దేవుడు మాస్టారు-మౌనం – గూడెం చెప్పిన కథలు – సారంగ Jun, 2016

* * *

gudem

క్లాసులు బాగానే జరుగుతున్నాయి. ఎవరమూ ఊహించని సంఖ్యలో పిల్లలు రావడం మొదలు పెట్టేరు. వాళ్ల ఇంటి చుట్టుప్రక్కల ఉన్న పిల్లల్ని మరికొంతమందిని కూడా తీసుకురావడం మొదలు పెట్టేరు. నా ఆత్మ విశ్వాసం ఆకాశం ఎత్తుకు పెరిగిపోయింది.

రోజూ వెళ్లేప్పుడో, వచ్చేప్పుడో దేవుడు మాస్టారు కనిపిస్తూనే ఉన్నారు. నేను నమస్కారం పెట్టంగానే ఆయనా బదులుగా నవ్వుతూ తల ఊపి తన నడక సాగిస్తుంటారు.

సాయంకాలాలు నేను వెళ్లే సరికి గూడెంలో పిల్లలు పనులలోనో, అవి లేనివాళ్లు ఆటలలోనో మునిగి ఉంటారు.  కొన్ని రోజులు ఒక ఆట మరికొన్ని రోజులు మరో క్రొత్త ఆట నడుస్తూ ఉంటుంది అక్కడ.

ఆడే పిల్లల్లో మూడేళ్ల పిల్లల నుండి ఇరవై ఏళ్ల వయసు పిల్లల వరకు ఉంటారు. పెద్ద పిల్లలు చాలామంది చదువులు మానేసిన వాళ్లే, పగలంతా ఏవో పనుల్లోకి వెళ్లి వస్తారు. నన్ను చూస్తూనే మొహమాటంగా నవ్వి, ‘ ఒరేయ్, టీచరుగారొచ్చారు, క్లాసుకెళ్లండి.’ అంటూ వాళ్లకంటే చిన్నపిల్లల మీద పెత్తనం చేస్తుంటారు. క్లాసుకొచ్చే పిల్లలు సాధారణంగా ఆ ఆటల్లో కనిపించరు.

కానీ ఒక ముగ్గురు, నలుగురు మాత్రం మట్టికొట్టుకున్న బట్టలతో, రేగిన జుట్టుతో, అలసిన ముఖాలతో ప్రక్కన అరుగుల మీద పడేసిన పుస్తకాల సంచీలతో నన్ను చూస్తూనే ఆటలు వదిలి క్లాసులోకి వచ్చేస్తారు. ఇంటికెళ్లి స్నానం చేసి రండని చెప్పినా ‘ఇల్లు తాళం వేసి ఉంది టీచర్, మా అమ్మ పనిలోంచి రాలేదు ఇంకా’ అంటూ రోజూలాగే చెబుతారు. ప్రతిరోజూ శుభ్రత గురించి, ఆరోగ్యం గురించి క్లాసు మొదట్లో చెప్పటం ఆనవాయితీగా మారింది. ఫలితం కొంతవరకు కనిపిస్తున్నా కొంతమందిలో మార్పు ఇంకా రావాల్సి ఉంది.

ఆరోజు నల్లబాలు ( వీళ్ల పేర్లు చాలా ఫ్యాన్సీగా ఉంటాయి, వాళ్లే పెట్టుకుంటారు అసలు పేర్లు కాకుండా) నేను క్లాసుకి వెళ్లేసరికి సీరియస్ గా గోటింబిళ్ల ఆటలో మునిగి ఉన్నాడు. క్లాసు మొదలైందన్నసంగతి గమనించి కూడా వాడు ఆట కొనసాగించటం చూసి, పిలిచాను.

వాడు నిస్సంకోచంగా చెప్పేసాడు, ‘ ఇప్పుడే ఆట మాని రాలేను టీచర్, లేటవుతుంది’ అని.

వాడికి తొమ్మిదేళ్లుంటాయి. నాలుగో క్లాసు చదువుతున్నాడు. వాడి ధోరణి ఆరోజు కొంచెం వింతగానే ఉంది.

‘ఏం, ఎందుకు మానలేవు?’

‘ఐదు రూపాయలు బెట్ కట్టాను టీచర్, ఆట గెలిచి, అవి గెలుచుకుంటే కానీ రాలేను.’ వాడి మాటలకి ఉలికి పడ్డాను.

‘బెట్ ఏమిటి, నీకు డబ్బులు ఎక్కడివి అసలు?’

‘ నా దగ్గర మూడు రూపాయలున్నాయి టీచర్, మా మామ్మ నిన్న కొనుక్కోమని ఇచ్చిన డబ్బుల్లో మిగిలేయి. ఒక రెండు రూపాయలు అప్పు తీసుకున్నాను’

వాడి మాటలకి నాకు నోట మాట రాలేదు. బెట్ కట్టటం, అప్పు తీసుకోవటం………….ఏమిటిదంతా? మిగిలిన పిల్లలు క్లాసులోంచి బయటకొచ్చి విషయాన్ని గమనిస్తున్నారు. వాళ్లని తీసుకుని లోపలికి నడిచాను.

