* * *
Continued from Part II
ద్వారకలో రెండురోజుల మజిలీ తర్వాత మేము సోమనాథ్ కి రోడ్దు దారిలో ప్రయాణమయాం. అది దాదాపు 4-5 గంటల ప్రయాణం. దారి పొడవునా విండ్ మిల్స్ దర్శనమిస్తాయి. రాష్ట్రంలో విద్యుత్తును పుష్కలంగా తయారుచేసేందుకు ఇవి బాగా తోడ్పడుతున్నాయి. రోడ్డు బావుంది. చుట్టూ విశాలమైన ఖాళీ భూములే కాని ఎక్కడా పంట పొలాలు కన్పించకపోవటం గమనార్హం. సోమనాథ్ వెళుతూ మధ్యలో గాంధీజీ జన్మస్థలమైన పోర్బందరు చూసేం.ఇక్కడ బాపూ పుట్టిన భవంతిని ‘కృతి మందిర్’ అని అంటారు. దీనిని కొద్ది మార్పుచేర్పులతో అతి భద్రంగా సంరక్షిస్తున్నారు. గాంధీ జన్మించిన గదిలో ఆయన పుట్టిన స్థలంలో ఒక స్వస్తిక్ గుర్తు పెట్టబడి ఉంది. విశాలమైన రెండు అంతస్థుల భవనం అది. బాపు చదువుకున్న గది, ఇప్పటిలా అరుగులు, అల్మరలతో సౌకర్యవంతంగా ఉన్నవంట గది, అతిథులకోసం ఉన్నగదులు, ఇలా అనేక గదులతో ఉన్న చాలా పెద్ద భవంతి అది. వెనుక వైపు సందర్శకులకోసం మరుగుదొడ్లు, మంచి నీటి సౌకర్యం ఉన్నాయి. ఆ పరిసరాల్ని నిరంతరం శుభ్రపరుస్తూ అక్కడ ఇద్దరు ముగ్గురు యువకులు, స్వచ్చంద సేవకులు కాబోలు కనిపించారు. ఆ భవనాన్ని ఆనుకునే వెనుక వీధిలో కస్తూర్బా తల్లిదండ్రుల ఇల్లు ఉంది. ఆవిడ పుట్టిన గదిని, ఆ భవంతిని శుభ్రంగా సంరక్షిస్తున్నారు. అది కూడా అన్ని సౌకర్యాలతో, అనేక గదులున్న రెండు అంతస్థుల భవంతి. విజిటర్స్ బుక్ లోకి తొంగిచూసినప్పుడూ అక్కడ ఆఫీసులో కూర్చున్న వ్యక్తి ‘మీ అభిప్రాయం రాయండి’ అని చెప్పేరు. రోజూ కనీసం 10 మంది వస్తారు అని చెప్పారు. ఆ వీధుల్లో నడుస్తున్నప్పుడు, ఆ చుట్టుప్రక్కల ఇళ్లల్లోని వారిని చూస్తున్నప్పుడు తెలియని భావోద్వేగం కలిగింది. బాపూ కలలుగన్నదేశం ఆనవాళ్లు ఎక్కడా అని వెతుక్కోవలసిన స్థితిలోనే మనం ఇంకా ఉండటం మనసుని దిగులుపరిచింది. బాపు ఇంటిముందు బిక్షాటన చేస్తున్న పిల్ల,పెద్దాలను చూసినప్పుడు నిర్వికారంగా అయిపోయింది మనసు.
ఆ వీధి చివరికంటా నడిచివచ్చిఒక టీ బంక్ దగ్గర టీ తాగి నప్పుడు మాటల మధ్య ఆ దుకాణదారు చెబుతున్నాడు…… ‘జనం నిరంతరంగా వస్తూనే ఉంటారు. కొన్నిసార్లు పదుల సంఖ్యలో బస్సుల్లో యాత్రీకులు వచ్చి చూస్తుంటారు’ – అని. పోర్బందరులో భారత్ మందిర్, ప్లానటోరియమ్, ఇంకా అనేక దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఉన్నాయి. భారత్ మందిర్ లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలున్నాయి. పట్టణ వాణిజ్య సముదాయాల మధ్య విశాలమైన సుదాముడి దేవాలయం ఒకటి ఉంది. పోరుబందరు ప్రముఖమైన, పురాతనమైన పోర్ట్ కావటంతో అనేక మందికి జీవనోపాధిని చూబిస్తూ వూరు హడావుడిగానే కనిపించింది. ఇక్కడ ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి. 2 లక్షల పైగా జనాభా ఉంది.
ద్వారకలోనూ, పోరుబందరులోనూ ఒకరమైన క్రొత్త వాహనాన్ని చూసేను. ఇది ఎత్తైన మోటారు బైక్ వంటి ముందు భాగం కలిగి, వెనుక భాగం ఒక పెద్ద ఆటోలా ఉంటుంది. కాని టాపు మాత్రం ఉండదు.దాదాపు పది మంది వరకు కూర్చుని ప్రయాణిస్తూ కనిపించారు. దీనికి ఎలాటి సీట్ల ఏర్పాటు లేదు. మన వైపు లారీల్లో వెనుక భాగంలో అలా క్రింద కూర్చుని వెళ్తూన్న జనాన్ని చూస్తూ ఉంటాం కదా. అలాగన్న మాట. సామాను చేరవేసేందుకు, పనులకు వెళ్ళే జనాన్ని ఒకచోట నుండి ఒక చోటకి తలలించేందుకు ఇవి ఎక్కువగా వాడుకలో ఉన్నట్లు కనిపించాయి. వీటికి ముందు భాగంలో రకరకాల రంగుల్లో ముస్తాబు చేయటం వలన చూసేందుకు భలేగా ఉంటుంది. వీటిని చఖ్ ఢా అంటారు. ఈ ప్రాంతాలకి మాత్రమే ఇవి ప్రత్యేకం అని చెప్పారు.
అక్కడినుండి సోమనాథ్ ప్రయాణమయ్యాము. ద్వారక పరిసరాలకు భిన్నంగా దారి పొడవునా పచ్చని పంటపొలాలు కన్నుల పండుగగా ఉన్నాయి. ఇక్కడ కూడా రహదారి పొడవునా విండ్ మిల్స్ ఉన్నాయి. సోమనాథ్ ‘గిర్ సోమనాథ్’ జిల్లాలో ఉన్న పట్టణం. ఇది కథియావార్ ద్వీపకల్పంలో దక్షిణాన ఉంది. ఇది కూడా దేశంలోని 12జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ దేవాలయం అతి వైభవోపేతంగా ఉండేదని , కాని మహమ్మదీయుల దండయాత్రల వలన శిథిలమైపోయిందని చెబుతారు.స్కంద పురాణంలో చెప్పిన ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం చంద్రుడు ద్వారా జరిగింది. ఆ కథని అనుసరించి దక్షుని కుమార్తెలను 27 మందిని చంద్రుడు వివాహం చేసుకుని వారిలో ఒక్క రోహిణి పట్ల మాత్రమే అనురాగం కలిగి ఉంటాడు. దానితో నిరాదరణకు గురైన కుమార్తెలు తండ్రికి తమ బాధను చెప్పుకోగా , కుమార్తెల బాథను చూసి, కోపించిన దక్షుడు చంద్రుడు క్రమంగా క్షీణించేలా శాపం ఇస్తాడు. శాప విమోచన కోసం చంద్రుడు శివుడి గురించిన తపస్సు చేసి శాపాన్ని తొలగింపచేసుకుంటాడు. తన కృతజ్ఞత తెలియచేసుకుందుకు అక్కడ శివుడిని ప్రతిష్ట చేసి దేవాలయ నిర్మాణాన్ని చేపడతాడు. అందువలన చంద్రుడి పేరుమీదుగా ఈ దేవాలయానికి సోమనాథ దేవాలయం అని పేరు వచ్చింది. సోముడంటే శివుడనే అర్థం కూడా చెబుతారు. సోమనాథ్ పట్టణాన్ని ‘ప్రభాస పట్టణమ’ని కూడా పిలుస్తారు.1947 లో వల్లభాయి పటేల్ ఇక్కడ పర్యటించినప్పుడు దేవాలయ దుస్థితి చూసి పునర్నిర్మాణానికి పూనుకున్నారు. 1951 సంవత్సరంలో అప్పటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ దేవాలయాన్ని ప్రారంభించారు. ఆయన దేవాలయాన్ని ప్రారంభిస్తూ , “ విధ్వంస శక్తి కంటే పునర్ నిర్మాణ శక్తి బలమైనదని , అనేక పర్యాయాలు ధ్వంసం కాబడి, దోచుకోబడిన ఈ దేవాలయం మళ్ళీ మళ్లీ అద్భుతమైన నిర్మాణంగా నిలబడటమే దానికి ఉదాహరణ “ అని చెప్పారు. సోమనాథ్ ఆలయం శిఖరం 15మీటర్ల ఎత్తు కలిగి ఉంది. దాని పై భాగాన 8.2 మీటర్ల పొడవు కలిగిన జెండా కర్ర ఉంది. ఈ దేవాలయం సముద్ర తీరాన ఉంది. సముద్రం నుండి దేవాలయానికి గల రక్షణ గోడ పైన ఒక బాణాకారపు స్థంభం ఉంది. ఆ బాణాకారపు స్థంభం అక్కడి రేఖాంశం మీద ఉత్తర దిక్కుగా ఉన్న మొదటి బిందువుపైన ఉందనీ, ఇక్కడి నుండి దక్షిణ దృవంవరకూ,- అంటే దేవాలయం నుండి అంటార్కిటికా వరకు మరే ఇతర భూ ప్రాంతమూ లేదని, అంతా సముద్రమేననీ చెబుతారు. ఇదొక అపూర్వమైన విశేషంగా చెబుతారు. ఈ దేవాలయం ఉదయం 6 గంటలకి తెరిచి రాత్రి 9 గంటలకి మూసివెయ్యటం జరుగుతుంది. రోజుకి మూడుసార్లు ఇక్కడ ఆరతి ఇవ్వటం జరుగుతుంది. ఈ దేవాలయంలో అభిషేకానికి ప్రతిరోజూ హరిద్వార్, ప్రయాగ మరియు వారణాసి నుండి నీళ్ళు తెస్తారని చెబుతారు. పండుగలకి కాశ్మీరు నుండి ప్రత్యేకంగా పువ్వులను తెప్పిస్తారని చెబుతారు. ఈ దేవాలయంలో బాధ్యతలు నిర్వహించేందుకు వెయ్యి మంది అర్చకులున్నారని తెలిపారు. ఈ దేవాలయం కూడా హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తోంది.
సోమనాథ్ దేవాలయం మిగిలిన శివ క్షేత్రాలకంటే భిన్నంగా కనిపించింది. ఒక వైష్ణవ ఆలయానికి వచ్చిన అనుభూతి కలిగింది ఇక్కడి వైభవం చూసినప్పుడు. విశాలమైన గర్భ గుడి,అలంకరణమధ్య శివలింగం జ్వాజ్వల్యమానంగా వెలుతురులు చిమ్ముతోంది , ఆరతి సమయంలో దైవనన్నిధిలో నిలబడేందుకు విశాలమైన హాలు ఉంది. ద్వారకలోనూ,ఇక్కడా కూడా దక్షిణలు వెయ్యమని అడిగే అర్చకులు కాని, మరెవరూ కనిపించలేదు. విశాలమైన దేవాలయ ప్రాంగణం లో సర్దార్ వల్లభాయి పటేల్ నిలువెత్తు విగ్రహం ఉంది. సోమనాథ్ నుండి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలో ‘భాల్కాతీర్థ’ అన్నచోట కృష్ణుడు నిర్యాణం చెందినట్లు చెబుతారు. ఇక్కడ కృష్ణుని ఆలయం ఉంది. సోమనాథ్ రైల్వే స్టేషన్ కూడా దేవాలయ నిర్మాణ ఆకారంలో ఉండటంతో యాత్రీకులను అమితంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ బస చేసేందుకు అనేక హోటళ్లున్నాయి. గుజరాతీయులు మిఠాయిలు ఎక్కువగా తినటమే కాకుండా వారి భోజన పదార్ధాలు కూడా తియ్యగా ఉంటాయి. మనలో తీపి ఇష్టపడే వారికి కూడా గుజరాతీ భోజనంలో వడ్డించే తియ్యని కూరలు, పప్పు తినటం ఇబ్బందే.
సోమనాథ్ లో ప్రొద్దున్న పది గంటలకు రైలు ఎక్కి సాయంత్రం ఏడు గంటలకు అహ్మదాబాదు చేరేం. అహ్మదాబాద్ గుజరాత్ కి ఒకప్పుడు ముఖ్య పట్టణంగా ఉండేది. దీనిని అందావాద్ గా కూడా పిలుస్తారు. ప్రస్తుతం దాదాపు 50 లక్షల జనాభాతో ఒక నగరానికి ఉండవలసిన హంగులన్నీఉన్నపెద్ద వర్తక, వాణిజ్య కేంద్రం ఇది. రాత్రి పూట కూడా వీధులన్నీ హడావుడిగానే కనిపించాయి. అదీగాక మేము వెళ్ళినప్పుడు తెల్లవారి ఈద్ పండుగ కావటంతో నగరంలో మార్కెట్ ప్రాంతాలన్నీ అర్ధరాత్రి వరకూ బిజీగా ఉన్నాయి. అహ్మదాబాద్ లో కంకారియా అనే పెద్ద సరస్సు, జమ మసీదు, కాలికో మ్యూజియమ్, తీన్ దర్వాజా చూడదగ్గవి. గుజరాత్ హైకోర్ట్ కూడా ఇక్కడే ఉంది. సబర్మతి సరస్సును కృత్రిమంగా అభివృధ్ధి పరిచి చుట్టూ మొక్కలతో అందంగా తీర్చిదిద్దేరు. ’ సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్’ పేరుతో నదీ తీరాన్ని సందర్శకులకి అనువుగా, ఆహ్లాదంగా తీర్చి దిద్దటమే కాకుండా, నదీ తీరం వెంబడి నివసించే పేద ప్రజలకు నివాస సౌకర్యం కూడా ఏర్పాటుచేశారు. అహ్మదాబాద్ లో అన్నింటికంటే సబర్మతీ ఆశ్రమం చూడటం ఒక మంచి అనుభవం. ఆ పరిసరాల్లో తిరుగుతూ స్వాతంత్ర్య సమరం ఘట్టాన్ని తలుచుకోకుండా ఉండలేము.
సబర్మతీ ఆశ్రమంలో కస్తూర్బా తోపాటుగా గాంధీజీ పన్నెండు సంవత్సరాల పాటు నివసించారు.ఇక్కడినుండే స్వాతంత్ర పోరాటంలో ముఖ్య ఘట్టమైన దండి ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. దీనికున్న ఈ ప్రాముఖ్యతని బట్టి ఈ ఆశ్రమాన్ని జాతీయ సంపదగా గుర్తించింది భారత ప్రభుత్వం. ఇది 1917లో నిర్మించబడింది. ఈ ఆశ్రమం సబర్మతీ నదీ తీరాన 36 ఎకరాల స్థలంలో ఉంది. ఆశ్రమాన్ని గాంధీ ఆశ్రమమని, హరిజన ఆశ్రమమనీ, సత్యగ్రహ ఆశ్రమమనీ కూడా ఇదివరలో పిలిచేవారు. ఈ ఆశ్రమానికి జైలు ఒకప్రక్క, శ్మశాన భూమి ఒకప్రక్క ఉన్నాయి. “ సత్యం , అహింసలకోసం పోరాడే తన వంటివారు ఉండేందుకు ఈ ఆశ్రమం సరిఐనదేనని, దీనికి ఒక ప్రక్క విదేశీ పాలకులు, జైళ్లు, మరొక ప్రక్క ప్రకృతి సిద్ధమైన మనిషి ఆఖరి మజిలీ ఉండటమనేది సరిగానే ఒప్పిందని, ఈ రెండింటిలో మనిషి ఏదో ఒకవైపుకి వెళ్లక తప్పదని” గాంధీ అనేవారట.
ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని ఒక మ్యూజియం గా ‘ గాంధీ స్మారక సంగ్రహాలయం’ గా తీర్చిదిద్దేరు. 1963 లో చార్లెస్ కొరియా అనే విదేశస్థుడు ఈ మ్యూజియాన్ని రూపకల్పన చేశారు . ఇక్కడ‘నందిని’ అనే గెస్ట్ హౌస్ లో దేశ విదేశ సందర్శకులు బస చేస్తూంటారు. వినోబా నివసించిన కుటీరం కూడా ఉందిక్కడ. ప్రార్ధనా స్థలం ఆశ్రమంలో ఆరుబయలు ప్రదేశంలో ఉంది. ఇక్కడ గాంధీజీ కజిన్ మగన్ లాల్ నివసించిన ఒక తాటాకుల తో నిర్మించబడిన గది కూడా ఉంది. మగన్ లాల్ ని గాంధీజీ ఆఆశ్రమానికి ఆత్మ గా పిలిచేవారు. మ్యూజియమ్ లో ‘ మై లైఫ్ ఈజ్ మై మెస్సేజ్ ‘ గ్యాలరీ లో అనేక ఫోటోలు, పుస్తకాలు, కొటేషన్లు,గాంధీజీ ఉత్తరాలు, ఆయన హరిజన్ వంటి వివిధ పత్రికలకి రాసిన వ్యాసాలు భద్రపరచబడి ఉన్నాయి. సంవత్సరానికి దాదాపు ఏడు లక్షలమంది సందర్శకులు వస్తారని చెప్పారు. ఆశ్రమం ప్రొద్దున్న 8 నుండి సాయంత్రం 7వరకూ తెరిచి ఉంటుంది. ఇక్కడ ఆశ్రమంలో 90 నిముషాలపాటు వాకింగ్ టూర్ కూడా నడుపుతున్నారు. ఆశ్రమ నిర్వాకుల నుండి ముందుగా అనుమతి పొంది ఈ ఏర్పాటును చేసుకోవచ్చు.
అహ్మదాబాద్ లో అనేక బట్టల మిల్లులు ఉండటంతో దీనిని మాంఛెస్టర్ ఆఫ్ ఇండియా గా పిలుస్తారు. ఇక్కడ మద్యపాన నిషేధం అమలులో ఉండటం వలన దేశంలోనే ఆడవాళ్లకి భద్రత కలిగిన నగరంగా చెబుతారు. నగరమంతా ‘ఖా గలీస్’ అని పిలవబడే వీధుల్లో కనిపించే తినుబండారాల కూడళ్ళు మంచి ప్రమాణాల్నిపాటిస్తాయని చెప్పారు. ఇక్కడ పిజ్జా హట్ శాఖాహారపు పిజ్జాను ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ఇక్కడ దేశంలోనే మొదటిదైన రివాల్వింగ్ రెస్టోరెంట్ ‘పతంగ్’ ని చూడవచ్చు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఇక్కడ బి.ఆర్.టి.ఎస్. బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇక్కడ వారికి క్రికెట్ చాలా ఇష్టమైన ఆట. క్రికెట్ ఆటకొరకు సర్దార్ పటేల్ స్టేడియమ్ ఉంది. 2010 సంవత్సరపు ఫోర్బ్స్ లిస్ట్ గణాంకాల ప్రకారం ఈ దశాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృధ్ధి చెందుతున్న నగరాల్లో అహ్మదాబాద్ మూడవది. అనేక ప్రముఖ విద్యాలయాలకు ఇది వేదిక. మేము ఈ నగరంలో ఉన్నప్పుడు మల్టీప్లెక్స్ లో నడుస్తున్న ‘బాహుబలి’ చిత్రానికి విపరీతమైన ఆదరణ ఉండటం చూసాము.
Continued in Part IV
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part IV – ద్వైతాద్వైతం
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part IV – ద్వైతాద్వైతం
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part II – ద్వైతాద్వైతం
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part II – ద్వైతాద్వైతం
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike