* * *
ఈ రోజు మనం శ్రీమతి గోవిందరాజు మాధురి గారి ‘పాణిగ్రహణం-పదిరోజుల్లో’ అనే కథల పుస్తకాన్ని గురించి మాట్లాడు కుంటున్నాం.
ఈ సంపుటిలో పది కథలున్నాయి. అన్నీ కూడా అత్తగారు, కోడలు కలిసిమెలిసి ఉన్న ఉమ్మడి కుటుంబపు కథలే. అత్తలేని కోడలు ఉత్తమురాలు అనికాని, కోడలులేని అత్త గుణవంతురాలు అనికాని అంటే ఈ కథల్లోని అత్తాకోడళ్ళు ఒప్పుకోరు. వారి మధ్య అందంగా అల్లుకున్న అనుబంధాల్ని చెప్పే ఆరోగ్యకరమైన కథలివి.జీవితాన్ని చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుపుకుంటున్న కొన్ని పాత్రల్ని ఈ కథల్లో చూస్తాము. నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల అనుభవాలు షడ్రుచులనూ అందిస్తూ మనకు చక్కని విందు భోజనం చేస్తున్న అనుభూతిని కలిగిస్తుంటాయి. ఈ విందుకి కమ్మని రుచిని అందించే అతిముఖ్యమైన దినుసు హాస్యం.
హాస్యం ఇక్కడా అక్కడా అనిలేదు ,ప్రపంచ వ్యవహారాలన్నిటిలోనూ అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. ఇలా జీవితాల్లో పెనవేసుకుని ఉన్న హాస్యాన్ని కుటుంబంలోని సభ్యుల మధ్య అందంగా పొదిగి, చూబించిన కథలు ఇవి. అలాగే కొన్ని గంభీరమైన కథలూ ఉన్నాయి. వాటిని కూడా హాస్యం సాయంతోనే నడిపించిన నేర్పు రచయిత్రిది. దైనందిన జీవితాల్లోంచి యాంత్రికతని తరిమి దానికొక ఆకర్షణని అద్దుతూ మన మనసులకు తెరిపిని , హాయిని ఇచ్చే ఒక ఔషధం లేదా ఒక వరం ఈ హాస్యం. హాస్యం అనేది వయసు, జాతి, మత, కుల వర్గాల కతీతంగా అందరం ఆస్వాదించే అద్భుతమైన రసం. దీనికి ఏ ఎల్లలూ లేవు. ఏ భాషా అవసరమూ లేదు. హాస్యం తనంత తానుగా ఒక ప్రపంచ భాష అని చెప్పచ్చు. సంభాషణలే లేని చార్లీ చాప్లిన్ సినిమాలు నిత్య నూతనంగా అన్ని వయసుల ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి.
ఒక సన్నని వాన జల్లు అదాటుగా మనలని పలకరించినట్టు, ఒక కమ్మని పూల పరిమళం మనలని అల్లుకున్నట్టు ‘హాస్యం’ ఉన్నపళంగా మన చుట్టూ సంతోషకరమైన వాతావరణాన్నిసృష్టిస్తుంది. మనలో హాస్య దృష్టి స్వతస్సిద్ధంగా ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకుని కొందరు తమకు ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని చిరునవ్వుతోనూ, ఒక సానుకూల దృక్పథంతోనూ చూస్తూ జీవితాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దుకుంటారు. వాళ్లు జీవించే కళ తెలిసిన వాళ్లు. హాస్యం తమదైన మతంగా చేసుకున్న వారు తమ జీవితాలతో పాటు చుట్టూ ఉన్న జీవితాలని వెలిగించే సమర్ధులు.
హాస్యానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఉంది, ఉంటుందని చెప్పచ్చు. దృశ్య,శ్రవణ మాధ్యమాల్లో హాస్యం ప్రధానంగా వచ్చే కార్యక్రమాలకున్న ఆదరణ మనలో ఉన్న హాస్య ప్రియత్వాన్ని స్పష్టంగా చెబుతుంది.నవ్వుల్ని పంచాలంటే హాస్యాన్ని సున్నితంగా,అర్థవంతంగా చెప్పి ఒప్పించాల్సి ఉంటుంది. పూర్తిగా ఈ జానర్ లో ఒక కథల సంపుటిని మనకు అందించిన మాధురిగారి ప్రతిభ చెప్పుకోతగ్గది. ఈ పుస్తకంలోని కొన్ని కథల్ని గురించి చెప్పుకుందాం. మొదటిది- ‘అచ్చెరువు చెందిన అత్తగారు’.
ఈ కథలో ఒక ఇల్లాలు తమ ఇంటికి క్రొత్తగా వచ్చిన కోడల్ని చూసి ఆశ్చర్య పోతూ ఉంటుంది. కోడలి తెలివితేటలు, ఇంటి పనివాళ్లతో పనులుచేయించుకునే చాకచక్యం , తనకు కావలసినట్టు అత్తవారింటివారినే కాక ఇంటికొచ్చిన బంధువులనీ ఒప్పించగల నేర్పూ చూసి, గతంలో తను కోడలుగా ఉన్నప్పటి అనుభవాలని తలుచుకుంటుంది.ఆనాడు తన అత్తగారు ఇంటిని ఎలా తన చెప్పుచేతుల్లో ఉంచుకుందో అని ఆలోచిస్తూ తనకు ‘అత్త అనే బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్’ కోడలు వచ్చాక కూడా దొరకటంలేదని అసహనానికి గురవుతుంది.కానీ కోడలి మంచి మనసు గ్రహించి హాయిగా నిట్టూరుస్తుంది.అటు అత్తింట్లో ఇమడలేక ఆరోపణలు చేస్తున్న కూతురికి తన కోడలిని చూసి నేర్చుకోమని చెబుతుంది కూడా.
ఈ కథలో క్రొత్త కోడలు ‘మైండ్ అడ్జస్ట్మెంట్ ఎట్ ఇన్లాస్ ప్లేస్’, ‘ కంపాటబిలిటీ నాట్ ఓన్లీ విత్ హజ్బెండ్ బట్ ఆల్సో విత్ అత్తగారు’, ‘మంచికైనా చెడుకైనా పుట్టింటివాళ్లు అత్తింటివాళ్లు కూడా తోడుండాలి’ అనే మూడు సూత్రాలను నమ్మి, ఆచరిస్తూ అత్తవారింట్లో జీవితాన్ని సుఖమయం చేసుకుంటుంది. ఈ సూత్రాలు ఏ కాలానికైనా, ఏ కోడలికైనా వర్తిస్తాయని రచయిత్రి సూచించిన చిట్కాలు.
రెండో కథ ‘బహుమతి.’- ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతివాళ్లని తన మాయలో పడేసుకుంటున్న స్మార్ట్ ఫోన్ గురించిన కథ. కోడలు తన స్నేహితులకి నేర్పేందుకు అత్తగారితో ప్రత్యేకమైన వంటలు చేయిస్తూ స్మార్ట్ ఫోన్ లో చకచకా ఫోటోలు అప్లోడ్ చెయ్యటం, వాటికి వచ్చిన లైక్ లు గురించి చెప్పటం, అత్తగారికి గాభరా పుట్టిస్తుంది. రకరకాల శబ్దాలతో ఫోన్ మోగి నప్పుడల్లా తన బి.పి. పెరుగుతున్నట్టుందని దిగులుపడుతుంది. అయినా, కోడలు పుణ్యమా అని స్మార్ట్ ఫోన్ ఉపయోగించటంలో మెలకువలు నేర్చుకుంటుంది. కోడలు బహూకరించిన స్మార్ట్ ఫోన్ తో పాటు ఇప్పటి తరం భాషని కూడా ఈ అత్తగారు తనదిగా చేసుకుంటుంది.’ఎలా ఉన్నారు’ అని అడిగితే ‘సూపర్గా ఉన్నాను’ అంటుంది. స్మార్ట్ ఫోన్ తో బిజీగా ఉండి పనులు వాయిదా వేస్తున్నట్టు గమనించి హెచ్చరించిన భర్తతో, అంతవరకూ ఏనాడూ ఎదురుచెప్పని ఆ ఇల్లాలు ‘ నా పెండింగ్ పని నేను చేసుకుంటాను, మీరు వర్రీ అవకండి’ అంటూ సమాధానం చెప్పేస్తుంది. ఆ తర్వాత నొచ్చుకుని, స్మార్ట్ ఫోన్ తన పనులకు అడ్డురాకుండా సమయాన్ని జాగ్రత్తగా మ్యానేజ్ చేసుకోవటం నేర్చుకుంటుంది.కథ పొడవునా సున్నితమైన హాస్యం చదువరులను హాయిగా నవ్విస్తుంది.
మూడవ కథ – ‘పాణిగ్రహణం పదిరోజుల్లో’.ఈ కథలో ఇప్పటి పెళ్లిళ్లలో మ్యారేజి బ్యూరోలపాత్ర, విదేశాల్లో ఉన్న పిల్లలు పదిరోజుల్లో వచ్చి పెళ్లిళ్లు చేసుకు వెళ్లటం గురించి చెబుతారు రచయిత్రి. కథంతా సరదాగా సాగుతుంది.పదిరోజుల్లో జరపవలసిన కొడుకు పెళ్లికి రాత్రీ పగలూ తేడా లేకుండా పెళ్ళిపనులకీ, పిలుపులకీ పరుగెత్తటం ఒక వైపు, కొడుకుపెళ్ళిలో అబ్బాయి తండ్రిగా తనకు మర్యాదలు జరగలేదని అలిగే ఇంటిపెద్ద ఒక వైపు కనిపిస్తారు.ఈ కథలోని ఇల్లాలు తనకు ఇంత వయసు వచ్చినా ఒక్క నిర్ణయం స్వయంగా తీసుకోవటం రాదని అత్తగారు విమర్శించినప్పుడు దానికి అత్తగారే కారణమని నిట్టూరుస్తుంది. అయితే అత్తగారు నేర్చుకోమన్న లోకజ్ఞానంతో అన్ని నిర్ణయాలు ఆవిడకే వదిలేసే గడుసుదనాన్నిమాత్రం అలవరచుకుంటుంది .
నాల్గవ కథ- ‘ఇల్లాలు ఇన్ సైలెంట్ మోడ్’. ఈ కథలో సుఖ సంతోషాలు, ప్రేమానురాగాలతో ఉన్న ఒక కుటుంబంలో కూతురుకి, కొడుక్కి పెళ్లిళ్లు అవుతాయి. పెళ్ళి అయిన తర్వాత కొడుకు, కూతురు కూడా సంపాదనకు, ఉద్యోగాల్లో మెట్లు ఎక్కటానికి చూబించే శ్రధ్ధ కుటుంబం పట్ల, కుటుంబసభ్యుల పట్ల చూబించరు. కుటుంబంలో ఏర్పడుతున్న స్తబ్దతని, వెలితిని ఆ పిల్లల తల్లి గమనిస్తుంది. అది మనసుకు కష్టమనిపించి నిరశనగా మౌనం పాటిస్తుంది. ఆమె ధోరణి అర్థం కాక పిల్లలు , భర్త కారణం అడిగినప్పుడు, ‘పిల్లలు పెద్ద చదువులు చదివి కష్టపడి చకచకా పై మెట్లు ఎక్కినట్టే, ఇంట్లో పెద్దలతో కలిసిమెలిసి ఉంటే కుటుంబంలో ఆనందపు మెట్లు చకచకా ఎక్కేయచ్చు’ అని చెబుతుంది. ఎదిగిన పిల్లలకు కుటుంబం పట్ల ఉండవలసిన ప్రేమ, బాధ్యతలను ఈ కథలో సున్నితమైన హాస్యంతోనే చెప్పటం చెప్పుకోతగ్గది.
తర్వాతి కథ- ‘టూల్ బార్ కోడలు,టూరిస్టు అత్తగారు’. ఇప్పటి కోడళ్లు చాలా వరకు సాంకేతిక విద్యలో ఆరితేరిన వాళ్లే. అలాగే రిటైరైన అత్తమామలు టూర్ ప్రోగ్రాములతో బిజీ బిజీగా గడపడమూ వాస్తవం. ఈ కథలో అత్తగారి కోరిక మేరకు కొత్తకోడలు ఆన్లైన్ లో తీర్థ యాత్రలకి కావలసిన ఏర్పాట్లు చేస్తూ చేస్తూ క్రమంగా ఆ పని బరువుకి ఆఫీసులో కొలీగ్స్ దగ్గర వాపోతుంది. అక్కడ అందరి పరిస్థితి అలాగే ఉందని అర్థం చేసుకుని ఆఫీసులో వాళ్లంతా కలిసి అత్తగార్ల కోసం వాళ్లంతట వాళ్లే తమ తీర్థ యాత్రలకు ఆన్లైన్ లో ఏర్పాటు చేసుకునేలా ఒక యాప్ ని విజయవంతంగా తయారు చెయ్యటం ఈ కథ.
ముందుమాటలో శ్రీ కవనశర్మగారు చెప్పినట్లు ఈ కథలన్నీ తియ్యని మిఠాయిలతో పోల్చదగ్గవే. ఈ పుస్తకాన్ని కొని చదివితే పుణ్యం, జ్ఞానం వస్తాయని, వారు కొనకుండా చదవటం వలన జ్ఞానం మాత్రమే వచ్చిందని చెప్పారు శ్రీ శర్మగారు. మీరందరూ మాత్రం పుస్తకాన్నికొని , సమయాభావంతో నేను క్లుప్తంగా పరిచయం చేసిన కథల్ని పూర్తిగా చదివి, ఆస్వాదించి పుణ్యాన్ని, జ్ఞానాన్ని కూడా పొందాలని కోరుకుంటున్నాను. పుస్తకం కవరు పేజీ శ్రీ బాలి బొమ్మతో ఆకర్షణీయంగా ఉంది. పుస్తకం లో ప్రతి కథకీ బాలి బొమ్మలు అదనపు ఆకర్షణ. అచ్చుతప్పులు చదువుకుందుకు అడ్డురావు కానీ అవి మరింత తక్కువగా ఉంటే బావుంటుంది. కొంత ఎడిటింగ్ కూడా అవసరమే అనిపించింది పునరుక్తుల్ని గమనించినప్పుడు.
ప్రతి కథ మన వర్తమాన జీవితాల్లోంచి పుట్టినదే. అందువల్ల ఈ కథల్లో పాత్రలు మనమే. ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ మనింట్లో మనమధ్య జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా చూస్తున్నట్లే ఉంటుంది. అంత సహజంగా ఉన్నాయి కథలన్నీ.చదివినంత సేపూ మన ముఖంలో చిరునవ్వు మాత్రం వెలుగుతూనే ఉంటుంది.
కృతజ్ఞతలు.