. ఆ పిల్లవాడు చెప్పేలోపు మిగిలిన వాళ్లు ఒక గుంపుగా కలిసి చెప్పేసారు,’ మహేష్ బాబు టీచర్’ అంటూ. ఆ పిల్లవాడు నవ్వుతూ నిలబడ్డాడు. నాకూ నవ్వొచ్చింది.

తెలుగు సినిమా హీరోల పేర్లు చాలానే వినిపిస్తున్నాయి ఈ పిల్లల్లో. కొందరైతే ఒక్కోసారి , ‘టీచర్ , నేను పేరు మార్చుకున్నాను’ అంటూ ఒక హీరో పేరు చెబుతుంటారు.

‘ అలా ఎప్పుడుపడితే అప్పుడు మార్చుకోకూడాదు. స్కూల్లో ఒక పేరు ఉంది కదా’ అంటే ‘అయితే ఇంటి దగ్గర, ట్యూషన్ లోనూ ఈ పేరు పెట్టుకుంటాను టీచర్ ‘ అంటుంటారు.

ఆ పిల్లవాడికి ఒక పదమూడేళ్లు ఉంటాయేమో! ‘ ఏం చదువుతున్నావ్?’ నాప్రశ్నకి,

‘ ఐదు’ అన్నాడు వాడు. వాడి ముఖకవళికలు కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి. కళ్లు విశాలంగా ఉండి, ఆ ముఖానికి నోరు, ముక్కు, చెవులూ కూడా పెద్దగానే ఉన్నట్టున్నాయి. మహేష్ బాబుకి  రెండుచేతులకీ ఆరు, ఆరు వేళ్లు ఉన్నాయని అప్పటికే అందరూ నాకు చెప్పేసారు.

వాడు స్కూల్లో ఈ మధ్యే కొత్తగా చేరిన పిల్లాడని గుర్తుపట్టాను.స్కూల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆటల పోటీల్లో అన్నింటిలోనూ వాడే ముందున్నాడు. స్టాఫ్ రూమ్ లో వాడి గురించిన చర్చ జరిగింది కూడాను నిన్న లంచ్ సమయంలో. ఈ సంవత్సరం జిల్లాలో జరిగే అన్ని ఆటల్లోనూ స్కూల్ తరఫున వాడు బోలెడు బహుమతులు గెలవటం ఖాయమని అందరూ అన్నారు.

ఒకరిద్దరు టీచర్లు చెబుతున్నారు వాడు నిరంతరం నవ్వుతూనే ఉంటాడని. వాడిదొక ప్రత్యేక లోకం అన్నట్టు , అందులో ఏదో ఒక ఆనందం నిరంతరం అనుభవిస్తున్నవాడిలా నవ్వుకుంటూనే ఉంటాడనీ. ఎక్కడో మారుమూల పల్లె నుంచి వచ్చాడని తెలిసింది.

‘తెలుగు అక్షరాలు చదువుతావా?’ అని అడిగితే ‘చదువుతాను’ అన్నాడు.

‘ఇంగ్లీషు అక్షరాలు చదువుతావా” అంటే ‘చదువుతాను ‘ అన్నాడు. వాడు జవాబు చెబుతున్నప్పుడూ నవ్వుతూనే ఉన్నాడు. వాడి నవ్వులో అమాయకత్వం చూస్తున్నాను.వాడి నవ్వు చూసి పిల్లలందరూ నవ్వటం మొదలు పెట్టారు.  

అక్కడికొచ్చే పిల్లల్లో చాలామంది తెలుగు అక్షరాలు గుర్తు పట్టలేరు. వాళ్లు చదువుతున్నది  ఎనిమిదో తరగతి అయినా, తొమ్మిదో తరగతి అయినా ఇదే పరిస్థితి. ఇంగ్లీషు అంటే చాలా భయం అని ముందే చెప్పేస్తారు. రోజూ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ అని చెప్పి అచ్చుపుస్తకంలోంచి నోట్ పుస్తకం లోకి ఒకటి, రెండు పేజీలు రాస్తుంటారు. రాసేది చదవమంటే చదవలేమని స్పష్టంగా చెప్పేస్తారు.

అందుకే ముందు వాళ్లకి అక్షరాలు, గుణింతాలు నేర్పే పని పెట్టుకున్నాను. వాళ్లని తప్పులు లేకుండా తెలుగు , ఇంగ్లీషు చదివేలా తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.

రోజూ క్లాసు మొదలు పెడుతూనే కొన్ని తెలుగు మాటలు, ఇంగ్లీషు మాటలు డిక్టేషను ఇచ్చి రాయించే అలవాటు చేసేను. ఆ తర్వాతే క్రొత్త పాఠం, ఎక్కాలు, కొన్ని బేసిక్ లెక్కలు చెప్పి చేయిస్తుంటాను.

‘ డిక్టేషన్ రాద్దురుగాని, పుస్తకాలు తియ్యండి ‘అన్నాను.

‘ మహేష్ బాబూ, నువ్వు కూడా డిక్టేషన్ రాయాలి. పుస్తకం తియ్యి’ అంటూ మిగిలిన పిల్లలు వాడిని తొందర చేసేరు.

అందరూ పుస్తకాలు తీసేరు.

గుమ్మం బయట ఎవరో నిలబడినట్టు కనిపించి బయటకొచ్చి ‘ ఎవరంటూ’ వివరం అడిగాను. ఆమె ని చూస్తుంటేనే అర్థమైంది మహేష్ బాబు తల్లి అయిఉంటుందని.

ఆమె చెబుతోంది, ‘క్రొత్తగా గూడెం లోకి వచ్చామనీ, మహేష్ బాబు కాస్త చదువులో వెనక పడ్డాడనీ, ఆ పిల్లవాడిని కాస్త చదివించమని’ చెప్పింది. ‘ అమ్మా, తండ్రి లేని పిల్లడమ్మా. ఆయన లారీ ప్రమాదంలో చనిపోయిన తర్వాత చాలా బెంగ పెట్టుకున్నాడు. అయితే హుషారుగానే ఉంటాడు. ఏదీ బుర్రకి ఎక్కనట్టు ఉంటాడు . బెంగ చెప్పుకోలేక ఇలా తయారయాడని అనిపిస్తాంది. అందుకే ఆ ఊరొదిలి ఇక్కడికి తీసుకుని వచ్చేసాను’. ఆమె దీనగాథ మనసుని చెమర్చింది.

నేను ‘ సరే’ అనటంతో, ‘నమస్కారం అమ్మా’ అంటూ వెనక్కి తిరిగింది.

క్లాసులోకి వచ్చి డిక్టేషన్ ఇవ్వటం మొదలు పెట్టేను. ముందు కొన్ని తేలిక మాటలు చెప్పి , ఆఖరున నాలుగైదు కొంచెం కష్టమైన పదాలు ఇస్తుంటాను. క్లాసు మొత్తం తిరుగుతూ చూస్తున్నాను. అందరూ రాస్తున్నట్టే కనిపించారు. కాని ఎంతవరకూ తప్పుల్లేకుండా రాస్తారనేది చెప్పటం కష్టమే. ఇదివరకటి కంటే కాస్త మెరుగైన ఫలితం కనిపిస్తోంది కాని అది కొద్ది మందిలో మాత్రమే చూస్తున్నాను. ఇంకా చాలా కష్టపడాలి పిల్లలు, నేను కూడా.

ఇంకా ఒకటి, రెండు పదాలు చెబితే పూర్తవుతుంది. మహేష్ బాబు వైపు చూస్తున్నాను. వాడు ఏమీ రాస్తున్నట్టు లేదు. వాడి పక్కనున్న పిల్లలు ‘ఏదీ రాస్తున్నావా? చూబించు’ అంటూ వాడి మీద పెత్తనం చేస్తూ, వాడి పుస్తకంలోకి చూసే ప్రయత్నం చేస్తున్నారు. వాడు మాత్రం అదే నవ్వు ముఖంతో ఉన్నాడు, కాని తన పుస్తకాన్ని వాళ్లెవరికీ అందనియ్యటం లేదు.

నాకు అనుమానం వచ్చింది వాడు రాస్తున్నాడా లేదా అని. ఏదో చెప్పటం అయితే చెప్పేసాడు, చదవటం వచ్చనీ, రాయటం వచ్చనీ. డిక్టేషను పూర్తి చేస్తూనే,

‘ మహేష్ బాబూ, నువ్వు రాసేవా? ఇలా పట్రా నీ పుస్తకం’ అన్నాను

వాడు నవ్వుతూ లేచి నిలబడి ‘ లేదు టీచర్. నాకు రాయటం రాదుగా ‘ అన్నాడు.

నాకు కాస్త అసహనం కలిగిన మాట నిజమే కాని అతని గురించి తల్లి చెప్పిన వివరం మనసులో మెదులుతోంది. అడిగితే చదవటం వచ్చని చక్కగా చెప్పాడు, ఇప్పుడేమో రాయటం రాదని చెబుతున్నాడు , పైగా నవ్వుతాడు.

‘ ఏమీ రాయలేదా? ‘ అన్నాను. నా అసహనం వాడి నవ్వు వల్లనే కాబోలు. ఇప్పుడు నవ్వవలసిన అవసరం ఏమిటి?

‘ పుస్తకం పట్రా’ అన్నాను. ఒక్క అక్షరం రాయలేదు.

అతని పక్కన కూర్చున్న కిషోర్ చెబుతున్నాడు, ‘ నేను చూసేను టీచర్, వాడు ఏం రాయలేదు ‘ కిషోర్ని ఆగమని చెప్పాను.

నిరీష పెద్దగా చెప్పింది, ‘చూడండి టీచర్ , ఏమీ రాయకపోయినా ఎలా నవ్వుతున్నాడో ‘

మహేష్ బాబు నిరీష కేసి చూస్తున్నాడు. ఏమీ రాయకపోతే నవ్వకూడదా? అన్నట్టున్నాయి వాడి చూపులు , వాడి నవ్వుముఖం.

నిరీష మాటలకి, అప్పుడనిపించింది నా అసహనం న్యాయమైనది కాదని. వాడి అమాయకమైన ముఖం చూస్తే నాకే ఎందుకో తప్పు చేసినట్టనిపించింది. వాడు రాయలేకపోవటానికి, వాడి నవ్వుకీ సంబంధం ఏమిటి?

ప్రపంచంలోని ఏ సమస్యా అంటనట్టు వాడు అలా చిరునవ్వుతో ఆనందంగా ఉంటే నిరీషకి కానీ, నాకు కానీ అంత అసహనం ఎందుకు? వాడి నవ్వు ఒక సానుకూల భావనని వాడి చుట్టూ ప్రవహించేలా చేస్తోంది. అది నేర్చుకోవలసిన అవసరం వాడి చుట్టు ఉన్నమా అందరికీ ఉంది. పైగా అశాంతి, అరాచకాల మధ్య జీవిస్తున్న ఈ ప్రపంచానికి తన నవ్వుతో ఒక సానుకూల వైఖరిని నేర్పిస్తున్నందుకు వాడికి కృతజ్ఞత చెప్పద్దూ?

వాడిలో ఘనీభవించిన దుఃఖం నుండి వాడిని ముందు బయట పడెయ్యాలి. ఆ నవ్వుపూసే వెలుగు దారులతోనే ప్రపంచాన్ని గెలిచేందుకు వాడిని సిధ్ధం చెయ్యాలి.

  1. seshu chebolu says:

    కధ చదువుతున్నంత సేపు మహేష్ బాబు నా కాళ్ళ ముందు కనపడ్డాడు. ఈ ఎపిసోడ్ చాల సున్నితంగా ఉంది. పిల్లల అమాయకత్వాన్ని అనురాధగారు బాగా చిత్రీకరించారు. నిజంగానే చదవడం, రాయడం రాక పోతే నవ్వే హక్కు లేదా??
    నాకు తెలీకుండానే ప్రతి నెల గూడెం కదా కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అనురాధగారికి నా అభినందనలు.

  2. ఈ కధలో రచయిత్రి గారు మహేష్ భావాలని సున్నితంగా వర్ణించేరు . మహేష్ లాంటి పిల్లలు వారి ఉదాసీనత నుంచి త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న .

  3. Lakshmi ramesh dasika says:

    A prerequisite in life is the ability to smile in the face of problems. Mahesh Babu hid all his problems behind his sweetest smile . He is a real hero and not a reel hero. మనిషి చిరునవ్వు తో ఎదుట వారి మనుసుని దోచుకోగలరు. స్నేహపూరిత వాతావరణములో మంచి అభివృద్ధి సాధించగలము. Mahesh babu కూడా జీవితంలో అభివృద్ధి పదంలో సాగడానికి అందరు సహకరించాలి.

  4. sreedevi canada says:

    ఈ కధ లో మనం నీర్చుకోవాలిసింది కూడా చాల ఉంది అనిపించింది. మహేష్ బాబు గురించి తెలిసింది కనుఅక్ మన ప్రవర్తన వేరేగా ఉంటుంది అతనితో. తెలియని నాడు కటువుగా ఉంటుందేమో అనిపించింది. ఏమైనా ప్రతి మనిష ప్రవర్తనకి ఒక కారణం ఉంటుంది అనేది మనం చాలా స్పష్టంగా కనపడుతోంది ఇక్కడ. కాని అది పిల్లలకి తెలియచేయడం, పిల్లలందరూ అతని మీద జాలి పడడం అనేది మంచిదో కాదో మనకి టీచరగారు చెప్పాలి.

  5. chanti says:

    అయ్యో కధ అప్పుడే అయిపోయిందా అనిపించింది…మిఠాయి పోట్లంలో తొంగిచుసినట్టు ఇంకా ఉంటె బాగుండు అని అనిపించింది. ఎంతో సరదాగా ఉన్నట్టు గా ఉన్నా ఈ కధ చాలా లోతు అర్ధంతో ఉంది

  6. Bhavani says:

    ‘మహేష్ బాబు’ చాలా క్యూట్ గా ఉంది పేరు & కథ.
    పేరుకు తగ్గట్టు హీరో లాగే ప్రవర్తిస్తున్నాడు పిల్లాడు. నవ్వు మొహం తో తన కష్టాలని చాటు వేసేడు. కొంత మంది పిల్లలు ఎంత పెద్దరికం గా ప్రవర్తిస్తారో కదా. జీవితం నేర్పే పాఠాలు. లక్ష్మి గారు రాసినట్టు ఎంతో వ్రుధి లోకి వస్తాడు పైగా మన టీచర్స్ లాంటి వారి సహాయం తో ఇంకా ధైర్యం గా ముందుకు రాగాలరనే నా ఉద్దేశ్యం. ఇలాంటి కొన్ని కథలు చదువుతుంటే అబ్బా ఎంత సింపుల్ గా మనసుకి హత్తు కునే లాగా రాసేరనిపిస్తుంది

  7. Rachana Somayajula says:

    ఈ మంచి నవ్వు కథ చెప్పి కంట తడి పెట్టించారు. నవ్వు ప్రాథాన్యత చక్కగా గుర్తుచేశారు 🙂

  8. ఈ సంచిక లో గూడెం కథ అసంపూర్తిగా అనిపించింది. రచయత్రిగారు ఏమి చెప్పదలచుకున్నారో? మహేష్ బాబు నవ్వు ముఖం ఎవరినైనా మార్చిన సంఘటన ఉంటె కొంచెం పట్టు వచ్చేదేమో కథకి ? వాడి నవ్వు పిచ్చి లాగ ప్రపంచం చూడకపోతే అదే గొప్ప!!!

  9. అరుణ says:

    సీత గారు అన్నట్టు అసంపూర్తి గా ఉంది ఈ కధ, కాని ఇది కేవలం టీచర్ గారి రోజువారీ లో ఒక గమనింపు మాత్రమే. ఇలాగే కొన్ని సంఘటనలు కొందరి జీవితాల్లో మానసిక గాయం చేస్తాయి. ఇది పిచ్చి లేక వెర్రి గోల లాగా ఉండచు సమాజానికి. . సమాజం వారిని పిచ్చి వారిగా ముద్ర వేయక ముందే కుటుంబం మరియు స్కూల్ సహాయం చేస్తే బాగుంటుంది.

  10. suryanarayana says:

    మహేష్ బాబు పాత్ర బాగుంది. నవ్వు కథ చెప్పి కంట తడి పెట్టించారు. నవ్వు ప్రాముఖ్యత వివరణ బాగుంది.

  11. suryanarayana says:

    మహేష్ బాబు పాత్ర బాగుంది. నవ్వు ప్రాముఖ్యత వివరణ బాగుంది.

  12. మహేశ్ బాబుకి వేరే పెరుగుదలకి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా వున్నాయేమో పరిశీలించవలసిందిగా మనవి.

  13. ప్రపంచంలోని ఏ సమస్యా అంటనట్టు వాడుంటే నిరీషకి కానీ, నాకు కానీ సమస్య ఏమిటి? ……మొదట సారి చదవటం గూడెం కథలు . నిర్లక్ష్యమో, నిర్లప్తతో అని మనం అనుకుంటాము . వారి వయసుకి అది ఒక సమస్య కాదు అని మనం గమనించాం చాలాసార్లు . కంట తడి వచ్చింది ముగింపులో . చాలా బాగున్నాయి మీ కథలు

* * *

One thought on “మహేష్ బాబు – గూడెం చెప్పిన కథలు – సారంగ May, 2016

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.