ఒక్కసారి పిల్లల తల్లిదండ్రుల్నికూర్చోబెట్టి మాట్లాడాలనుకున్నాను. శనివారం సాయంత్రం పెద్దవాళ్లకి మీటింగ్ ఉందని కబురు పంపేను.

సాయంత్రం ఆరింటికి మీటింగంటే అయిదారు మంది మాత్రమే ఆ సమయానికి రాగలిగేరు. చీకటి పడుతోంది. పనులుకి వెళ్లిన ఆడవాళ్లు చాలామంది షేర్ ఆటోల్లోంచి, మినీ వ్యానుల్లోంచి దిగుతున్నారు. వాళ్లల్లో కొందరు ఇంటి దగ్గర చంటిపిల్లలో, వృద్దులో ఉన్నారంటూ ,‘మీటింగ్ కి మా మగోళ్లొస్తారు’ అంటూ చెప్పి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్లలో కొందరు మీటింగ్ ఏమిటో వినాలన్న కుతూహలంతో అక్కడే కూర్చుండిపోయారు. వాళ్ల ముఖాలు అలసటతో, ఆకలితో చిన్నబోయి ఉన్నాయి.

దేవుడు మాస్టారు మాట్లాడుతున్నారు.

‘ టీచరమ్మ మన పిల్లల కోసం వస్తోంది. మీరందరూ పిల్లల్ని ఇళ్లల్లో ఎట్టానూ చదివించుకోలేరు. సాయంకాలం స్కూలు నుంచి వచ్చిన వాళ్ళని రోడ్డుమీదకి వదిలేయకుండా ఇక్కడికి పంపండి. మీ పిల్లలు చదువుకోవాలంటే ఈ మాత్రం మీరు చెయ్యాలి. రోజూ క్లాసుకి వస్తున్నారో లేదో గమనించుకోవాలి. రోజూ వచ్చి కూర్చుంటే నాలుగు ముక్కలు నేర్చుకుంటారు. టీచరమ్మ మీతో మాట్లాడాలంది, ఆమె గారు చెప్పేది వినండి………’

ఆయన మాటలు పూర్తికాలేదు…………..ఇంతలో లోపల ఆ ఇరుకైన సన్నపాటి వీధుల్లోంచి గట్టిగట్టిగా అరుపులు, కేకలు, వాటివెంటే జనం పరుగెడుతున్న అలికిడి. వాళ్లు మాముందుకు రానే వచ్చేరు. ఒకరిద్దరి చేతుల్లో విరిగిన ప్లాస్టిక్ బకెట్లు, సింటెక్స్ డ్రమ్ములు, చిన్నపాటి కర్రలూ ఉన్నాయి. ముందు పరుగెడుతున్న వాళ్లు వినడానికి అభ్యంతరకరంగా ఉన్న భాషలో గట్టిగా అరుస్తూ పరుగెడుతున్నారు. వెనక ఉన్న వాళ్లు చేతిలో వస్తువుల్ని అదను చూసి ముందు వెళ్తున్నవాళ్ల  మీద విసిరే ప్రయత్నం చేస్తున్నారు.

క్లాసులో కూర్చున్న పెద్దపిల్లలు ఇద్దరుముగ్గురు లేచి వెళ్లబోతూంటే…..  

‘ మీరు ఎక్కడికి’ అన్న నా ప్రశ్నకి

‘నిన్న రాత్రి మా మామయ్య క్రికెట్ గురించి బెట్ కట్టేడు, దాని గురించి మధ్యాహ్నం నుంచీ ఏదో తగువు జరుగుతోంది, చూసొస్తాను టీచర్ ’ జవాబు చెబుతూనే వెళ్లిపోయేడు రమేష్, వాడి వెనుకే వాడి నేస్తాలు. వాళ్ల వెనుకే మరి కొంతమంది లేచి వెళ్లిపోతుంటే చూస్తూ నిలబడిపోయాను.

ఆ గుంపంతా దూరంగా వెళ్లిపోయాక వాళ్ల వెనుకే వచ్చిన కొందరు మీటింగ్ దగ్గర నిలబడిపోయారు. మేష్టారు వాళ్లను ఏదో అడుగుతూంటే జవాబు చెబుతున్నారు.

నేనైతే ఏదో సినిమాలో దృశ్యాన్ని చూస్తున్నట్లుండిపోయాను.

కూర్చున్న ఆడవాళ్లల్లోంచి ఒకావిడ లేచి , ‘ఇదిగో చూడమ్మా టీచరమ్మా, మా పిల్లలు పెద్దయ్యాక మాకు సంపాదించి పెట్టక్కర్లేదు, కాని ఇలా రోడ్లమీద పడి కొట్టుకోకుండా కాస్త బుద్ధులు నేర్పు’ అంటూ ఇంటిదారి పట్టింది. మిగిలిన ఆడవాళ్లు ఆవిడని అనుసరించారు.

మాష్టారు విచారంగా కనిపించారు. మరింక సంభాషణ పొడిగించకుండా మౌనంగా కూర్చుండిపోయారు.

* * *

  1. Lalitha. says:

    There should be some clarity in presenting the story.why master is called devudu and why title is connected to him is not clear.

  2. Prasadarao says:

    బాగుంది కానీ, ఇంకా వివరణ ఇచ్చి ఉంటె బాగుండేది .

  3. రచయిత్రి ఆమె చెప్పదలుచుకున్నది చెప్పలేక పోయారేమో అనిపించింది. కధ అసంపూర్ణంగా అనిపించింది. పాఠకులు ప్రసాదరావు గారు చెప్పినట్టు ఇంకొంత వివరంగా ఉంటె బావుండేది.

  4. గూడెంలో రచయిత్రిగారు వివిధరకాలైన అనుభవాలు చూస్తున్నారు . కాలమెంతగా మారిపోయింది? పిల్లలు అమాయకులు ,వాల్లకేమితెలియదు అనుకుంటే మనమే వేర్రివాల్లమవుతం. పెద్దలనుంచి నేర్చుకున్నది మంచికే ఉపయోగించాలి అని pillala ki తెలియచేప్పటంలో సమాజం విఫలమవుతోంది .

  5. కథ చాలా ఇంటరెస్టింగ్ గా వుంది. మీటింగ్ కి వొచ్చిన కాస్త మంది మంచి చెప్పే బాధ్యతా టీచర్ మీద వేసి, దేవుడి మాస్టర్ మాట, టీచర్ చెప్పబోయే విషయము వినకుండా వెళ్ళిపోయేరు. పేరెంట్ టీచర్ అసోసియేషన్స్ ఇప్పటి కాలంలో వోచినప్పటికి, టీచర్ మీదే ఎక్కువ బాధ్యతా వేసే రోజులు, అటువంటిది ఇంకా గూడెం తల్లి తండ్రులు ఎప్పటికి చెప్పగలరు పిల్లలకి ?? గూడెం సత్యాలు మాకు అందిస్తున్నందుకు కృతఙ్ఞతలు.

  6. chanti says:

    నిజమే సినిమా సీన్ లాగా నే ఉంది ఈ గూడెం కథ.
    తల్లి దండ్రులు అందరూ పనులు ఆపుకుని మీటింగ్ కి రావడమే ఒక పెద్ద స్టెప్. ఆ తల్లి ఇచిన సలహా ‘ఇదిగో చూడమ్మా టీచరమ్మా, మా పిల్లలు పెద్దయ్యాక మాకు సంపాదించి పెట్టక్కర్లేదు, కాని ఇలా రోడ్లమీద పడి కొట్టుకోకుండా కాస్త బుద్ధులు నేర్పు’ కూడా హర్షించ తగినదే. మొదటి నుండి ఈ గూడెం కథలు మనకి టీచర్ గారి అనుభవాలే కాక అక్కడ వాళ్ళ మనస్తత్వం కూడా తెలియ చేస్తున్నాయి.

    ప్రతి కథ లాగా ఈ గూడెం కథలు ఏదో ఒక సుఖాంతం తో పూర్తి చెయ్యకుండా, ఒక సమయని మన ముందుకి తెచ్చి మనలాంటి రీడర్స్ ని ఆలోచింప చేస్తున్నాయి.

  7. అనూరాధ నాదెళ్ల says:

    గూడెం కథల్ని చదివి మీ మీ అభిప్రాయాల్ని ఫోన్ ద్వారా, మెయిల్ ద్వారా పంచుకుంటున్న మిత్రులందరికి ముందుగా కృతజ్ఞతలు.
    నిజమే, దేవుడి మాస్టారి మౌనం గురించి మరింత విపులంగా రాయలేదు.
    ఎందుకంటే నా గూడెం అనుభవాల్ని, అక్కడి జీవితాల్ని మీకు చూబించాలన్నదే నా ఆలోచన.
    అనునిత్యం క్రొత్త క్రొత్త సమస్యలతో కనిపిస్తూనే ఉన్నారు అక్కడి పిల్లలు. సహజంగానే పెద్దల అలవాట్లు, పనులు వాళ్లని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి.
    ఇక దేవుడు మాస్టారు ఆ గూడెం లోని వ్యక్తి. ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరైన వ్యక్తి. రోజూ గూడెంలో కనిపిస్తారు. మొదటిసారి విన్నప్పుడే ఆయన పేరు నాకు భలే నచ్చింది.అందరూ అలాగే పిలుస్తారు. కారణం నాకు తెలియదు.
    ఆ మీటింగు రోజు కూడా ఆయన అక్కడి పెద్దలందరికీ ఏవైనా మంచి మాటలు చెప్పాలనే వచ్చారు, కానీ అక్కడ జరిగిన సంఘటన ఆయన్ని మౌనిని చేసింది.

  8. nadella suryanarayana says:

    కథ బాగుంది కానీ, మరింత వివరణ ఇచ్చి ఉంటె బాగుండేది.

  9. lakshimi padmini nadella says:

    దేవుడు మాస్టారు అనే పేరు కథకి పెట్టడానికి కారణం అర్థం కాలేదు. గూడెం కథలు వలన పిల్లల భావాలు తెలుస్తున్నాయి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.