* * *
Continued from Part III
అహ్మదాబాద్ నుండి అజ్మేర్ చేరుకున్నాం. ఆ రోజు ఈద్ పండుగ కావటంతో వూరంతా ఒక పండుగ సంబరంలో ఉంది. దాదాపు 5 లక్షల జనాభా కలిగి, రాజస్థాన్ లో ఐదవ పెద్ద పట్టణంగా చెప్పబడుతోంది. ఇది భారత దేశపు సాంస్కృతిక సంపద కలిగిన నగరాల్లో ఒకటి గా కేంద్ర పభుత్వంచేత గుర్తించబడింది. అజ్మేర్ 1956 సంవత్సరంలో రాజస్థాన్ లో భాగమైంది. రాష్ట్రంలో నడిబొడ్డున ఉంది ఈ పట్టణం. అజ్మేర్ అంటే సంస్కృతంలో అజయ మేరు. దానిని ఇంగ్లీషులో ఇన్విన్సిబుల్ మౌన్ టెయిన్ గా చెబుతారు. అజ్మేరు లో సంవత్సరం పొడవునా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. జూన్ నుండి సెప్టెంబరు వరకూ వర్షాకాలం. నవంబరు నుండి ఫిబ్రవరి వరకూ చలికాలం. ఇది సందర్శకులకి అనువైన కాలం.ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి, ఆహ్లాదకరమైన వాతావరణం, అప్పుడప్పుడు విపరీతమైన చలి గాలులు కూడా ఉంటాయి. అజ్మేరు దగ్గరగా ఉన్న కిషన్ గఢ్ లో 2013 సంవత్సరంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎయిర్ పోర్ట్ కు ప్రారంభోత్సవం చేసారు. అది 2016 నాటికి సిధ్ధం అవుతుందని అంచనా. ప్రస్తుతం ఇక్కడికి సమీపంలో ఉన్న ఎయిర్ పోర్ట్ జైపూర్ లో ఉంది.
ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘అజ్మేర్ దర్గా’ తారాగఢ్ పర్వత పాదాల వద్ద ఉంది. సూఫీ మత గురువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ 1192 సంవత్సరంలో అజ్మీర్ వచ్చి, 1236 లో పరమపదించే వరకు ఇక్కడే గడిపారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ సమాధి ఇక్కడ ఉంది. మొఘలు చక్రవర్తి అక్బర్, ఆయన భార్య మగ సంతానం కోసం ప్రతిసంవత్సరం ఆగ్రా నుండి ఇక్కడికి నడిచి వచ్చేవారట. దారి పొడవునా అనేక మజిలీలు చేస్తూ యాత్రీకుల సౌకర్యార్థం అనేక వసతులు కల్పించారు మొఘలు చక్రవర్తులు. ఆరావళీ పర్వత శ్రేణుల్లోని తారాఘడ్ పర్వత పాదాల దగ్గర ఉన్న పట్టణం ఇది. నాగపథాన్ పర్వత శ్రేణులు థార్ ఎడారి నుండి అజ్మీర్ కు రక్షణ కలిగిస్తున్నాయి. ఈ పట్టణం జాతీయ రహదారి 8 పైన ఉంది. దర్గా కాకుండా వూరంతా చుట్టి ఉన్న ఆనాసాగర్ సరస్సు, లేక్ ఫాయ్ సరస్సు, తారాఘడ్ కోట చూడదగ్గవి. తారాగఢ్ కోట ప్రపంచంలోనూ, భారత దేశంలోనూ ఉన్న అతి ప్రాచీన కోటల్లో ఒకటి. ఇక్కడ స్వర్ణ జైన దేవాలయం కూడా ఉంది. అజ్మేరులోని సరస్సులు రెండూ కృత్రిమంగా ఏర్పాటు చేసినవే.. ఆనాసాగర్ సరస్సు ప్రక్కనే దౌలత్ బాగ్ అన్న ఉద్యానవనం జహంగీరు చక్రవర్తి నిర్మించాడు.సరస్సు నుండి ఉద్యానవనానికి మధ్య ఐదు రహదారులను పాలరాతితో షాజహాను చక్రవర్తి నిర్మించాడు. దీనిని బరాదరి అని అంటారు. ఇది కూడా చూడదగిన ప్రదేశం. 1892 సంవత్సరంలో ఈ ప్రాంతంలో కరువు నివారణకు పట్టణ శివార్లలో నిర్మించిన కృత్రిమ సరస్సు‘ లేక్ ఫాయ్ సాగర్’.
దర్గా అన్ని మతాల వారికి ప్రవేశాన్ని కలిగిస్తోంది. దీనిని ‘ఖ్వాజా గరీబ్ నవాజ్ ‘ అనికూడా పిలుస్తారు. ప్రతిరోజూ కొన్ని వేలమంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాత్రికులు దర్గాని దర్శిస్తారని చెబుతారు. మేము దర్గాను సందర్శించిన ఆ సాయంత్రం చటుక్కున వర్షం అందుకుంది. విశాలమైన దర్గాలో నిశ్శబ్దంగా ప్రార్ధనలు చేసుకుంటున్న జనంతో పాటు ఆ వాతావరణం కూడా ఎలాటి హంగు ఆర్భాటాలు లేకుండా ఒక పవిత్రతను, శాంతిని సందర్శకులకి అందిస్తూ కనిపించింది. పండుగ దినాల్లో మన దేవాలయాల్లో కనిపించే ఆర్భాటాలు,అలంకారాలు ఇక్కడ కనిపించలేదు. నిరాడంబరంగా ఉన్న ఆ పరిసరాలు ఒక అపురూప దృశ్యం. దర్గాలోంచి బయటకు వచ్చేప్పటికి వాననీటితో రోడ్లన్నీ జలమయమై పోయాయి. దర్గా కి, మసీదు కి నిర్మాణ శైలి విభిన్నంగా ఉంటుంది. మసీదు ముస్లిముల ప్రార్ధనల కొరకు కట్టిన నిర్మాణం. దర్గా అనేది ప్రార్ధనల కొరకు కాకుండా ప్రపంచ ప్రఖ్యాత మతగురువుల సమాధులకోసం చేపట్టిన నిర్మాణం.
అజ్మేర్, ఈ పట్టణ సమీపంలో ఉన్న పుష్కర్ ప్రాంతాల గురించిన కొన్నిప్రత్యేక విషయాలు నాకు ఈ యాత్రలో తెలిసేయి. అజ్మేర్ ముస్లిములకు పవిత్ర స్థలం గా చెబితే, ప్రక్కనే ఉన్న పుష్కర్ హిందువులకి పవిత్రమైన స్థలం గా చెబుతారు. కానీ అజ్మేర్ జనాభాలో కేవలం 11 శాతం ప్రజలు మాత్రమే ముస్లిములు ఉండగా, పుష్కర్ లో 33శాతం జనాభా ముస్లిములు ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి అజ్మీర్ నుండి హిందువులు కానీ సింధీలు కానీ ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే పుష్కర్ నుండి ముస్లిం లు ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తారు. ఇది వింటున్నప్పుడు మన దేశ ప్రజల పరమత సహనం, మన దేశప్రత్యేకత గా చెప్పే ‘భిన్నత్వంలోని ఏకత్వం’ కంటిముందు సాక్షాత్కరిస్తుంది.
సాధారణంగా ఇక్కడ నవంబరు నుండి ఫిబ్రవరి వరకూ సందర్శకులకు అనువైన సమయం. ఇక్కడ ఉన్నివస్తువులు , వస్త్రాలు ,తోలు వస్తువులు, బూట్లు,సోపులు, మందుల తయారీ , పౌల్ట్రీ సంబంధ వ్యాపారాలు ప్రసిధ్ధమైనవి. అజ్మేర్ కు సమీపంలోని కిషన్ గఢ్ మార్బుల్ వస్తువులకు ప్రసిధ్ధి. ఇక్కడ మార్బుల్ పరిశ్రమ లో దాదాపు 7000 మంది ఉద్యోగులున్నారు. అజ్మేర్ లో ‘మ్యాగజైన్’ అనే పేరుతో ప్రసిధ్ధిపొందిన మ్యూజియమ్ ఉంది. ఇక్కడ మొఘల్, రాజపుత్రుల రాజుల గురించిన వివరాలు చూడవచ్చు. కిషన్ గఢ్ సమీపంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ ఉంది. ప్రజలు శాంతంగా, నిరాడంబరంగా ఉన్నారు. అజ్మేర్ కు 13 కిలోమీటర్ల దూరంలో పుష్కర్ అనే యాత్రా స్థలం ఉంది. అజ్మేర్ జిల్లాలో అజ్మేర్ కి వాయవ్య దిశగా ఉంది ఈ పట్టణం. పద్మ పురాణం చెప్పిన ప్రకారం ప్రపంచంమొత్తం లోనే ఇక్కడ ఒక్కచోట మాత్రమే బ్రహ్మ దేవాలయం ఉంది. ఇక్కడ పుష్కర్ నదిలో స్నానం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు వస్తారు. నాలుగు ముఖాలతో ఉన్న బ్రహ్మ విగ్రహం రెండు ద్వారాల నుండి చూడవచ్చు. బ్రహ్మ దేవాలయం పాలరాతి తో కట్టబడి ఉంది. దేవాలయ ముఖ ద్వారం దగ్గర ఉన్న వెండి తాబేలు బ్రహ్మ దేవుని వాహనం అన్నదానికి నిదర్శనమని చెబుతారు. పుష్కర్ సరస్సు ఒడ్డున కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. ఈ సరస్సు సమీపంలో గురుగోవింద్ సింగ్ గురుగ్రంథ సాహిబ్ ను పఠించినట్లు చెబుతారు. గాంధీ చితాభస్మాన్ని కలిపిన పుష్కర్ ఘాట్ ను గాంధీ ఘాట్ గా చెబుతారు. రు. ఈ సరస్సులో కార్తీక పౌర్ణమి నాడు స్నానిస్తే పుణ్యలోకాలకు వెళ్తారని హిందూ భక్తుల నమ్మకం. సరస్సు దగ్గర ఉదయం, సాయంత్రం ఆరతి ఇస్తారు. సరస్సులో కొబ్బరికాయలు, పూలు, నాణేలు కానుకలుగా భక్తులు సమర్పిస్తారు. సాయంత్ర సమయంలో భక్తులు సరస్సులో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి వదులుతారు. సాయం సంధ్యలో వెలుగునీడల మధ్య ఆ దృశ్యం – చూసేవారిలో ఒక ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుంది.
చార్ధామ్ గా చెప్పబడే బదరీనాథ్,పూరి, రామేశ్వరం, ద్వారక పుణ్య క్షేత్రాల యాత్ర పుష్కర్ సరస్సులో స్నానం చెయ్యటంతో పూర్తి అవుతుందని హిందూ భక్తుల నమ్మకం. ఈ చార్ధామ్ ఉత్తర భారత దేశంలో చెప్పబడే చార్ ధామ్ కు భిన్నమైనది. పుష్కర్ సరస్సుకు 52 పుష్కర ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20,000 జనాభా ఉంది. పుష్కర్ అంటే సంస్క్రతంలో నీలి కలువ అని అర్థం. ప్రతి కార్తీక పౌర్ణమికి ఇక్కడ జరిగే ఒంటెల ఉత్సవానికి రెండు లక్షల మంది దేశ విదేశాలనుండి హాజరు అవుతారు. ఇది ఐదు రోజులపాటు జరుగుతుంది. ఉత్సవంలో ఒంటెలను కొనటం , అమ్మటం జరుగుతుంది. అంతేకాక వెండిఆభరణాలు, పూసలతో చేసిన ఆభరణాలతో వాటిని అలంకరించి ప్రదర్శిస్తారు. ఇంకా ఒంటెలు,పశువులు మధ్య పోటీలను ఏర్పాటు చేస్తారు. ఒంటెల సఫారి ఉంటుంది. ఈ ఉత్సవ సమయంలో జానపదుల పాటలు, నృత్యాలు, సినిమా ప్రదర్శనలు, చారిత్రక నాయకుల గురించిన పాటలు, పద్యాలు ప్రదర్శిస్తారు. ఉత్సవాల్లో పూసల నెక్లెస్సులు, ఉన్ని దుప్పట్లు, పాత్ర సామాను వంటి అనేక వస్తువులు అమ్మకానికి పెడతారు.రాజస్థాన్ రాష్ట్రం లో సంవత్సరం పొడవునా అనేక ఉత్సవాలను జరుపుతారు. అందుకే అది ఉత్సవాల రాష్ట్రంగా పేరుపొందింది. జైపూర్ లో జనవరిలో ఒంటెల ఉత్సవం, మార్చిలో ఏనుగుల ఉత్సవం జరుపుతారు. మార్చి నెలలోనే హోలీ రాష్ట్రమంతా పెద్ద వేడుకగా జరుపుతారు. ఏప్రిల్లో గన్గౌర్ ఉత్సవం లో యువతులు అందంగా అలంకరించుకుని 18 రోజుల పాటు సంబరాలు జరుపుకుంటారు.పార్వతి దేవికి మిఠాయిలు నైవేద్యంగా సమర్పిస్తారు. మేలో ఉర్స్ అజ్మేర్ షరీఫ్ ఉత్సవం జరుపుతారు. జూన్ నెలలో మౌంట్ ఆబూ లో వేసవి ఉత్సవం జరుపుతారు. జూలై లో నాగపంచమి ఉత్సవం. ఆగష్టులో తీజ్ ఉత్సవం వర్షాకాలాన్ని ఆహ్వానిస్తూ రెండు రోజులపాటు జైపూర్ లో జరుపుతారు. చెట్లని అలంకరించి, సిటీ ప్యాలస్ నుండి ఊరేగింపుగా వెళ్తారు. అక్టోబరులో నవరాత్రి అంటే 9 దివ్వెల ఉత్సవాన్ని , దసరా, దీపావళి ఉత్సవాల్ని జరుపుతారు. డిశంబరులో మౌంట్ ఆబూ చుట్టూ జానపద నృత్యాలను, సంగీతాన్ని ప్రదర్శించి శీతాకాలపు ఉత్సవాన్ని జరుపుతారు. అజ్మేర్ యాత్ర ముగించుకుని జైపూర్ బయలుదేరేం.
యాత్రలో మా ఆఖరి మజిలీ జైపూర్. వూరువూరంతా గులాబి రంగు కట్టడాలతో ‘పింక్ సిటీ’ పేరును సార్ధకం చేసుకుంటూ కనిపించింది. విదేశీయ సందర్శకులతో ఎక్కువగా కళకళ లాడే ఈ సంపన్న నగరంలో స్టేషన్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా బసకు చేర్చేందుకు ఆటోవాలా చక్కగా ‘ఒక పది డాలర్లు ఇవ్వండి’ అని అడిగాడు. అతని ధోరణికి నవ్వొచ్చింది. విదేశీయులకి సాధారణంగా మన దేశంలో అన్ని దర్శనీయ స్థలాల దగ్గరా ఎక్కువ ప్రవేశ రుసుమును వసూలు చేస్తున్నారు. ఇక్కడ మన ఆటో వాళ్లు దేశీయుల దగ్గర ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తున్నారని అనిపించింది. కానీ విహార యాత్రా స్థలాలలో కేవలం సందర్శకుల మీద వచ్చే ఆదాయాన్ని జీవనోపాధిగా చేసుకున్న వారి ధోరణిని కూడా పూర్తిగా తప్పు పట్టలేము. ఇక్కడ అలవాటుకు భిన్నంగా హోటలుకు బదులుగా ఒక ప్రైవేటు విల్లాలో బస చేసేం. ఇది ‘ ఎయిర్ బి అండ్ బి ’ సంస్థ ద్వారా బుక్ చేసుకున్నామ్. ఎయిర్ బి అండ్ బి అనేది శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా లలో కార్యాలయాలను కలిగి ఉండి అవసరమైన వారికి నెట్ ద్వారా కానీ మొబైల్ ఫోన్ ద్వారా కాని కావలసిన వసతిని ఏర్పాటుచేసే సంస్థ. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభ మైంది. మేము బస చేసిన విల్లాలో ఇంటికి దూరంగా ఉన్న బెంగ తీరటమే కాకుండా ఇంటిభోజనం కూడా దొరికింది. ఇంటి ముందు చక్కని పూలమొక్కలు, ఆకుపచ్చని తీవెలూ ఆహ్వానం పలికేయి. మా హోస్ట్ అమిత కూడా చక్కగా పలకరించి క్రొత్త అనే భావం లేకుండా చేసింది. ఈ విల్లా నగరంలోని అతి ముఖ్యమైన , ఖరీదైన మీర్ ఇస్మాయిల్ రోడ్డుకు రెండు నిముషాల నడక దూరంలో ఉంది. అమిత బాగా చదువుకున్న వ్యక్తి కావటం చేత ,ఒక బ్యాంక్ అధికారిణిగా పనిచేసి ఉండటం చేతా రాజస్థాన్ రాష్ట్ర ప్రజలు, వారి ఆర్థిక పరిస్థితులు, అక్కడి సామాజిక పరిస్థితులని చక్కగా వివరించారు. ఇక్కడ అక్షరాస్యత దాదాపు 66శాతం. పల్లెలలో, స్త్రీలలో మరింత తక్కువ. చాలా వరకు గ్రామీణ స్త్రీలు ఇంటికే పరిమితమవుతారు. కొందరు స్త్రీలు మాత్రం స్థానికమైన హస్తకళలకు చెందిన పనులలో నిమగ్నమై ఉంటారు. సమాజంలో ఆడపిల్ల స్థానం మాత్రం అన్నిచోట్లా ఒక్కలాగే ఉందని అర్థమైంది. మగపిల్లవాడిని మాత్రమే కనాలనే భావన తల్లిదండ్రులకి, పెద్దలకీ కూడా ఇప్పటికీ ఉందని చెప్పిందామె.
జైపూర్ లో మేము గడిపిన మొదటిరోజు ప్రొద్దున్నే రుచికరమైన పరాఠాలు , కమ్మని పెరుగుతో అందించారు మేమున్న విల్లాలో. బ్రేక్ఫాస్ట్ చేసి తీరిగ్గా జైపూర్ రోడ్లు తిరిగి, ఒక నలభై నిముషాలకు మాత్రం పరిమితమైన జయపూర్ నగర్ మెట్రో లో ఆ చిన్న దూరాన్నిప్రయాణించి చూసేం. ఇది ఈ సంవత్సరం జూనె నెల లోనే ప్రారంభమైంది. స్థానికులు అలవాటు పడినట్లే ఉన్నారు మెట్రో ప్రయాణానికి. నెల క్రితం మొదలైన చెన్నై మెట్రో లో ప్రయాణించి నప్పుడు ఇంకా అక్కడ జనాలు ఆ క్రొత్త రవాణా వ్యవస్థని ఒక పిక్నిక్ జరుపుకునే స్థలంలా చూస్తూ సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. జైపూర్ లో విశాలమైనరోడ్లు మెట్రో వ్యవస్థ ఏర్పాటుకు చాలా వరకు వీలుగానే ఉన్నాయి. మెట్రో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అందువలన కాబోలుకొన్ని చోట్ల ముఖ్యంగా జైపూర్ రైల్వే స్టేషన్లాటి చోట మాత్రం రోడ్డు కాస్త గందరగోళంగా , అస్తవ్యస్థంగా కనిపించాయి. ప్రజలు ఇక్కడ ఉన్న అనేక హోల్ సేల వ్యాపారాల్లో నిమగ్నమై కనిపించారు. నగరం ప్రశాంతంగా ఉంది. నగరంలోసాధారణ రిక్షాలు కూడా ఉన్నాయి. దిల్లీ లాటి నగరాల్లో మంచినీళ్ల సీసాలను మెట్రో రైలు ఆవరణలోకి అనుమతించరు. కాని ఇక్కడ జైపూర్ లో మెట్రో ప్రాంగణంలో అందరి చేతిలో మంచినీటి సీసాలు ఉన్నాయి. ట్రెయిన్ లో మాత్రం తినటం, త్రాగటం, సంగీతం వాయించటం నిషేధం అని హెచ్చరికలు వినవస్తున్నాయి. జనం మాత్రం ఆ నిషేధాన్ని పట్టించుకోవటం లేదు.మెట్రో ప్రయాణం అయాక సంగనీర్ గేట్ ప్రాంతంలో ఉన్న విశాలమైన మార్కెట్ చూసేం . ఇప్పటిదాకా చూసిన ఏ నగరం లోనూ అంత ఆర్గనైజ్డ్ మార్కెట్ చూడలేదు. కొన్ని వందల దుకాణాలు బారులు తీర్చి ఉన్నాయి. బాపు బజారు, నెహ్రూ బజారు, జొహరి బజారు హవామహల్ కు, జంతర్మంతర్ కు సమీపంగా ఉన్నాయి. బాపూ మార్కెట్ లో చేతితో చేసిన అందమైన చెప్పులు అనేకరకాల డిజైన్లలో మంచి ధరకి లభిస్తాయి. ఇంకా బట్టలు, ఇతర వస్తువులు చక్కగా బేరంచేసి కొనుక్కోవచ్చు. చాలా మంచి ధరలకి దొరుకుతాయి. పప్పెట్లు కూడా రంగురంగు అలంకరణలతో తయారుచేసి అమ్ముతారిక్కడ. జొహరీ బజారులో అందమైన డిజైన్స్ లో బంగారు, వెండి నగలు దొరుకుతాయి. వెండి నగలకే ఎక్కువ గిరాకీ ఉంటుందని, ఇక్కడి డిజైన్లు ప్రత్యేకమైనవని చెప్పేరు. మార్కెట్ మధ్యలో ఎల్.ఎమ్.బి. అనే పెద్ద్ద మిథాయి దుకాణం , వారిదే రెస్టొరెంటు ఒకటి ఉంది. అక్కడ ఖరీదైన స్థానిక రుచులు అనేకం దొరుకుతాయి. ముఖ్యంగా బట్టలు, పాత్ర సామాను, రకరకాల చేతి పనులతో చేసిన వస్తువులు, అక్కడ మాత్రమే వస్త్రాలపై కనిపించే సంగనీర్ పనితనం, బ్లాక్ అద్దకం పని చేసిన బట్టలు న్యాయమనిపించే ఖరీదుకు దొరుకుతున్నాయి. విదేశీ సందర్శకులు ఎక్కువగా కనిపించారు. సందర్శకులే ఇక్కడ ప్రజలకి ప్రముఖ ఆదాయ వనరుని కల్పిస్తున్నారు అన్నది నూరుపాళ్లు నిజం.
Continued in Part V
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part V – ద్వైతాద్వైతం
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part VI – ద్వైతాద్వైతం
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part III – ద్వైతాద్వైతం
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part III – ద్వైతాద్వైతం
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike