* * *
కలలు మొలకెత్తిన మొన్నలేవీ ?
వాటిని నెమరేసిన నిన్నలేవీ ?
మట్టి పెళ్లల వెచ్చని ఒడిలో
ఒదిగి చూసే కలల కలవరింతల విత్తులేవీ ?
అస్తమయ సూర్యుడితో గుసగుస లాడుతున్నాయా ?
నాలుగు దిక్కులా చేతులు చాచి ,
భూమిని, ఆకాశాన్ని, పులుముకున్న మాయనీ ,
పలకరించే గాలినీ, ప్రవహించే మబ్బునీ ,
పరవశం గా చుట్టుకుని, లోవెలుగుల జాడల్ని వెతుక్కుంటున్నాయా ?
నిన్న నువ్వూ ఉన్నావ్, నేనూ ఉన్నాను !
నిలువెల్లా కలలూ ఉన్నాయ్ !
వేళ కాని వేళ విరిగి బ్రద్దలవకుండా ,
కనురెప్పల పహరాలున్నాయ్ !
అదాటున పొంగి పొరలిపోకుండా
నిరీక్షణ దడి కట్టే హద్దులున్నాయ్ !
తూరుపు వాకిలి చిమ్మిన కిరణం
లేకొమ్మకు చిగురును పూసి ,
ప్రకృతి రంగుల వన్నెలు పొదిగి
పరిమళాల సాంత్వన అద్ది
నిన్ను పలకరించే వాస్తవమయితే …
అదిగో మళ్లీ …
నా నిన్నలేవీ అంటున్నావా ?
వాటికి మరిన్ని హంగులు అద్దుతానంటావా ?
ఇంకా వాటితో పని ఉందంటావా ?
నిన్నలు రేపులై పోతే బావుణ్ణంటావా ?
మరి రేపటి కలలు చిన్నబోవా ?
చిన్నబోయే రేపటి కలలకి ఏం చెబుతావ్ ?