* * *
Continued from Part I
భారత దేశంలో ప్రభుత్వం గుర్తించిన 12 సాంస్కృతిక వారసత్వ నగరాల్లో ద్వారక ఒకటి. ద్వారక అంటే (గేట్ వే) ముఖ ద్వారం. ద్వార్ అంటే ద్వారం, క అంటే బ్రహ్మ. ద్వారక అంటే ‘స్వర్గానికి ముఖ ద్వారము’. ఈ గుడిలో కృష్ణభక్తురాలు మీరాబాయి కృష్ణుడిలో ఐక్యం అయిందని చెబుతారు. ద్వారకలోని ప్రధాన ఆలయం ద్వారకాధీషుడి దేవాలయం. దీనిని ‘జగత్ మందిర్’ లేదా ‘నిజ మందిర్’ అనికూడా అంటారు. అంటే ప్రపంచానికే దేవాలయం. ఇది అతి ప్రాచీన వైష్ణవ ఆలయం. ఈ గుడి మొదటగా 2,500 సంవత్సరాలు క్రితం కట్టబడింది. కాని దండయత్రలతో పూర్తిగా ధ్వంసమైపోయింది. తిరిగి 16వ శతాబ్దంలో కట్టబడింది. 72 స్థంభాల మీద కట్టబడిన ఐదు అంతస్థుల కట్టడం ఇది. ఈ దేవాలయానికి మోక్ష ద్వారమని పిలిచే ముఖ్యద్వారము, స్వర్గద్వారమని పిలిచే మరొక ద్వారము ఉన్నాయి. మోక్షద్వారం గుండా దేవాలయం లోపలికి వెళ్లి, స్వర్గ ద్వారం గుండా బయటకు రావలసి ఉంటుంది. స్వర్గద్వారం నుండి మరొకవైపుగా 56 మెట్లు దిగి గోమతి నది ఒడ్డుకు చేరవచ్చు. ముఖ్యద్వారం నుండి దేవాలయం బయటకు వచ్చినట్లైతే అది పట్టణంలోని మార్కెట్టుకు దారితీస్తుంది.
ఈ దేవాలయం 256 అడుగుల ఎత్తు కలిగిన నిర్మాణం. ఇది ఈ ప్రాంతాల్లో విస్తారంగా దొరికే సున్నపురాయి, ఇసుకలను ఎక్కువగా ఉపయోగించి నిర్మించబడింది. దేవాలయం శిఖరం పైన సూర్యుడు, చంద్రుడు గుర్తులుగా ఉన్న ఒక 50 అడుగుల ముక్కోణపు ఆకారం కలిగిన జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్నపెద్దజెండా ద్వారకాధీశుని దేవాలయానికి మిగిలిన అన్ని దేవాలయాలకంటే ఒక ప్రత్యేకతను ఇస్తోంది. ప్రతిరోజు ఈ జెండాను 4సార్లు మార్చటం జరుగుతుంది. దీనికి కావలసిన విరాళాలు భక్తులనుండి భారీగా అందుతుంటాయి. ఈ ఆలయ శిల్పం చూసేవారిని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఎంత చూసినా తనివితీరని సౌందర్యం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ దేవాలయం హిందువులకి మాత్రమే ప్రవేశం కల్పిస్తూంది. శంకరాచార్యులు ఈ దేవాలయాన్ని సందర్శించిన గుర్తుగా దేవాలయం లోపల గోడలపైన శంకరాచార్య జీవితాన్ని ప్రతిబింబిస్తూన్న చిత్రాలు ఉన్నాయి. దేవాలయపు బురుజు పైన శివుణ్ణి రకరకాల భంగిమల్లో చిత్రించటం చూస్తాం. ఆదిశంకరాచార్యులు ఏర్పాటుచేసిన 4 శారదాపీఠాల్లో ఒకటి ఇక్కడ ఉంది. ద్వారకలో శారదా పీఠం దేశంలో సంస్కృత భాషమీద జరిపే పరిశోధనకు ముఖ్యమైన వేదిక.
రోజుకి మూడు సార్లు ద్వారకాధీశుడికి ఆరతి ఇస్తారు. ఆ సాయంత్రం 7గంటల సమయంలో ఇచ్చిన ఆరతి ఆలయ ప్రాంగణమంతా దద్దరిల్లే వాయిద్య ఘోష మధ్య మేము చూసేము. ఆస్తికులు కాని వాళ్లు కూడా ఇలాటి ఒక అనుభవం ఆస్వాదించగలరు. సూర్యాస్తమయ సమయంలో ఆ దేవాలయ శోభ వర్ణించ శక్యం కాదు. మనలను బాహ్య ప్రపంచం నుండి దిగంతాల కావల ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది ఆ వాతావరణం. అక్కడ వచ్చిన యాత్రీకులు చాలా భాగం ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల వారే కావటం విశేషం అనిపించింది. బహుశా ఇక్కడి పర్యటనకి జూలై నెల సీజన్ కాకపోవటం దానికి కారణం కావచ్చు. దేవాలయం చాలా విశాలమైనది. ఈ ప్రాంతం పశ్చిమ దిక్కున ఉండటంతో సూర్యాస్తమయం చాలా ఆలస్యంగా ఏడు – ఏడున్నర మధ్య జరుగుతుంది.
ఈ దేవాలయంలోని ద్వారకాధీశుని విగ్రహం గురించిన ఒక కథ ప్రచారంలో ఉంది. ’ బదన’ అనే ఒక వృధ్ధ భక్తురాలు కోరిక మీద కృష్ణుడు గర్భగుడిలోనుండి మాయమై, ఆమె వెంట వెళ్లిపోవటంతో అక్కడి అర్చకులు ఆమెపై దొంగతనాన్నిఆపాదిస్తారు. కానీ ఆమె నిర్దోషి అని, తాను మరొక విగ్రహ రూపంలో ఫలానా రోజున, ఫలానా చోట దొరుకుతానని కృష్ణుడు అర్చకులతో చెబుతాడు. కానీ అర్చకులు ఆ రోజు వరకు ఆగలేక ముందుగానే విగ్రహం కొరకు ప్రయత్నించి చూడగా, అక్కడ పూర్తి కాని విగ్రహం ఒకటి దొరుకుతుంది. అదే ఇప్పుడు ద్వారకలో పూజలందుకుంటున్న విగ్రహం. నాలుగు చేతులతో ఇక్కడ ద్వారకాధీశుడి విగ్రహం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో దేవకి, బలరాముడు, శివుడు,రాధ, సత్య భామ, లక్ష్మి మొదలగు ఇతర దేవతల ఆలయాల్ని కూడా చూస్తాం. 1983-1990 సంవత్సరాల మధ్య ఆర్కిలాజికల్ సర్వే వారి త్రవ్వకాలలో పూర్వపు ఆలయాల తాలూకు ఆనవాళ్లు, నిధి నిక్షేపాలు దొరికినట్లు చెబుతారు. ద్వారకలో జన్మాష్టమి ముఖ్యమైన పండుగ. ఆ రోజు ఉట్టి కొట్టడం అనే సంప్రదాయాన్ని స్థానిక యువకులు అత్యంత వేడుకగా జరుపుకుంటారు. ఇదే సంప్రదాయాన్ని జన్మాష్టమి నాడు దేశం నలుమూలలా ఒక పండుగ వాతావరణం మధ్య జరుపుకోవటం ప్రతిసంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం.మర్నాడు ప్రొద్దున్నే బయలుదేరి ద్వారక నుండి దాదాపు 20కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగేశ్వరం వెళ్ళేం. అది భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అని చెప్పారు. ఈ ఆలయం ప్రముఖ సినీ నిర్మాత, టిప్స్ ఆడియో అధినేత దివంగత ‘గుల్షన్ కుమార్’ చేతుల మీదుగా పునరుధ్ధరింపబడింది. అతి పెద్దదైన శివుడి ప్రతిమ ఆలయ ఆవరణలో ఉంది. గర్భ గుడిలో పార్వతీ సమేతుడైన శివుడు లింగాకారంలో దర్శన మిస్తాడు. శని దేవుడి ఆలయం కూడా ఈ ప్రాంగణం లో ఉంది. దేవాలయ ప్రాంగణం విశాలంగా ఉంది. వేల సంఖ్యలో పావురాలు దేవాలయ ప్రాంగణంలో కనిపించాయి. మా యాత్ర పొడవునా అనేక చోట్ల వివిధ సమయాల్లో పావురాలు తినేందుకు గింజలను అందిస్తున్న ప్రజలు, వాటిని తినేందుకు వందల, వేల సంఖ్యలో వచ్చివాలే పావురాలు కనిపించాయి. ఇక్కడ ఆలయం వెలుపల చిన్నచిన్న ఒకటి రెండు దుకాణాలు మాత్రం ఉన్నాయి. వచ్చేపోయే యాత్రికులతోనూ, వాహనాలతోనూ ఈ ప్రాంతం రద్దీగా ఉంది.
‘గోపీ తాలాబ్ ’ అనే సరస్సు ద్వారకకి పశ్చిమంగా ఉంది. ఇది కృష్ణుడితో గోపికలు రాసలీలలు జరిపిన స్థలంగా చెబుతారు. ఇక్కడ కూడా యాత్రీకులందరూ స్థానికులే. ఇక్కడి దేవాలయంలో పునరుధ్ధరణ పనులు జరుగుతున్నాయి. రాధా కృష్ణుల విగ్రహాలకు పూజాదికాలు జరుగుతున్నాయి. దేవాలయం వెలుపల ‘నాస్తా తయార్ ‘ అంటూ యాత్రికులని ఆహ్వానిస్తూ కొందరు చిరు దుకాణదారులు ఎదురయ్యారు. వారు జలేబీ, పాపడ్, పోహా రోడ్డు ప్రక్కన తయారుచేస్తూ కనిపించారు.ద్వారకాధీషుని దేవాలయం కాకుండా, అసలు ద్వారక ‘బెట్ ద్వారక ‘ అనే పేరుతో ద్వారక కి ఉత్తరంగా ఉన్న ఒక ద్వీపంలో ఉంది. ద్వారక రేవు అభివృధ్ధి చెందక ముందు ఈ బెట్ ద్వారక రేవు పట్టణంగా ఉండేది. శ్రీకృష్ణుని రాజధాని నగరం ద్వారకగానూ, ఆయన నివసించిన స్థలం బెట్ ద్వారకగానూ చెబుతారు. బెట్ ద్వారక కి వెళ్ళేందుకు అరేబియా సముద్రం మీద లాంచిలో ఒక 40 నిముషాలు ప్రయాణం చెయ్యవలసి ఉంటుంది. ఈ లాంచిలను ఎక్కవలసిన ప్రాంతం ఓఖా. భక్తులు బెట్ ద్వారక లోని ఆలయంలో పళ్లు, పువ్వులు బదులుగా బియ్యాన్ని సమర్పిస్తారు. ఇక్కడ కృష్ణుడు సుదాముడికి బియ్యాన్ని ఇచ్చిన గుర్తుగా ఈ సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఇక్కడి దేవాలయంలో రాధా కృష్ణుల దేవాలయాలతో పాటు శివ, విష్ణు, హనుమ ఆలయాలు కూడా ఉన్నాయి. యాత్రీకులని బెట్ ద్వారక ద్వీపానికి 10 లేదా 20 రూపాయల రుసుముతో నిరంతరంగా లాంచిలు చేరవేస్తూనే ఉంటాయి. ఇక్కడ ‘గోపీచందన’ అనే సరస్సుకూడా ఉంది. ఈ సరస్సులోని మట్టి అతి మృదువుగా, పసుపు రంగులో ఉండి సువాసన భరితంగా ఉంటుందని, దానిని పవిత్రమైనదిగా భావించి ఇక్కడివారు నుదుట ధరిస్తారని చెప్పేరు.
ద్వారకలోని రుక్మిణి దేవి దేవాలయం ప్రసిధ్ధమైనది. దీనిని ‘రుక్షమని దేవి’ ఆలయమని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం భగీరథి నదీ ఒడ్డున నిర్మించిన పాలరాతి కట్టడం. రుక్మిణీ దేవి నాలుగు చేతులతో ఉండి శంఖం, చక్రం, గద మరియు పద్మం కలిగి ఉంటుంది. లక్ష్మిదేవి రుక్మిణీ దేవి అవతారంలో ఇక్కడ కొలువై ఉందని భక్తుల నమ్మకం. ఈ దేవాలయం ద్వారకకు ఉత్తరంగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణుడి దేవాలయం, రుక్మిణీ దేవాలయం దూర,దూరంగా ఉండటానికి గల కారణాన్నిఒక కథగా చెబుతారిక్కడ. ఒకసారి కృష్ణుడు,రుక్మిణిలు దూర్వాస మహాముని ని తమ ఇంటికి అతిథిగా ఆహ్వానించటంతో, దానికి సమ్మతిస్తూ ముని ఒక షరతు పెడతాడు. వారిద్దరూ రథం స్వయంగా నడిపి తనను తీసుకెళ్ళినట్లయితే వస్తానని ముని చెప్పటంతో దానికి వారు సిధ్ధపడతారు. రథం నడుపుతున్న సమయంలో రుక్మిణికి దాహం కావటంతో ఆమె కృష్ణుడిని మంచినీళ్లు అడుగుతుంది. ఆమె దాహం తీర్చేందుకు కృష్ణుడు తన కాలి బొటనవేలితో భూమిని తట్టినప్పుడు అక్కడ మంచినీటి జల ఏర్పడుతుంది. అదే భగీరథి నది. ఆ నీటితో రుక్మిణి దాహం తీరుతుంది. కాని దుర్వాసముని తానక్కడ అతిథిగా ఉన్నప్పటికీ ముందుగా తనకి మంచినీళ్లు కావాలా అని అడగలేదని రుక్మిణి, కృష్ణులపై కోపించి, పన్నెండు సంవత్సరాలు పాటు వారిని చెరొక చోటా ఉండమని శాపం ఇస్తాడు. అందువలనే ద్వారకాధీశమందిరం నుండి ఈ ఆలయం దూరంగా ఉంది అని చెబుతారు. కృష్ణుడు ఎక్కడైతే రుక్మిణికి మంచినీళ్లు ఇచ్చాడో అక్కడ ఈ దేవాలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో పితృదేవతలకోసం మంచినీళ్లు దానం చెయ్యడం పుణ్యలోకాలకు వెళ్లే మార్గమని, దానికి కనీసం అర్థ నూటపదహార్లు కాని అంతకంటే ఎక్కువకానీ డబ్బు కట్టి రసీదు తీసుకోమని అక్కడి అర్చకులు మైకులో విజ్ఞప్తి చెయ్యటం చూస్తాం. ఆ విరాళాలతో అక్కడికొచ్చే పక్షులకు, యాత్రీకులకు దేవాలయ నిర్వాహకులు త్రాగు నీటిని ఏర్పాటు చెయ్యటం జరుగుతుందని చెప్పారు.
ఇంకా ద్వారక లో స్వామి నారాయణ్ ఆలయం, గాయత్రి పీఠం, గోమతినది సముద్రంలో కలిసే సంగమ స్థలం, సముద్ర నారాయణ ఆలయం, లైట్ హౌస్ చూడదగ్గవి. ఈ సంగమ స్థలి దగ్గర యాత్రీకులే కాకుండా అక్కడి స్థానికులు సాయంత్రాలు వచ్చి కూర్చునేందుకు అనువైన ఒక విహార స్థలంగా తీర్చిదిద్దారు. గోమతి నది గంగా నదికి ఒక ఉపనది. ఇక్కడ భక్తులు స్నానం చేసేందుకు వీలుగా ఘాట్ల నిర్మాణం కూడా ఉంది. ఊరంతా అనేక చిన్నదేవాలయాలు ఉన్నాయి. ఒకచోట బ్రహ్మ గుడి, దాని ప్రక్కనే ఒక శిధిలావస్థలో ఉన్న దిగుడుబావి ఎలాటి గుర్తింపు లేకుండా కనిపించాయి. వాటి చారిత్రక ప్రాముఖ్యత ఏమిటో తెలిపే గుర్తులే లేవు. వాటికి పోషణా లేదు. ఇంకా అనేక ప్రాచీన దేవాలయాలు సముద్రపు ఒడ్డున ఎలాటి పోషణ లేకుండా అనామకంగా వదిలి వేయబడి ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన శిల్ప సౌందర్యంతో మెరిసిపోతున్నాయి. సముద్రతీరం వెంబడి ఉప్పు తయారీని చూడవచ్చు. టాటా కంపెనీ ఉప్పు తయారీ కర్మాగారం, టాటా విద్యుత్తు కర్మాగారం ఇక్కడివారికి ఉపాధి నిస్తున్నాయి. ఇక్కడి సిమెంటు ఫ్యాక్టరీ కూడా అనేక మందికి ఉపాధి ని కల్పిస్తోంది. అవే కాకుండా నూనె గింజలు, జొన్నలు, నెయ్యి, సిమెంట్, మొదలైనవి ఇక్కడి రేవు నుండి రవాణా అవుతుండటంతో ఆ రంగం కూడా మరింత మందికి జీవనోపాధినిస్తోంది.
యాత్రీకుల హడావుడి మినహా పట్టణం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడివారికి యాత్రీకులే ముఖ్య ఆదాయ వనరు అని క్యాబ్ డ్రైవరు చెప్పాడు. గుజరాత్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఉండటంతో ఈ ప్రాంతంలో మద్యం దుకాణాలు ఎక్కడా కనిపించవు. ప్రముఖ యాత్రా స్థలం కావటంతో మాంసాహారం కూడా పబ్లిగ్గా ఎక్కడా తినరని క్యాబ్ డ్రైవరు చెప్పేడు. ఒఖా ప్రాంతంలోమాత్రం కొన్నిచోట్ల మాంసాహారం దొరుకుతుందని, ముఖ్యంగా చేపలు తింటారని చెప్పేడు. ద్వారకలో సాయంత్రాలు ఆ రోడ్ల వెంట తిరుగుతూ కంటికి కనిపించిన పురాతన దేవాలయాలను , ఆ పల్లె పట్నం కాని ఊరిని, ఆ ప్రజలని చూస్తూంటే చాలా ప్రశాంతంగా అనిపించింది.
ఎక్కడా ఎలాటి వేగం లేని జీవితాలు. రోడ్లమీద పరిచయస్థులను ఆప్యాయంగా పలుకరించుకునే తీరిక ఉన్నసాధారణ మనుషులున్న ప్రాంతం . నేటి బాహ్య ప్రపంచపు వేగం, నాగరికతలకు దూరంగా ఉంది. దేశానికి ఎక్కడో ఓ మూలగా ప్రపంచ ప్రఖ్యాతమైన, అతి ప్రాచీన మైన అద్భుత దేవాలయానికి కేంద్రంగా ఉండి , అనేక సందర్శకులను నిత్యం ఆకర్షిస్తూ కూడా అతి నిరాడంబరంగా కనిపించింది . నాకైతే మన వర్తమాన జీవితాల్లోంచి జారిపోయిందనిపించే ఇలాటి జీవితం ఒకటి ఇంకా పదిలంగా ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషం కలిగింది. ఇక్కడ బజారులో పాలకేంద్రాలు ఎక్కువగా కనిపించాయి. పాలును మరగబెడుతూ ఉన్న ఒక దుకాణంలోకి వెళ్లి త్రాగేందుకు పాలు కావాలని అడిగినప్పుడు, ‘పాలు మాత్రమే ఉన్న్నాయి, పంచదార లేదు’ అని మొహమాటంగా నవ్వి ఒక గ్లాసు చిక్కని పాలు మీగడతో సహా ఇచ్చేడా దుకాణదారు. ఆపాలల్లో అసలు పంచదార అక్కర్లేదని కమ్మని ఆ పాలు త్రాగిన తరువాత తెలిసింది. ద్వారక నుండి 6 కిలోమీటర్ల దూరంలో హనుమాన్ దండి దేవాలయం ఉంది. ఇది చిన్న దేవాలయమే కాని ప్రజలకి ఎక్కువ నమ్మకం ఉన్న దేవాలయం.
Continued in Part III
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part I – ద్వైతాద్వైతం
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part III – ద్వైతాద్వైతం
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part I – ద్వైతాద్వైతం
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part I – ద్వైతాద్వైతం
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part III – ద్వైతాద్వైతం
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike