* * *
Continued from Part IV
నగరమంతా రాజ భవనాలు, కోటలతో ఒక చారిత్రక దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ కనిపించింది. వాస్తవంగానే రాజుల కాలంలో ఉన్నామని, ఒక కోటలో తిరుగుతున్నామని భ్రమ కలుగుతుంది. విశాలమైన, అధునాతన మైన , ఇంకా సంపన్నమైన నగరం ఇది. కానీ పేదరికం కూడా ప్రక్క ప్రక్కనే కనపడుతూనే ఉంది. నగరంలోని ప్రధానమైన రోడ్లలో కూడా ఫుట్పాత్ లపైన నివసిస్తున్న జనం కనిపించారు. అందమైన ఈ నగరంలోనూ శుభ్రత పట్ల ప్రజల్లో ఉన్న ఉదాశీనత చూస్తే కాస్త బాధ కలగక మానదు. శుభ్రత విషయంలో భారతీయుల ఐక్యత కాదనలేనిది. మనలని కలిపి ఉంచుతున్న అంశాల్లో ఇది ప్రధానమైనదేమో అని తలుచుకుంటే కష్టంగా ఉంది. నగరంలో మంచి మంచి రెస్టొరెంట్లు ఉన్నాయి. తమిళనాడూ వారి దాస్ ప్రకాశ్ లాటి చెయిన్ లూ ఉన్నాయి. భోజనం ఖరీదుగానే ఉంది నగర దర్పానికి తగ్గట్టుగా. జైపూర్ కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగనీర్ గ్రామంలో వస్త్రాలమీద ప్రింటింగ్, చేతితో తయారయ్యే కాగితం తయారు చేస్తారు. ఇక్కడి తెలుపు మీద వేసే గాఢమైన రంగుల డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును, ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చింది. జైపూర్ ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ ఎర్రని రాయితో నిర్మించిన అతి ప్రాచీన జైన దేవాలయం ఉంది.
రెండవరోజు రవ్వ ఇడ్లీలు, సాంబారు బ్రేక్ ఫాస్ట్ మాకు. ఇక్కడి సాంబారు అచ్చమైన మన సాంబారులా ఉంది. కాని వండిన అతను మాత్రం రాజస్థాన్ వాడే. రాజస్థాన్ టూరిజం వారి సిటీ టూర్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ నవంబరు నుండి ఫిబ్రవరి వరకు టూరిష్టులకి అనువైన సమయం. ఆ సమయంలో మాత్రమే అర్థ రోజు టూర్, పూర్తి రోజు టూరు, రాత్రి టూరు అని వివిధ రకాల టూర్లు నడుపుతారు. జూలై నెలలో పూర్తి రోజు టూరు మాత్రమే నడుపుతారని చెప్పారు. 8మంది కంటే ఎక్కువ మంది సందర్శకులుంటేనే ఒక బస్సు, ఒక గైడ్ తో సహా టూర్ ఏర్పాటు చేస్తారు. అంతకంటే తక్కువ ఉంటే గైడ్ సౌకర్యం లేని ఒక వ్యాన్ ఏర్పాటు చేస్తారు. జూలై నెల అక్కడ చాలా వేడిగా, ఉక్కపోతగా ఉంది. ప్రొద్దున్న 9 గంటలకి టూర్ మొదలైంది. మిగిలిన సిటీల్లో లా కాకుండా కాస్త ఆలస్యం గానే ఆరంభమైంది. సమయ పాలన అంతగా కనిపించలేదు. ముందుగా లక్ష్మీ నారాయణ దేవాలయం చూబించారు. ఇది పాలరాతి కట్టడం. అక్కడి నుండి హవామహల్. ఇది రిపెయిర్ పనుల్లో ఉండటంతో బయట నుండి మత్రమే చూసేం. 5సంవత్సరాల క్రితం జైపూర్ దర్శించినప్పుడు కూడా ఇదే కారణంతో బయటనుండి మాత్రమే చూబించారు.
ఇక్కడినుండి సిటీ ప్యాలస్ కు వెళ్ళేం. ఇది 1729 -1732 మధ్య కట్టబడింది. అనేక రాజమందిరాలున్న ఒక పెద్ద రాజ ప్రాసాదం ఈ సిటీ ప్యాలస్. ఇది జైపూర్ మహారాజు కొరకు నిర్మించబడింది. ప్యాలస్ లోకి వెళ్లేందుకు కొంత రుసుము చెల్లించాలి. అది రాజ వంశీయుల కి చేరుతుందని గైడ్ చెప్పేరు. ప్రవేశ ద్వారం దాటుతూనే రాజభవనపు నమూనా ఒక పెద్ద ఫ్రేమ్ లో కనిపించింది. అక్కడ ఫోటో తీసుకొమ్మని ప్రోత్సహిస్తూ ఫోటోగ్రాఫర్ సందర్శకులకు చక్కని రంగురంగుల తలపాగాలను పెట్టి అందమైన ఫోటోలను క్షణాల్లో తీసి ఇచ్చాడు. సందర్శకులు మాత్రం ఆ రాజభవనపు నమూనా ను ఫోటో తీసుకోరాదని నియమం పెట్టారు. జైపూర్ నగర ప్లాన్, నగరంలోని అనేక ప్రముఖ కట్టడాలకు ‘విద్యాధర భట్టాచార్య’ ,’సర్ శామ్యూల్ స్విన్టన్ జాకబ్’ వంటి ప్రముఖ ఆర్కిటెక్టులు పేర్లు చెప్పుకోవాలి.ఇక్కడి నిర్మాణాలన్నీ భారత ఆర్కిటెక్చర్ లోని శిల్ప శాస్త్రాన్ని, యూరోపియన్ల ఆర్కిటెక్చర్ లోని శైలిని జోడించి కట్టబడినవి.ఈ నిర్మాణమంతా ఎరుపు మరియు గులాబి రంగు శాండ్ స్టొన్ ఉపయోగించి కట్టబడింది.
1857 సిపాయి తిరరుగుబాటు సమయంలో రాజపుత్ర రాజైన మహరాజ రామ్ సింగ్ బ్రిటీషువారి పక్షం వహించాడు. ఆ సమయంలో భారత దేశాన్ని సందర్శంచిన వేల్స్ రాకుమారుడి పట్ల గౌరవసూచకంగా నగరంలోని కట్టడాలన్నింటికీ గులాబి రంగును వెయ్యటం జరిగింది. ఆ రంగు క్రమేపీ జైపూర్ నగరానికి ట్రేడ్ మార్క్ గా తయారైంది.
జైపూర్ రాజ్యం భారత దేశంలో ఒక రాష్ట్రంగా 1949 లో కలిసిపోయినప్పటికీ ఈ ప్యాలస్ రాజ వంశీయుల నివాసంగా ఉంటూ వస్తోంది. ఈ ప్యాలస్ కు ఉన్న మూడు గేట్లలో ట్రిపోలియా గేటు రాజవంశీయులు మాత్రమే ప్యాలస్ లోకి ప్రవేశించేందుకు ఉపయోగిస్తారు. మూడు గేట్లు అత్యంత సుందరమైన పనితనంతో ఉన్నాయి. ఇక్కడ చంద్ర మహల్, ముబారక్ మహల్ ఉన్నాయి. చంద్ర మహల్ లో అధిక భాగం ఇప్పటికీ రాచ వంశస్థుల నివాసంగా ఉంది. చంద్ర మహల్ ఏడు అంతస్థుల కట్టడం. ముఖద్వారంలో ఉన్న నెమలి గేటు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక్కో అంతస్థుకి ఒక్కో పేరు. అద్భుతమైన పెయింటింగ్స్ తోనూ, రంగురంగుల పూలు లతలు, అద్దం పనితనంతో నిండిన సీలింగ్, గోడలు చూపు తిప్పుకోనివ్వవు. ఈ పెయింటింగులన్నీ ఇన్ని సంవత్సరాలకాలంలో ఏమాత్రం రంగును కోల్పోలేదు. చంద్రమహల్ క్రింది అంతస్థు మ్యూజియమ్ గా మార్చినందువలన సందర్శనకు అనుమతిస్తారు. రాజ వంశీయులు ఉపయోగించిన వివిధ వస్తువులు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. చంద్ర మహల్ పైన రాజ వంశానికి చెందిన జెండా ఇప్పటికీ ఉంది. రాజు బయటకు వెళ్లిన సమయంలో రాణి జెండా మహల్ పైన పెట్టబడుతుంది.ప్రత్యేక వ్యక్తుల కోసం దివాన్ ఇ ఖాస్ అనే సమావేశ మందిరం ఉంది. ఇక్కడ రెండు పెద్ద వెండి పాత్రలు ఉంటాయి. ఒక్కక్కటి ఐదుంపావు అడుగులు ఎత్తుతో, 4000 లీటర్ల సామర్ధ్యం కలిగి, 340 కిలోల బరువు కలిగి ఉంటాయి. ప్రపంచంలోనే పెద్ద వెండి పాత్రలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది. మహరాజ రెండవ సవాయి మధో సింగ్ 1901లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్ళిన సమయంలో అక్కడి నీటిని త్రాగి తన పవిత్రతను పోగొట్టుకోవటం ఇష్టం లేక ,త్రాగేందుకు గంగ నీటిని ఆ పాత్రలలో తీసుకెళ్ళేడు. ఈ హాలులో అతి పెద్ద అందమైన షాండిలియర్స్ ఉన్నాయి. వీటికి దుమ్ము పట్టకుండా ప్లాస్టిక్ షీట్లను తొడిగి ఉంచుతారు. ప్రత్యేక సమయాల్లొనే వీటిని తియ్యటం జరుగుతుంది. సామాన్య ప్రజల కోసం దివాన్ ఇ ఆమ్ అనే మరొక సమావేశ మందిరం కూడా ఉంది. ఈ హాలు సీలింగ్ ఎరుపు , బంగారు రంగుల్లో ఉన్నడిజైన్లతో అలంకరించారు. ఈ హాలులో బంగారు సింహాసనం, ద్వారం దగ్గర పాలరాతితో చెయ్యబడిన రెండు పెద్ద పెద్ద ఏనుగులు ప్రత్యేకమైనవి. బగ్గీ ఖానా లో రాజ వంశీయులు ఉపయోగించిన రకరకాల బగ్గీలు, పల్లకీలు, యూరోపియను కార్లు ఉన్నాయి. రాజపుత్ర రాజు కి వేల్స్ రాజకుమారుడు బహూకరించిన బగ్గీ ప్రత్యేకమైనది. అది విక్టోరియ బగ్గీ.
ఇక్కడినుండి జంతర్ మంతర్ వెళ్ళేం. మన దేశ ఖగోళ శాస్త్రవేత్తల గొప్పదనం అంతా అక్కడ పొందుపరచబడింది. దిల్లీ, వారణాసి, ఉజ్జైన్, మథుర లలో కూడా జంతర్మంతర్ నిర్మించినప్పటికీ ప్రస్తుతం అక్కడెక్కడా జంతర్ మంతర్ పనిచేసే స్థితిలో లేదు. ఇవన్నీ 18వ శతాబ్దంలో నిర్మించబడినవి. జైపూర్ రాజైన రెండవ జైసింగ్ వీటిని నిర్మించాడు. దీనిని ‘జంత్ర’ అని మాత్రమే పిలిచేవారు . ‘జంత్ర’ అంటే యంత్రమని అర్థం. ఆ తర్వాత జత చేసిన మంతర్ కి ఎలాటి అర్థమూ లేదని జం తర్ కి రైమింగా మాత్రమే ఆ మాటను జత చేసినట్లు చెబుతారు. జైపూర్ లో ఉన్న జంతర్ మంతర్ కూడా కొంతవరకు మాత్రమే పనిచేస్తోంది. రిపేరు పనులు చేసే వాళ్లే లేరని గైడ్ చెప్పారు. అక్కడి నుండి రాజస్థాన్ హస్త కళల ఎంపోరియం దర్శించాము. అక్కడి వస్త్రాలు, వివిధ వస్తువులు ప్రదర్శన చూసేందుకే కాక కొనేందుకు కూడా అవకాశం ఉంది. రాజస్థాన్ కి మాత్రమే ప్రత్యేకమైన పనితనం కలిగిన వస్త్రాలు, రకరకాల హస్త కళల రూపాలు, కంటికి ఇంపుగా దర్శన మిచ్చాయి. ఇక్కడి నుండి మధ్యాహ్నపు ఎండలో నహర్గఢ్ కోటకు వెళ్లేం.
ఆరావళీ పర్వత అంచున ఠీవిగా నిలబడి జైపూర్ నగరాన్ని అవలోకిస్తున్నట్లుండే కోట నహర్గఢ్ కోట. మొదట ఈ కోటని సుదర్శన గఢ్ గా పిలిచేవారు. కానీ ఒక నమ్మకం ఆధారంగా చెప్పేదేమంటే ఈ కోటలో రాచ వంశీయుడైన నహర్ సింగ్ భోమియా ఆత్మ తిరుగుతూ ఉండేదని, కోట నిర్మాణాన్ని అడ్డుకుంటూండేదని, కోట లోపల నహర్ సింగ్ జ్ఞాపకార్థం ఒక దేవాలయం కట్టిన తరువాత అతని ఆత్మ కు శాంతి కలిగిందని ,కోటకు ఆతని పేరు మీదుగా నహర్గఢ్ అన్న పేరు వచ్చిందని చెబుతారు. ఈ కోట చుట్టూ ఉన్న కొండల అంచుల వెంబడి ఏర్పాటుచేసిన ప్రహరీ గోడలు ఇక్కడి నుండి కొద్ది దూరంలో ఉన్న జై గఢ్ కోట వరకు విస్తరించి ఉన్నాయి. అంబర్ కోట, జైగఢ్ కోట లతో పాటు నహర్గఢ్ కోట ఒకప్పుడు జైపూర్ రాజ్యానికి బలమైన రక్షణగా ఉండేది. చరిత్ర లో ఏ యుద్ధ సమయంలోనూ ఈ కోట పైకి ఎలాటి దాడి జరగనప్పటికి, ఇది చరిత్రలో కొన్ని ముఖ్య ఘట్టాలని చూసింది. 1857 లో జరిగిన సిపాయి తిరుగుబాటు సమయంలో జైపూరులో నివాసం ఉన్న యూరోపియన్లను,బ్రిటీష్ రెసిడెంట్ భార్యను వారి రక్షణార్థం ఈ కోటకు తరలించినట్లుగా చెబుతారు. ఎక్కువగా ఈ కోట రాజుల వేటకు విడిదిగా ఉండేది. కోట పైనుండి క్రింది వరకూ వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు రాజుల కాలంలో ఏర్పాటు చేసిన కాలువలు ఉన్నాయి. ఆ కాలంలో చేసిన ఈ ఏర్పాట్లు అద్భుతమైన ఇంజనీరింగ్ పనితనాన్ని, రాజుల భవిష్యత్తు ఆలోచనని తెలియజేస్తూ ఆశ్చర్యాన్ని కలిగించక మానవు. హిందీ సినిమాలైన ‘రంగ్ దే బసంతి’, ‘షుద్ధ దేశీ రొమాన్స్’ , మరియు బెంగాలి సినిమా ‘సోనార్ కెల్లా’ ల్లోని కొన్ని భాగాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి.
ఒక కిలో మీటరు దూరంలో బస్సు నిలిపేసి అక్కడి నుండి నడక ద్వారా లోపలికి వెళ్ళేం. బస్సుల్లాటి పెద్ద వాహనాలు కోటలోనికి అనుమతించకపోవటం అందుకు కారణం. కాని ఇది నడవలేని వారికి చాలా ఇబ్బంది కలిగించింది. కోట లోపల ఆ రాజ ప్రాసాదాలు,భవంతులన్నీ తిరిగిన తరువాత అక్కడి నుండి రెండు, మూడూ ఫర్లాంగుల దూరం ఇంకా నడిచి కోటలోపలే ఉన్నఅక్కడి రెస్టోరెంటుకు వెళ్ళాం. అది టూరిష్టు శాఖ నడుపుతోంది. అందువలనే లంచ్ సమయానికి అక్కడికి తీసుకెళ్ళి ఉండొచ్చు, భోజనం ఆర్డర్ మీద చేసి ఇస్తారు. కాని ఎలాటి ప్రమాణాలు, రుచులు కనిపించని నిస్సహాయపు భోజన వసతి అది. యాత్రికులంతా చాలా గొడవ పెట్టేరు, ఎర్రని మిట్టమధ్యాహ్నం కాకుండా పొద్దున్నే ఇలాటి స్థలానికి తీసుకురావలసింది అని. కాని గైడ్ తాను ఏమీ చెయ్యలేనని, అక్కడ తానొక ఉద్యోగిని మాత్రమేనని, తనకు అప్పగించిన పని చెయ్యటం వరకే తన బాధ్యత అని చెప్పేరు. నహర్గఢ్ కోట నుండి జైగఢ్ కోటకి ప్రయాణమయ్యాము. ఆ దారిలో ఆకాశవాణి రిలే కేంద్రం ఉంది. జైగఢ్ కోటని విక్టరీ కోట అనికూడా అంటారు. ఇది ఆరావళీ పర్వత శ్రేణుల్లో ఉన్న ‘హిల్ ఆఫ్ ఈగిల్స్’ లేదా ‘చీల్ కా తీలా’ మీద నిర్మించబడీంది. ఈ కోట ఒక కిలోమీటరు వెడల్పు, మూడు కిలోమీటర్ల పొడవు ఉంది. అంబర్ కోటను, ఆ రాజప్రాసాదాన్ని రక్షించేందుకు రెండవ జై సింగ్ జైగఢ్ కోటను కట్టించాడు.ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫిరంగి చక్రాలపైన అమర్చి ఉంది. దీని పేరు ‘జైవన’. దీనిని ఏ యుధ్ధంలోనూ వాడటం జరగలేదు. ఈ కోట లోపలికి ప్రవేశ రుసుము 40 రూపాయలు. ఈ కోటలో విలాస, విరామ మందిరాలు ఉన్నాయి .ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. ఇది అంబర్ కోట నిర్మాణ శైలిని కలిగి ఉండి, అంబర్ కోట కు 400మీటర్ల దూరంలో ఉంది. జైగఢ్ కోట జైపూర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో దిల్లీ-జైపూర్ హైవే కు కొంచెం ప్రక్కగా ఉంది. ముఖ ద్వారం సూరజ్ పోల్ గా పిలుస్తరు. ఇక్కడినుండి సన్నని దారి కోటకు దారితీస్తుంది. నడిచి కోటలోకి వెళ్లచ్చు లేదా ,సరదాగా వెళ్లాలనుకునే వారికి ఇక్కడ ఏనుగుల సవారి ఉంది. సూరజ్ పోల్ లేదా సూర్య ప్రవేశ ద్వారం నుండీ లోపలకు ఏనుగు మీద వెళ్లవచ్చు. రుసుము వెయ్యి రూపాయల పైనే ఉందని చెప్పారు. ఈ కోట మొఘలు చక్రవర్తి షాజహాన్ కాలంలో ప్రపంచంలోనే పెద్దదైన అతి సమర్ధవంతమైన ఫిరంగి లను నిర్మించే కర్మాగారాలను కలిగి ఉంది. ఈ కోట సమీపంలో ఇనుము విస్తారంగా దొరకటమే ఇందుకు కారణం. ఒక్కరోజులో 16 అడుగుల ఫిరంగిని నిర్మించేవారు.
ఇక్కడినుండి అంబర్ లేదా అమర్ ప్యాలస్ కి వెళ్ళేం . ఇది 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక పట్టణం అని చెబుతారు. జైపూర్ కు అతి ముఖ్యమైన ఆకర్షణ ఇది.అతి పెద్ద్దవైన కోట బురుజులు , అనేక ప్రవేశద్వారలతో, దారులతో ఉన్న ఈ కోట ప్రక్కనే ‘మావ్టా’ సరస్సు ఉంది. ఎరుపు శాండ్ స్టోన్, పాలరాయి ఉపయోగించి కట్టిన నాలుగు వరుసల కోట ఇది. ఇక్కడ కూడా సిటీ ప్యాలస్ లోలాగే ‘దివాన్ ఎ ఆమ్’ అని సాధారణ ప్రజలకొరకు ఒక మందిరము, ‘దివాన్ ఎ ఖాస్’ అని ప్రత్యేక వ్యక్తుల కొరకు ఒక మందిరము, షీష్ మహల్ అని పిలిచే అద్దాల మందిరము ఉన్నాయి. అంతేకాక వేసవికాలంలో చల్లని వాతావరణం ఏర్పాటయ్యేలా కట్టిన ‘సుఖ నివాస్’ చెప్పుకోతగ్గది. రాజపుత్ర రాజుల కు ఇది నివాసం గా ఉండేది. ప్యాలస్ ముఖద్వారంలో ఉన్న గనేష్ గేట్ దగ్గర శీలాదేవి దేవాలయం ఉంది. జైగఢ్ , అమ్బర్ కోటలు రెండూ అనేక అంతర్గత రహస్య మార్గాల ద్వారా ఒకకోట నుండి మరొక కోటకు వెళ్లేవిధంగా నిర్మాణం చేయబడ్డాయి. యుధ్ధసమయాల్లో అమ్బర్ కోటలో ఉన్న రాజ వంశీయులు రహస్య మార్గం ద్వారా కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైగఢ్ కోటలోనికి చేరే విధంగా కట్టబడింది. ఇక్కడి ఆర్కిలాజికల్ శాఖ వారి గణాంకాల ప్రకారం రోజుకి 5000 మంది సందర్శకులు వస్తారు. రాజస్థాన్ లోని మరి ఐదు కోటలతో కలిపి అంబర్కోట ను యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపదగా 2013 లో ప్రకటించటం జరిగింది. చీల్ క తీలా పైన కట్టిన ఈ అమర్ కోట పేరు ఇక్కడ అమ్బికేష్వర్ ఆలయాన్ని అనుసరించి వచ్చిందని చెబుతారు. ఇక్కడి జానపదుల నమ్మకాన్ని అనుసరించి అంబర్ అనే పేరు ప్రపంచాన్ని కాపాడే అంబ దేవత పేరు మీదుగా వచ్చింది.ఇది మేము చూసిన అన్ని ప్యాలస్ లలోకి అద్భుతమైనది. బస్సు నిలిపిన తరువాత నడక, లేదా జీపు ద్వారా ప్యాలస్ లోకి వెళ్ళవచ్చు. జీపులమీద కేవలం నలభై రూపాయల నుండి యాభై రూపాయల ఖర్చుతో వెళ్లిరావచ్చు. కోటలోకి వెళ్ళేందుకు సన్నని ఎత్తైన ఘాట్ రోడ్డుమీద వెళ్లవలసి ఉంటుంది. సువిశాలమైన ఆ కోట, భవంతులు అద్భుతమైన నిర్మాణ కౌశలంతో చూసేవారికి కంటికింపుగా ఒక ఉత్సవాన్ని, ఒకప్పటి రాచరికపు జీవితాన్ని కళ్లకి కట్టినట్టు చూబించింది. ఇక్క డ కూడా ప్రవేశ రుసుము చెల్లించాలి. మిగిలిన కోటలతొ పోల్చినప్పుడు ఇక్కడ కోట ప్రత్యేకతను అనుసరించి రుసుము కూడా ఎక్కువగా ఉంది. శీతాకాలం చలిగాలులు రాజ మందిరాల్లోకి ప్రవేశించకుండా కట్టిన కట్టడం, వేసవిలో చల్లని గాలులు మందిరాల్లోకి వచ్చేలా కట్టిన కట్టడాలు విస్మయాన్ని కలిగిస్తాయి. మూడు కాలాలకి అనుగుణంగా కట్టిన భవంతులు రాజవంశీయులకి అత్యంత సౌకర్యవంతంగా ఉండేవని చెప్పడానికి సందేహం లేదు. వంటశాలల్లో ఎత్తైన అరుగులు, వస్తువులు అమర్చేందుకు వీలుగా ర్యాకులు నిర్మాణం, భూమిలోపల వర్షపునీటిని భద్రపరిచే ఏర్పాట్లు, కోటలోపల వివిధ ప్రాంతాలకి నీటిని అందించే సౌకర్యం లాటి ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
Continued in Part VI
* * *
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part VI – ద్వైతాద్వైతం
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part IV – ద్వైతాద్వైతం
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike