భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part I

* * *

IMG-20170529-WA0014

ఇటీవల కాలంలో అంటే దాదాపు గత పదేళ్లుగా మన దేశంలో పర్యాటకం బాగా అభివృధ్ధి చెందుతోంది. దేశంలోని ఏమూల  ఉన్న పర్యాటక ప్రదేశంలోనైనా ఎక్కువగా మన ఆంధ్రా వాళ్లు కనిపిస్తూ ఉంటారని నా ఉత్తరాది స్నేహితురాలు నన్ను ఆట పట్టిస్తోంది కూడా. నిజమే. ఒక కుటుంబంలోని వారో, లేదా స్నేహితులతోనో, బంధువులతోనో కలిసి కొన్ని కుటుంబాలుగానో లేదా ప్రభుత్వ పర్యాటక శాఖ కానీ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు నిర్వహించే టూరు ప్రోగ్రాముల్లోకానీ  మన వాళ్లు ఎక్కువగానే పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పచ్చు. ఇదివరకటిలా ఉన్న చోటికే పరిమితమవకుండా ఇలాటి యాత్రలు చేస్తున్నారన్నది నిజంగా గర్వించదగ్గ విషయం. ఇది అభిలషణీయమైన మార్పు. ఎందుకంటే యాత్ర చేసిన వారికి ఎనలేని ప్రపంచానుభవాన్ని అందించటంతో పాటు, ఈ యాత్రలు ప్రభుత్వాలకి, ఆయా ప్రాంతాల్లోని స్థానికులకి ఆదాయాన్ని సంపాదించి పెడతాయి.

ఒక ఉపఖండంగా పిలిచే మనదేశం భిన్న సంస్కృతులకి కూడలి. దేశం గురించిన ఎన్నో వార్తలు, విశేషాలు రేడియో ద్వారానో, టి.వి. లేదా ఇంటర్నెట్ ద్వారానో నిత్యం మనకు తెలుస్తూనే ఉంటాయి. కానీ స్వయంగా చూసి రావడం వలన ఆయా ప్రాంతాల్లోని జీవన వైవిధ్యం తెలుస్తుంది. ప్రపంచం ఒక గ్లోబల్ విలేజీగా మారిపోయిందనుకునే ఈ సమయంలో ఇలాటి పర్యటనలు మరింత అవసరం, సులభం కూడా. వీటి వలన దైనందిన జీవితాల్లోని యాంత్రికతను వదిలించుకోవచ్చు.

ఇప్పుడు వాయవ్య భారతం కబుర్లు చెప్పుకుందాం. యాత్ర గురించిన కబుర్లు మీతో పంచుకునే ముందు ఒక్కసారి మనమంతా బాల్యంలోకి వెళ్లొద్దాము. మనలో చాలామందికి కథలంటే ఇష్టం ఉంటుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనమందరం కూడా నానమ్మనో, తాతయ్యనో, అమ్మమ్మనో కథ చెప్పమంటూ విసిగించి మరీ చెప్పించుకుని ఆనందించినవాళ్లమే. ఇలా చెప్పించు కున్న కథల్లో ముఖ్యమైనవి‘అనగనగా ఒక రాజు ‘ కథలే. రాజులు, రాణులు, కోటలు, యుద్ధాలు, సైన్యం ఇలా రాజుల గురించిన కథల్లో వైభవోపేతమైన, అద్భుతమైన, సాహసోపేతమైన దృశ్యాలను మన కళ్లముందు ఆవిష్కరింపచేసి, ఈ కథలు మనలని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళేపోయేవి. మనం చిన్నప్పుడు చందమామలో చదివిన కథలు ఎక్కువగా ఇవే కదూ. ప్రముఖ రచయిత దివంగత దాసరి సుబ్రహ్మణ్యంగారు ఇలాటి కథలతోనే అనేకవేల మంది పాఠకులను ఆత్మీయులను చేసుకున్నారు.

మనమంతా  మన పిల్లల్ని దగ్గరకి తీసుకున్నప్పుడు, వాళ్లను ముద్దు చేసేప్పుడు నా బిడ్డ మహారాజు అనో, మహా రాణి అనో చెప్పుకుని మురిసిపోతాం. అంత వైభవంగా పెంచాలని, అదే గొప్ప ప్రామాణికత అని అనుకుంటాం కూడా. మన జీవితాల్లో ఇంత ప్రాముఖ్యమున్న ఈ రాజుల, రాణుల కబుర్లు ఇప్పుడు ప్రస్తావిస్తున్న కారణం చరిత్ర పుటల్లో మిగిలిపోయిన అనేకమంది రాజులు, వర్తమానంలో వారు మనకు మిగిల్చివెళ్లిన కోటలు, రాజప్రాసాదాలు, వారి ఆనాటి జీవిత విధానం వివరించే పురావస్తుశాలు ఇటీవల యాత్రలో కొంతవరకు చూసిరావటమే. భారతదేశ వాయవ్య రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్ లలో ఎన్నుకున్న కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు ఒక పన్నెండు రోజుల పాటు ఒక యాత్ర ను సిధ్ధం చేసుకున్నాం. రైలు టిక్కేట్లు, వసతి గురించి ఏర్పాటైతే చేసుకున్నాం కాని ఈ ప్రాంతాల సందర్శనకు జూలై నెల అంతగా అనుకూలమైనది కాదని తెలిసి కూడా బయలుదేరేం. పరిమిత స్థలాలని హడావుడి లేకుండా తీరిగ్గా చూసేందుకు నిర్ణయించుకున్నాం. సందర్శించిన ప్రాంతాల్లో స్థానికులలాగా వారితో కలిసి గడపాలన్నదే ప్రధానంగా మేము అనుకున్నది.

OLYMPUS DIGITAL CAMERA

గుజరాత్ అనగానే మన జాతిపిత గాంధి జన్మించిన రాష్ట్రంగా జ్ఞాపకం వస్తుంది. ఇంకా మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ స్వంత రాష్ట్రం అన్న విషయం కూడా స్ఫురిస్తుంది. గుజరాత్ రాష్ట్ర పర్యాటక శాఖకి ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత బిలియర్డ్స్ చాంపియన్ గీత్ సేథీ ఇక్కడివాడే. రచయితగా మన తెలుగువారందరికీ  పరిచయమున్న శ్రీ ఎ.జి.కృష్ణమూర్తిగారు ముద్ర కమ్యూనికేషన్స్ అనే ఎడ్వర్టైజింగ్ సంస్థ ను స్థాపించి, ప్రపంచ ప్రఖ్యాత సంస్థగా అభివృధ్ధి చేసింది గుజరాత్ నుంచే. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తూ దేశమంతా విస్తరించిన రెలియన్స్ సంస్థ అధినేత ధీరూబాయి అంబానీ ఇక్కడివాడే. ఇక్కడ అక్షరాస్యత దాదాపు ఎనభై శాతం. ఈ సంపన్న రాష్ట్రం గురించిన ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గతం ఉంది. దాదాపు ఐదువేల సంవత్సరాలు క్రితం ఇక్కడ కచ్ జిల్లాలో సింధూలోయా నాగరికత వెల్లివిరిసిందని చరిత్ర చెబుతోంది. శతాబ్దాలుగా ఇతర దేశాలనుండి, ముఖ్యంగా……. మధ్య ఆసియా ప్రాంతాలనుండి ఎదుర్కొన్న దండయాత్రల తోనూ, పొరుగున ఉన్నమహరాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాలనుండి వచ్చిన వలసలతోనూ ఈ రాష్ట్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

ఇలా వచ్చిన వారంతా  ఇక్కడి సంపద కారణంగా వ్యాపార, వాణిజ్య నిమిత్తమో, సంపదను దోపిడీ చేసేందుకో వచ్చినవారే. ఇలా వచ్చినవారి ఈ భిన్నత్వం కారణంగానే గుజరాత్ అనేక రంగుల కలబోతలతో అందమైన రాష్ట్రమని పేరు తెచ్చుకుంది. అది ఇక్కడివారి వస్త్ర ధారణలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పురుషులు తెల్లని సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. స్త్రీలు స్థానికమైన ప్రత్యేక నేత, అద్దకపు పనితనంతో చేసిన రంగురంగుల చీరలతో, తలమీదుగా వేసుకున్న ముసుగులతో కనిపిస్తారు. అనేక జాతులు, తెగల ప్రజలతో వేరువేరు సంస్కృతులకి, సంప్రదాయాలకి, చరిత్రకి, కళలకి, భోజనాది విషయాలకి పట్టుకొమ్మై ఒక అద్భుతమైన సమ్మిళిత జనజీవన చైతన్యానికి ఇప్పటి గుజరాత్ సాక్షీభూతంగా నిలిచి ఉంది. భౌగోళికంగా కూడా ఈ రాష్ట్రంలోని ప్రాంతాలమధ్య చాలా వ్యత్యాసాలున్నాయి. ఈ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతాన తేమ వాతావరణం ,వాయవ్య ప్రాంతాన ఎడారి వాతావరణం ఉంటుంది. ‘ఆవో పధారో’ అన్న గుజరాతీ మాటల్లో వారికి అతిథుల పట్ల ఉన్న ఆదర,గౌరవాలు అర్థమవుతాయి. ఇక్కడ దేవాలయాలు, చారిత్రక ముఖ్య పట్టణాలు, అభయారణ్యాలు, శిల్ప కళలు, హస్త కళలు, పండుగలు ….ఒక్క టేమిటి, ఎన్నో విషయాల గురించిన తమ ప్రత్యేకతలను, వైవిధ్యాన్నిఈ రాష్ట్రం ప్రపంచానికి పరిచయం చేస్తోంది.

ఇక్కడి గిర్ అడవుల్లో మాత్రమే ఆసియా పులలను చూడవచ్చు. దేశంలోనే అతి పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉండటంతో ఇక్కడ పన్నెండు చిన్న రేవుపట్టణాలు, కాండ్లా లాటి ఒక పెద్ద రేవుపట్టణం ఉన్నాయి. ఈ రేవుల ద్వారా జరుగుతున్న వాణిజ్య, వ్యాపారాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి రూపురేఖల్ని, పుష్టిని ఇస్తున్నాయి. శిధిలమైన ఓడలను ధ్వంసం చేసే రేవు పట్టణం ‘కాంబే’ కూడా ఇక్కడ ఉంది. ఇలాటి సౌకర్యం చుట్టు ప్రక్కల ప్రాంతాలలో మరెక్కడా లేదు. మహారాష్ట్ర తరువాత దేశంలో రెండవ పెద్ద పారిశ్రామికాభివృధ్ధి కలిగిన రాష్ట్రం గుజరాత్. కేరళీయుడైన ‘డాక్టర్ వర్ఘీస్ కురియన్’  ‘వైట్ రెవల్యూషన్’  పేరుతో ఇక్కడ పాల ఉత్పత్తిని ఒక ఉద్యమ స్ఫూర్తితో అమితంగా అభివృధ్ధి చేశారు. ఇక్కడి పశు సంపదను పాల ఉత్పత్తి పెంచే దిశగా మళ్లీంచి ‘ఆనంద్’ పేరుతో పాల ఉత్పత్తి కి ఒక క్రొత్త చిరునామాను సృష్టించారు. మన దైనందిన జీవితాల్లో ఉపయోగించే  ‘అమూల్’ బ్రాండ్ పాలపదార్ధాలన్నీ ఇక్కడినుండే వస్తున్నాయి. గుజరాత్ వ్యవసాయం  ప్రధాన వృత్తిగా ఉన్న రాష్ట్రం. ఇంకా  మత్స్య పరిశ్రమ, నౌకా, రేవు మొదలైన పరిశ్రమలు అభివృధ్ధి చెందాయి. ఇక్కడ పెట్రోలియం నిల్వలు ఎక్కువగా లభ్యమవటంతో ఆయిల్ రిఫైనరీలు, కెమికల్ ఇంజనీరింగ్ పరిశ్రమలు అభివృధ్ధి చెందాయి. ఈ రాష్ట్రంలోని సూరత్ పట్టణం డైమండ్ కటింగ్ పరిశ్రమకి ప్రసిధ్ధి. ఇజ్రాయిల్ లోని డైమండ్ కటింగ్ పరిశ్రమకి ఇది గట్టి పోటీ ఇస్తోంది. ఇక్కడ ధోవతులపైన, చీరలపైన జరీ పని చేసే పరిశ్రమ కూడా ప్రపంచ ప్రసిధ్ధి చెందింది. సూరత్ పట్టణం దశాబ్దాలుగా చీరలకు అతి పెద్ద మార్కెట్ గా పేరుపొందింది.

యాత్రలోకి వెళ్లేముందు మా యాత్ర రూట్ మ్యాపు మీకు వివరిస్తాను. ముందుగా ద్వారక, అక్కడి నుండి రహదారి మార్గంలో పోరుబందరు, అక్కడినుండి మరింత దక్షిణంగా ప్రయాణించి సోమనాథ్ చూసుకుని, అహ్మదాబాదుకి ప్రయాణమయ్యాం. అక్కడినుండి గుజరాత్ కు వీడ్కోలు చెప్పి రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మేరు, పుష్కర్ లను చూసుకుని చివరగా జైపూర్ చేరుకున్నాం. అక్కడితో మాయాత్ర పూర్తి చేసుకు వెనక్కి వచ్చాం.

అనుకున్న ప్రకారం జూలై పన్నెండు రాత్రి పూరి-ఓఖా ఎక్స్ ప్రెస్ లో మా ప్రయాణం మొదలు పెట్టేం. విజయవాడకు ద్వారకకు మధ్య దూరం దాదాపు పంతొమ్మిదివందల కిలోమీటర్ల పైగా ఉంది. రైల్లో కూర్చుని విశాలమైన భారతాన్ని కళ్లముందు ప్రత్యక్షంగా చూడటం బావుంటుంది కదూ. అన్ని భాషలవారితోనూ ఒకే ఈజ్ తో మాట్లాడే చాయ్ వాలాలు, దక్షిణాది నుండి ప్రయాణిస్తున్న మనలాటి వారు హిందీ మాట్లాడటాన్ని ఇంకా క్రొత్తగా చూసే సహ ప్రయాణీకులు, భోజనం బావుండలేదనో, కాఫీ వేడిగా లేదనో కాలక్షేపంగా తగువులు పెట్టుకుని, రైల్వేక్యాంటీన్ ఉద్యోగులని వేధించే ప్రయాణీకులు….ఇలా రకరకాల మనస్తత్వాలవారిని  వారి వారి గమ్యాలను చేర్చేందుకు నిర్వికారంగా చక్రాలమీద పరుగులెత్తే రైలు ప్రయాణాలు ఎంత బావుంటాయి.! తామరాకు మీద నీటి బొట్టులా జీవించమనే సందేశాన్ని రైళ్లు మనకు అందిస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక మొదటి తరగతి ప్రయాణీకుడైతే రైల్వే అటెండెంట్ రాత్రి తనకు పక్క పరిచి సిధ్ధం చెయ్యలేదని అతని మీద రిపోర్ట్ చేసి, ఆ అటెండెంటును కొట్టినంత పని చేశాడు. పైగా ఇలాటి సౌకర్యాలకోసమే విమాన ప్రయాణాలు కాదని అంత ఖర్చూ పెట్టి రైళ్లలో ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చాడు. బ్రిటీష్ రాజ్ మనకు నేర్పిన దర్పం ఇది.

మా రైలు విజయవాడలో రాత్రి 12.15కి బయలుదేరింది . మన రైళ్ళు ఇదివరకటిలా కాకుండా సరైన సమయ పాలన చెయ్యటం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. కాని స్వచ్ఛ భారత్ నినాదం దేశమంతా మారు మ్రోగుతున్న ఈ సమయంలో కూడా మన రైళ్లు ఎలాటి శుభ్రతనీ పాటించకపోవటం నిజంగా బాధాకరం. ఇది స్లీపర్లకి మాత్రమే పరిమితం కాదు. ఎ.సి. కంపార్ట్మెంట్లూ ఇలాగే ఉంటున్నాయి. దీనికి బాధ్యత వహించవలసినది మాత్రం రైళ్లలో ప్రయాణిస్తున్న మనమే. చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందామన్న ఆలోచన, ఆచరణ మనలో ఏర్పడినప్పుడు  ఏనినాదాల చప్పుడూ అవసరం లేదు. యాత్ర మొదట్లోనే ఇలాటి ఒక అసంతృప్తి మంచిది కాదని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. నన్ను ఆవహించ బోయిన ఒక ఉదాశీనతను ప్రక్కకు పెట్టేసేను.

36 గంటల సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత నిర్ణీత సమయానికి ద్వారక లో దిగేం. ద్వారక మా మొదటి మజిలీ. మేము ఇటీవల చేస్తున్న ఈ యాత్రలన్నీంటిలోనూ చిన్న చిన్న ప్రయోగాలు చేస్తున్నాం. ద్వారక లో రెండు రోజుల పాటు ఉండేందుకు ప్రైవేటు హోటలు కాకుండా  గుజరాత్ పర్యాటక శాఖ వారి ‘తోరణ్’ గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నాం. ఇది గుజరాత్ లో అక్కడి పర్యాటక శాఖ అందిస్తున్న చెయిన్ గెస్ట్ హౌస్. సౌకర్యాలగురించి పెద్దగా ఎలాటి వూహలూ లేకుండా వెళ్లేం. కానీ మాకు ఆశ్చర్యాన్ని, ఆనం దాన్ని కలిగించేలా అక్కడ విశాలమైన గదులు, నిరంతరం వేడి నీళ్లు సౌకర్యం, ఎ.సి. లాటి సదుపాయాలే కాకుండా ఒక కిచెన్, కుక్ కూడా ఉన్నారు. శుభ్రత విషయంలోనూ చెప్పుకోదగ్గ వాతావరణం, ప్రమాణాలు కనిపించాయి. ముందుగా ఏర్పాటు చెయ్యమని చెబితే మనకు కావలసిన విధంగా కమ్మని భోజనం వండి పెడతారు కూడా. ఇక్కడ గడిపిన రెండు రోజులు ఇంట్లో తిన్నట్లే అనిపించింది. ఈ సదుపాయాన్ని మీరూ ప్రయత్నించవచ్చు. మన రాష్ట్రంలో కూడా ఇలాటి సదుపాయాలు లేకపోలేదు. ఇటీవల మా శ్రీశైలం యాత్రలో మన పర్యాటక శాఖవారు నడుపుతున్న గెస్ట్ హౌస్ లో ముందుగా వసతి ఏర్పాటు చేసుకున్నాం. విశాలమైన ఆవరణలో విశాలమైన ఎ.సి.గదులు, వేడినీటి సౌకర్యం అన్నీ ఉన్నాయి. కానీ భోజన సదుపాయం బాగాలేదు. ప్రమాణాల విషయంలో ఇంకా మనవాళ్లు చాలా జాగ్రత్త తీసుకోవలసి ఉంది. ముఖ్యంగా అలాటి చోట్ల ఇతర భోజన హోటళ్లు కూడా లేకపోవటంతో సందర్శకులకి చాలా ఇబ్బంది కలుగుతుంది.

OLYMPUS DIGITAL CAMERA

రైలు దిగీదిగంగానే అన్ని చోట్లా ఉన్నట్లే ఆటో వాలాలు కాస్త హడావుడి చేస్తారు. మమ్మల్ని స్టేషన్ నుండి గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళిన ఆటో అబ్బాయి ‘ఎమరూద్’ ని ఆరోజు సాయంత్రం వూరు చూబించేందుకు రమ్మని చెప్పేం. ద్వారక పట్టణం గుజరాత్ లోని ‘దేవభూమి ద్వారక’ అనే జిల్లాలో ఉన్న ఒక చిన్న మునిసిపాలిటీ. జనాభా 30-40 వేల వరకు ఉంటుంది. ఇది గోమతి నదికి ఉత్తర దిక్కున ఉంది. హిందువులకు దేశంలో నాలుగు దిక్కులా ఉన్న పవిత్ర చార్ధామ్ గా చెప్పబడే వాటిలో  మొదటిది, ప్రధానమైనది పశ్చిమాన ఉన్నద్వారక. మిగిలినవి ఉత్తరాన వారణాశీ, తూర్పున పూరి, దక్షిణాన రామేశ్వరం.

Continued in Part II

* * *

4 thoughts on “భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part I

  1. Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part II – ద్వైతాద్వైతం

  2. Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part II – ద్వైతాద్వైతం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.