* * *
ఈ రాజభవంతులు, కోటలు చూస్తున్నంతసేపూ మనవికాని జీవితాలని ,ఎప్పుడో ఈ భూమిమీద జరిగిన కథలని చూస్తూ మరొక లోకంలోకి వెళ్లిపోతాం. చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పాఠాలు, మనం విన్న రాచరికపు కథలు అప్రయత్నంగానే కళ్లముందుకొస్తాయి. అక్కడ తిరుగుతున్న సమయంలో తెలుగు సినిమా దివంగత నటుడు రాజబాబు తీసిన ‘ ఎవరికి వారే యమునాతీరే’ సినిమాలో పాడిన పాట, ఆ పంక్తులు జ్ఞాపకంవచ్చాయి…… “రాజ్యాలను ఏలినారు వేలవేల రాజులు, చివరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు? కట్టుకున్న కోటలన్ని మిగిలిపోయెను, కట్టించిన మహరాజులు తరలిపోయెను”. అమర్ కోట నుండి ‘కనక వ్రిందావనం’ అని రాధాకృష్ణుల మందిరం చూసేం. అది బిర్లా వారి కట్టడం. ఆ టూరులో ఆఖరుగా బిర్లా ప్లానిటోరియమ్ చూబించవలసి ఉంది. కాని అప్పటికే సాయంకాలం 6.30 కావొస్తోంది. అందువలన అక్కడికి వెళ్లటం కుదర లేదు. సర్వ సాధారణంగా ప్లానిటోరియమ్ ను చూబించటం జరగనే జరగదని చెప్పేరు. రాజస్థాన్ లో మరెన్నో చూడదగిన ప్రదేశాలున్నాయి. ఉదాహరణకి ఉదయపూర్, జోధ్పూర్, జైసల్మీర్,రనథంబోర్, బికనీర్ వంటివి. వాటిని చూసేందుకు మరింత ప్లానింగ్, సమయం అవసరం.జైపూర్ లో మరొక రోజు మేము ఒక క్రొత్త అనుభవాన్ని చూడాలనుకున్నాం. అది ఒక రాజస్థానీ గ్రామీణజీవితాన్ని, సంస్కృతినీ ప్రతిబింబించే ఒక యాత్రా స్థలం. అది జైపూర్ స్టేషన్ నుండి 20 కిలోమీటార్ల దూరంలో ఉంది. జైపూర్ లో రాజస్థాని గ్రామీణ జీవితాన్ని ఒక విశాలమైన ప్రాంగణంలో కృత్రిమంగా ఏర్పాటుచేసింది ఒక ప్రైవేటు సంస్థ .అది చోఖిధానీ. సాయంత్రాలు సందర్శకులకి ఒక దర్శనీయ స్థలంగా తీర్చి దిద్దింది. ఇది నగరానికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉండటం తో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి. అనుమతి రుసుము 600 రూపాయలు. రాత్రి భోజనాన్ని కూడా ఇస్తారు ఆ అనుమతి రుసుముతోనే. రాజస్థానీ సంప్రదాయ భోజనం వడ్డిస్తారు. సాయంత్రం 6 నుండి 11 వరకూ ఇది తెరిచి ఉంటుంది. గేటు లోపలికి వెళుతూంటే ‘ టిప్స్ ప్రోత్సహించవద్దు’ అన్న బోర్డులు దారి పొడవునా కనబడతాయి కాని, అది ఆచరణలో ఉన్నట్లు కనపడలేదు. బయస్కోప్, పాములు ఆడించే వాళ్లు, చిలక జోస్యం చెప్పేవాళ్ళు, తోలుబొమ్మలు ఆడీంచే వాళ్లు, స్థానిక సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని చేసేవాళ్లు, ఐస్ క్రీములు, వేడి శనగలు వగైరా అమ్మేవాళ్లు, మరొక ప్రక్క మత్తుపానీయాలు అమ్మే చోటు, పరిచిన నులక మంచాలు, చిన్న దేవాలయాలు, తులసి కోటలు, వెనుకగా పశువుల శాలలు , గారడీ చేసేవాళ్ళు, కర్రల మధ్య తాడుమీద నడిచే వాళ్లు………………..ఇలా ఈ తరానికి పరిచయంలేని ఒక క్రొత్త పపంచంలోకి తీసుకెళ్తుంది ఆ ప్రదేశం. ఇక్కడ వస్త్రాలు, రకరకాల చేతి వస్తువులు, బొమ్మలు, గాజు సామాను,ఇలా చాలా చిన్నచిన్న దుకాణాలు అమ్మకాలు జరుపుతున్నాయి……….వాస్తవంగా ఒక చిన్న గ్రామంలో తిరుగుతున్నట్లే ఉంటుంది.
ఇక్కడ చూసిన ఒకటి రెండు సాంప్రదాయ కళల గురించి కొంచెం చెబుతాను.రాజస్థాన్ లో తోలుబొమ్మలాటకు ఉపయోగించే పప్పెట్లను కట్ పుత్లీ అంటారు. కట్ అంటే చెక్క, పుత్లీ అంటే బొమ్మ, ప్రాణం లేనిదని అర్థం. చెక్క, రంగుల బట్ట, కొంత వైర్ ఉపయోగించి చేసేవే ఈ బొమ్మలు.వీటికి కట్టిన వైర్ల ద్వారా ఆడించే ఈ జానపద కళారూపమైన కట్ పుత్లీ రాజస్థాన్ కు చెందిన అతి ప్రాచీన , సాంప్రదాయ మైన కళ.రాజస్థాన్లో జరిగే ఏ పండుగా, ఏ ఉత్సవం తోలుబొమ్మలాట లేకుండా జరుగదు. ఈ కళ రాజస్థాన్ లోని ‘నాగౌర్’ ప్రాంతనుండి మొదలైందని నమ్మకం. ఈ కళను ఇక్కడి రాజులు బాగా ప్రోత్స హించేవారు. ఈ కళలో జానపద గాథలు, వీరగాథలు, జానపద పాటలు ప్రదర్శిస్తారు. ఈ పాటలు, జానపద కథలు ఆ నాటి ప్రజల జీవితాన్ని ప్రతిబిం బిస్తూ ఉంటాయి. దిల్లీలో ఒక ప్రాంతానికి ‘కట్ పుత్లీ కాలనీ’ అనే పేరుంది. ఇక్కడ ఈ కళమీద ఆధారపడిన అనేక కుటుంబాలు స్థిరపడ్డాయి.ఈ కళ కేవలం వినోదంకోసమే కాకుండా సామాజిక సమస్యలైన నిరక్షరాస్యత, వరకట్నం, నిరుద్యోగిత, శుభ్రత మొదలైన వాటి గురించి,వాటికి అవసరమైన పరిష్కారాల గురించి ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తోంది.
‘భావై’ అనే సాంప్రదాయ నృత్యంలో స్త్రీ కళాకారిణి కానీ పురుష కళాకారుడు కానీ తలపైన 7 నుంచి 9 మట్టి లేదా ఇత్తడి తో చేసిన కడవలను పెట్టుకుని, ఒక మేలి ముసుగు ధరించి ఒక పళ్లెం అంచున కానీ ఒక కత్తి మొన పైన కాని ఒక గ్లాసు పైన కాని నిలబడి అతి సునాయాసంగా, నాజూగ్గా కదులుతూ నృత్యం చేస్తారు. ఈ నృత్యం అక్కడ పురుషులు వాయిస్తున్న హార్మొణీ, సారంగి, ధోలక్ మొదలైన వాయిద్యాలకు అనుగుణంగా సాగుతుంది. ఇంకా ఘూమర్ అనే సాంప్రదాయ నృత్యం కూడా ఇక్కడ చాలా ప్రసిధ్ధమైనది. రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో నీటి సమస్య చాలా ఎక్కువ. నిత్యం అక్కడి స్త్రీలు సుదూర ప్రాంతాలనుండి నీటిని అపురూపంగా తెచ్చుకునే అవసరం ఉంది. నీటి కడవలతో ఒక చోటు నుండి ఒక చోటుకు నిత్యం సుదీర్ఘమైన నడక సాగించే జాట్, భిల్, మీనా వంటి తెగల స్త్రీలు కడవలను సునాయాసంగా తలపైన బ్యాలన్స్ చెయ్యగలరు. ఈ అవసరం, అలవాటు వల్లనే వారికి ఇలాటి ఒక నైపుణ్యం ఏర్పడిందట. అదే ఈ నృత్య రీతుల్లొ వాళ్లకు ఉపకరిస్తోందని, వారే ఎక్కువగా ఈ నృత్యం ప్రదర్శీంచే వారిలో ఉంటారని చెబుతారు.
కళలో నైపుణ్యాలు వారు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలనుండి, బ్రతుకు పోరాటాలనుండి అలవడిందన్ననిజం మనసును గాయపరచే అంశం. ఈ ప్రాంతాల్లోనూ , దేశంలోని ఇలాటి మరెన్నో ప్రాంతాల్లో ఉన్న నీటి సమస్యను ,వారి దైనిందిన జీవితాల్లో ఎదుర్కొంటున్నఇబ్బందులను తీర్చే పని ప్రభుత్వాలు ఎప్పుడు చేపడతాయో కదా! న్యూయార్క్ లోని ‘రాజస్థాన్ జానపద కళల ప్రోత్సాహక సంస్థ’ మరియు రాజస్థాన్ లోని (కళా సాగర్ సంస్థాన్ ద్వారా నడుపబడే) ‘జానపద కళల సొసైటీ’ సంయుక్తంగా రాజస్థాన్లోని జానపదులకు వారి కళలను కాపాడుకుంటూనే చదువుకునే వెసులుబాటు కలిగిస్తున్నాయి. ‘ ఒక చేత్తో పెన్ను, మరొక చేత్తో ఢోలక్ ‘ అన్న నినాదంతో వారు జానపద కళలకు చేయూతనిస్తున్నారు.
ఛోకి ధానీ లో సందర్శకులు ఎక్కువగా ఉండటంతో భోజనాల దగ్గర చాలా వెయిట్ చెయ్యవలసి వచ్చింది. టోకెన్ నంబర్ల ప్రకారం పిలిచారు. క్రింద చాపలు పరిచి కూర్చోబెట్టి, ఎదురుగా ఎత్తైన పీటలమీద విస్తళ్లలో రకరకాల భోజన పదార్ధాలు వడ్డించారు. భోజనం చాలా ఏవరేజ్ గా ఉంది. ఇదివరలో ఇక్కడ మంచి భోజనం దొరికేదని ఇప్పుడిప్పుడు ప్రమణాలు తగ్గేయని చెప్పేరు అక్కడి వారు. నిత్యం ఇంత మంది సందర్శకులను ఆకర్షించే ఈ గ్రామం లో టాయిలెట్లు కనీస ప్రమాణాల్లో కూడా మెయిన్టెయిన్ చెయ్యకపోవటం విచారకరం. కాని సంవత్సరం పొడవునా ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుందిట. ఎన్నాళ్లుగానో, ఎంతో విని వెళ్లి చూసి వచ్చిన తరువాత మాత్రం నిరాశ అనిపించింది. దీనికి పోటీగా మరొక ప్రైవేటు సంస్థ కూడా ఇటువంటి మరొక గ్రామాన్ని ఏర్పాటుచేసిందా సమీపంలోనే. నాణ్యతా ప్రమాణాల్ని పాటించటం మాత్రం చాలా అవసరం. నానాటికీ ప్రమాణాలు తీసికట్టుగా తయారైతే సందర్శకులను ఆకర్షించటంలో విఫలమయే అవకాశం ఉంది. దేశీయులే కాక విదేశీ యాత్రికులు అధికంగా ఉండే ఈ ప్రాంతం పట్ల అవసరమైన శ్రధ్ధ చూబించకపోతే వారిముందు మనదేశ ప్రతిష్ట దిగజారిపోతుంది. ఇలాటి గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే కృత్రిమమైన గ్రామాలను మన రాష్ట్రంలో కూడా ఏర్పాటుచేసి పర్యాటకాన్ని పెంచుకుంటే బావుంటుందనిపించింది. ప్రభుత్వమే పూనుకుని పర్యాటకాన్ని ప్రోత్సహించగలిగితే రాష్ట్రానికి అదొక ఆదాయ వనరుగానూ, కొందరికి జీవనోపాధిగానూ కూడా ఉంటుంది.
గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో యాత్ర చెయ్యదలచిన వాళ్లు నవంబరు- ఫిబ్రవరి నెలల మధ్య ఏర్పాటు చేసుకుంటే వాతావరణం చాలా అనువుగా ఉంటుంది. మేము సీజన్ కాని సమయంలో వెళ్లటం వలన కాబోలు సందర్శకుల సంఖ్య కూడా చెప్పుకోదగ్గదిగా లేదు. ఈ ప్రాంతాలన్నింటిలోనూ యాత్రీకుల కవసరమైన చిన్న చిన్న ఫలహారశాలలు, చేతి వృత్తులవారి ద్వారా తయారైన వస్తువులు అమ్మే చిన్న దుకాణాలు, క్యాబ్ లు, ఆటోలు నడుపుకోవటం మాత్రమే సామాన్యుడికి జీవికని ఇచ్చే సాధనాలని అర్థమవుతుంది. అనేక హోటళ్లు ఉండటం వలన కాబోలు పోటీపడి మంచి ధరకి చక్కని వసతిని అందించే హోటళ్లని మేము ఈ ప్రాంతాల్లో గమనించాము. ఇటువంటి సౌకర్యాలతో హోటలు గదులు కావాలంటే గోవా, కేరళ లాటి ప్రదేశాల్లో ఇక్కడి కంటే రెట్టింపు ధరలను వెచ్చించాల్సిందే. అయితే మేము వెళ్లిన జూలై నెల ఆ ప్రాంతాలలో సందర్శకులకి అనువైన సమయం కాకపోవటం కూడా హోటళ్లు అధిక డిస్కౌంట్లను ఇవ్వటానికి కారణం కావచ్చు. అయినా కేరళ, గోవా లాటి యాత్రాస్థలాల లాగా ఈ ప్రాంతాలు పూర్తిగా కమ్మర్షియలైజ్ కాలేదన్నది కూడా కొంత నిజం. మా జైపూర్ యాత్రలో నన్ను అమితంగా ఆకర్షించిన విషయం ఒకటి ఉంది.
జైపూర్ లో ఒక అద్భుతమైన వ్యక్తి ని కలిసేను. అయితే ఆమె వచ్చిన పని వేరు. మాతో పాటే విల్లాలో బస చేసిన ఆమెతో పాటు ఒక పది,పదకొండేళ్ల అమ్మాయి కూడా ఉంది. ఆమె పరిచయం అయిన తర్వాత చెప్పిన విషయాలు ఏంటంటే తను విదేశీయుడైన భర్త, ఇద్దరుపిల్లలతో అమెరికా లో ఉంటున్నానని, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానని చెప్పింది. భారత దేశపు ఆడపిల్లను ఒకరిని దత్తత తీసుకోవాలన్న ఆశతో ఒక మూడు సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వానికి విన్నపం చేసుకున్నానని చెప్పింది. భర్త సంపూర్ణ సహకారంతో ఈ ప్రయత్నంలో ఉన్నానని చెప్పింది. దత్తత తీసుకున్న అమ్మాయిని బాగా చదివించి ప్రయోజకురాల్ని చెయ్యాలను కుంటున్నానని, ఇంత పెద్ద భారత దేశంలో ఇలాటి అవసరం ఎంతైనా ఉందని చెప్పింది. తన సోదరి, సోదరులు కూడా ఇలా దత్తత తీసుకుని తనకు స్ఫూర్తిని ఇచ్చేరని చెప్పింది. భారత ప్రభుత్వం సూచించిన అమ్మాయిని , వారు చెప్పిన ప్రాంతంనుండి దత్తత తీసుకోవలసి ఉంటుందిట. అందుకోసం ప్రభుత్వంవారు సూచించినట్టుగా జైపూర్ లోని ఒక అనాథ ఆశ్రమం నుండి పదకొండేళ్ల అమ్మాయిని దత్తత తీసుకోబోతోంది. ఇలాటి దత్తత వ్యవహారంలో అనేక చిక్కులున్నాయి. లీగల్ గా గత మూడు సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తోందని, ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళేందుకు వచ్చానని చెప్పింది. ఆఖరు దశలో ఉన్న ఈ కేసు జడ్జిగారు ఇచ్చే తీర్పు ను అనుసరించి ముగుస్తుంది. అమెరికా నుండి వస్తూనే తన పిల్లల్ని మద్రాసులో తల్లి దగ్గర పెట్టి వచ్చానని చెబుతూ ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకుంది. కారణం అడిగితే పిల్లల్ని ఇన్నాళ్లు విడిచి ఎప్పుడూ ఉండలేదని చెప్పింది. వింటున్న నా మనసు ఆర్ధ్రమైంది. ఆమె నిస్వార్థంగా చేస్తున్న ఒక మంచి పని ఆడ్డంకుల్ని అధిగమించి త్వరగా పూర్తి కావాలని మనసారా కోరుకుని ఆమె నుండి సెలవు తీసుకున్నాను.
రంగురంగుల ప్రాంతాల్ని చుట్టి వస్తూ జీవితంలో ఇలాటి ఉన్నత మైన ఆదర్శాలతో జీవితాన్ని రంగులమయం చేసుకుంటున్న ఈ యువతిని కలవటం చాలా బాగా అనిపించింది.ఆ మానవత్వపు పరిమళాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
జైపూర్ లో2006 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జరుపుతున్న ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ ఆసియాలోనే పెద్ద లిటరరీ ఫెస్టివల్ గా చెబుతారు. ఇది ఈ నగరానికి దక్కిన అరుదైన అవకాశం అని చెప్పవచ్చు. ఈ ఫెస్టివల్ జైపూర్ లోని డిగ్గీ ప్యాలస్ హోటల్ లో ఐదు రొజులపాటు జరుగుతుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నోబెల్ బహుమతి గ్రహీతలు, బుకర్ బహుమతి గ్రహీతలు సహా అనేక ప్రముఖ రచయితలు, రచయిత్రులు వస్తారు. ప్రతి జనవరి నెలలో ఇది జరుగుతుంది. కానీ ఈ సాహిత్య పండుగ ను సెలబ్రెటీలతోనూ, వ్యాపార ధోరణిలోనూ నిర్వహిస్తున్న కారణంగా 2012 సంవత్సరం నుండి కొంత విమర్శ కూడా లేకపోలేదు. ఈ విమర్శను ఎదుర్కోవాలంటే ఇలాటి ఒక ఉత్తమమైన అవకాశాన్ని కేవలం సాహిత్యంకోసం నిజాయితీగా నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. జైపూర్ ఎయిర్ పోర్ట్ మన దేశంలోని ఇతర నగరాల ఎయిర్ పోర్ట్ లతో పోల్చి చూస్తే బయటనుండి ఎలాటి హడావుడి లేకుండా చిన్నగా ,నిశ్శబ్దంగా కనిపించింది. కానీ ఇక్కడ నుండి దేశ, విదేశ పర్యాటకులకోసం అనేక విమానాలు బయలుదేరుతాయి.ఈ యాత్ర జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఒక చిన్న కవిత రాసుకున్నాను.
ద్వైతాద్వైతం
అలుపెరుగని దూరాలకు పరుచుకున్న
ఆరావళీ వరుసలు
ఎప్పటెప్పటి నిశ్శబ్దాన్నీ చుట్టుకున్నట్లున్నాయి.
ముద్ర వెయ్యకుండానే మాయమయే
మబ్బుదొంతరలు
సముద్రాన్ని ఆవాహన చేసుకుంటూ ఆవులిస్తూ సాగిపోతున్నాయి.
పశ్చిమంగా హద్దుగీస్తున్న
అరేబియా సముద్రం
పరుగెత్తే కాలానికి రేయింబవళ్లు పహరా కాస్తున్నట్లుంది.
తీరాన్ని వదిలి అద్దరికీ ఇద్దరికీ మధ్య
పరుగెత్తే మోటారు లాంచీలు
పరవశంతో ప్రవహించే కూనిరాగాల్ని
కడలి ఒడిలో ఒడుపుగా లాక్కెళుతున్నాయి.
ఆటవిడుపుగా జాతరకి బయలు దేరిన
పల్లెవాసుల పకపకల మాటున
పరిమళించే ముచ్చట్ల సవ్వడులు
అలలై కదులుతున్నాయి.
ఆ వార- బీడుభూములు, ఉప్పు కయ్యల సాక్షిగా
దేవాలయపు గంటల మోతలు నేపథ్య సంగీతమైతే,
ఈ వార- గిరగిర తిరిగే గాలిమరలు తోడురాగా
మట్టిపొత్తిళ్ల నిండా పచ్చదనాలు చిగుళ్లెత్తుతున్నాయి.
గమ్యంవైపు ఆగిసాగే నిస్సహాయపు బరువులతో
ఇసుక సెగల్ని మరింత ఎగదోసే ఎడారి ఓడలు
ఓయాసిస్సుల వెంట గంభీర మౌనముద్రల్ని వదులుతూ
ప్రకృతిలో ద్వైతాద్వైతాల వేదాంతాన్నినిట్టూర్పుల మధ్య నెమరేస్తున్నాయి.
నిమిత్త మాత్రంగా నిటారుగా నిలబడిన ఆకాశం
అంతలోనే ఆ క్షితజరేఖ వైపుగా ఒంగిందెందుకని?!మీలో ఎవరైనా వాయవ్య భారతాన్నిచూసిరావాలంటే నేను చెప్పిన ఈ వివరాలు కొంతైనా ఉపయోగపడగలవని అనుకుంటున్నాను. ముఖ్యంగా చరిత్రని ప్రేమించేవారికి ఇలాటి యాత్రలు నచ్చుతాయి. విశాలమైన మన భారత దేశంలో మనకు తెలియని,పరిచయంలేని ప్రాంతాలు, జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూసివచ్చేందుకు ఒక జీవిత కాలం సరిపోదేమో. వాయవ్య ప్రాంతాల జీవన సరళిని చూసి వస్తే ప్రపంచఖ్యాతిని పొందిన ఆ పురాతన దేవాలయాలు, కట్టడాలు, రాజప్రాసాదాలు, ఆ సముద్ర తీరాలు, ఎడారులు వాటి నేపథ్యంలో నడుస్తున్నవర్తమాన జీవితాలు అన్నీ దగ్గరగా చూడవచ్చు. మనలో మనకున్న సారూప్యాలని, వైరుధ్యాలని ప్రత్యక్షంగా చూడవచ్చు. వాటన్నింటి మధ్యా జీవిస్తూ కూడా మనలను కట్టిపడేసే ఏకత్వ సూత్ర్రాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు.
The End
* * *
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part V – ద్వైతాద్వైతం
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike