* * *
Continued from Part III
ప్రొద్దున్న 7.30 నుండి 10.30 వరకూ అనేక జీప్ సఫారిలు సందర్శకుల సంఖ్యను బట్టి వరుసగా బయలుదేరుతాయి. ఏనుగు సఫారి మాత్రం రోజుకు రెందు ట్రిప్ లు . ప్రొద్దున్న 5.15, 6.15 సమయాల్లో బయలుదేరుతాయి. ఒక గంట పాటు ఈ సఫారి సాగుతుంది. దీనికి చాలా డిమాండ్ ఉంది. ఒక్కో ఏనుగు మీద నలుగురు మాత్రమే ఎక్కే వీలుంది. టికెట్లు దొరకటం కొంచెం కష్టమే. మరుసటి రోజుకి కావాలంటే మాత్రం దొరకవు. ముందుగా వి.ఐ.పి. లకి, విదేశీ సందర్శకులకీ టికెట్లకోటా ప్రకారం అమ్మేస్తారు. మిగిలినవి కూడా అక్కడ కొందరు ముందుగా కొని బ్లాక్ లో అమ్మటం ఉంది. ఒక్కక్కరికి నాలుగు టికెట్లు ఇస్తారు. టికెట్టు ధర 425 రూపాయలు .ఏనుగు సఫారికి వెళ్ళాలంటే రెండురోజులు ముందుగా అక్కడికి చేరటం లేదా ఎవరిద్వారానైనా ముందుగా బుక్ చేసుకోవటం చెయ్యాలి.
జీప్ సఫారీకి వెళ్ళినప్పుడు ఆ రోడ్లు ఇసుకతో ఎగుడుదిగుడుగా అసౌకర్యంగా అనిపించాయి. వాటిని మరికాస్త సౌకర్యంగా మలచి సఫారీని మరింత సుఖవంతం చెయ్యాల్సిన అవసరం ఉంది.
జీప్ సఫారీ సమయంలో కళ్ల ఎదుటే రైనోలు తాపీగా నడిచి రోడ్ దాటడం చూసేము. ఈ సఫారీ దాదాపు మూడు గంటల సమయం పట్టింది.
ఈ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి రెండు నెలల కాలంలో ఇక్కడ 20 రైనోలను పోచర్లు చంపివేసారు. ఇలాటి సంఘటనల వలన ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా కనిపించే రైనోల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. పోచర్ల నుండి వీటిని కాపాడేందుకు కాజీరంగా పార్క్ చుట్టూ ఉన్న అడవిని కొంత మేరకు కాల్చి వేశారు.
దాని వలన పోచర్ల బారి నుండి జంతువులను రక్షించటం సంగతేమో కానీ పార్క్ లో ఉన్న జంతువులు, పక్షులు తమ ఆశ్రయాన్ని కోల్పోయే అవకాశం ఉందనిపించింది. ప్రభుత్వమూ, ప్రజలూ ఈ విలువైన పార్క్ ను , ఇక్కడి వన్య ప్రాణులనూ, మన వారసత్వ సంపదను కాపాడుకోవటంలో మరింత జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది.
కాజీరంగా లో రాత్రి బస చేసేందుకు అనేక హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ అస్సాం టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారి వసతి గృహం (‘అరణ్య టూరిస్ట్ లాడ్జి’ ) చక్కని వసతిని అందిస్తోంది. ఇక్కడ ఆర్డర్ మీద రుచికరమైన భోజనం , అదీ విజయవాడ ధరలతో పోల్చినప్పుడు అతి తక్కువ ధరలకి అందిస్తున్నారు.
సిక్కింతో సహా ఉన్న ఈ ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లోనూ కేవలం అస్సాం, మేఘాలయాలలో మాత్రం కొంత అభివృధ్ధి, దేశంలోని ఇతర ప్రాంతాలను కలిపే రవాణా సదుపాయాలు కనిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ రోడ్డు దారులను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. రైలు మార్గాలు మాత్రం ఇంకా అభివృధ్ధి కావలసి ఉంది.
ఈశాన్య రాష్ట్రాల్లో తూర్పున ఉన్నఅతి పెద్ద రాష్ట్రం అరుణా చల్ ప్రదేశ్. ఇక్కడికి చేరుకోవాలంటే ఇన్నాళ్ళూ కేవలం రోడ్డు మార్గం మాత్రమే ఉంది. పరిమితంగా విమాన సౌకర్యం ఉంది. 2015 , ఫిబ్రవరి 15 వ తేదీన ప్రధాని మోదీ మొదటిసారిగా న్యూదిల్లీ నుండి అరుణాచల్ ప్రదేశ్ లోని నహర్లాగున్ ప్రాంతానికి ఒక ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు . ఇది ఈ ప్రాంత అభివృధ్ధికి, ప్రత్యేకంగాఈశాన్య రాష్ట్రాల అభివృధ్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు.
మేము ఈ ప్రాంతాల్లో గడిపిన పదిరోజుల సమయంలో అస్సాం, మేఘాలయలలో ముందుగా నిర్ణయించుకున్న కొన్ని ప్రాంతాలను మాత్రమే దర్శించే వీలు కలిగింది. ఈశాన్య రాష్ట్రాలను పూర్తిగా శోధించి, వాటి అందాలను ఆస్వాదించాలంటే మరొకసారి కాదు , మరి కొన్నిసార్లు ఈ ప్రాంతానికి వెళ్లి రావాలని నిర్ణయించుకున్నాము.
ఇక్కడ ప్రాంతాల గురించి , ఆసక్తి కరమైన ఇక్కడి ప్రజల జీవిత విశేషాలు గురించి మిగిలిన భారతదేశానికి చాలా తెలియవలసి ఉంది. ఈప్రాంతాల ప్రజల జీవన వైవిధ్యాన్ని దగ్గరగా చూసేందుకు, వారిని భారతదేశపు జనజీవన స్రవంతిలో పూర్తిగా మమేకం చేసేందుకు, ఈ ప్రాంతాల సర్వతోముఖాభివృధ్ధికీ , ఇటు ప్రక్క టూరిజం ను ప్రోత్సాహపరచ వలసిన విధి ప్రభుత్వాలదే కాక, క్రొత్త ప్రదేశాలను చూడాలన్న సందర్శకులదీ కూడా. ఇక్కడికి వెళ్ళేందుకు ఎలాటి భయ సందేహాలు అక్కరలేదని మా యాత్ర అనుభవం చెప్పింది.
దేశ సరిహద్దుల్లో రక్షణ కవచంలా ఉన్న ఆ ప్రాంతాలు చూస్తున్నప్పుడు అక్కడి మన సైనిక మిత్రులు జ్ఞాపకం రాక మానరు. ఎప్పుడో ఒక పుష్కరం వెనుక ఒక సైనిక మిత్రుడి కోసం రాసి పంపిన ఒక కవితలోని కొన్ని పంక్తులు నా మనసులో ఈ క్షణాన మెదులుతున్నాయి……………….అవి వినిపిస్తాను…
“…………..విన్నాను నేస్తం, నీ మీదకో దిగులు మేఘం ఒరిగిందని,
మేఘాల దారుల్లో నిత్య ప్రయాణీకుడివి నీవు, ఈ దిగుళ్లు నిన్నేం చేస్తాయి?
బ్రహ్మపుత్ర నడకల మధ్య ఇన్ సర్జెన్సీ నీడలు, వెదురుపొదల నంటి చౌరసియా జాడలు,
అడుగడుగునా అమాయకపు గిరిజనులు, అందర్నీ కనిపెట్టి చూసే కామాఖ్య దేవి,
ఫాగ్ చుట్టుకున్న భూటాన్ కొండలు,చేతిలో నిత్యం నలిగే ఎకె ఫార్టీ సెవెన్!
నువ్వు నిక్షిప్తం చేసుకోవాలనుకున్న ఒక్కో జ్ఞాపకం!.. ఎన్ని, ఎన్నెన్నని ?
సైనికుడి హోదాలో తిరిగే నిన్ను వదిలి, నీ పాషణపు రూపు దాటి, నీ యెదనంటే ఉంటాయని తెలుసు .
నడిరాత్రి నిశ్శబ్దాన్ని పగలేసి, తాను పరుగెడుతూనే , నీ ఒంటరితనాన్ని నిలేసే ఆ రైలు!
దిగంతాని కావలగా పదిలంగా నిద్దరోయే నీ పల్లెవైపు వెళ్లనే వెళ్లదని తెలిసీ,
ఏవేవో ఊహాగానాలు తెల్లవార్లూ చేస్తావ్ !”
ఈ పంక్తులలోని వాస్తవం జ్ఞాపకం వస్తే కళ్లు చెమరించక మానవు.
అస్సాం లోకి వెళ్తున్నప్పుడు నిత్యం మనను దూరదర్శన్ ద్వారా పలకరించే ప్రముఖ జర్నలిస్ట్ అర్ణ బ్ గోస్వామి, ప్రముఖ కవి, గాయకుడు భూపేన్ హజారికా మనసులో మెదిలారు. అక్కడ ఎటుచూసినా వెదురుతో చేయబడిన వస్తువులు చూసినప్పుడు తన వేణునాదంతో మనలను మంత్ర ముగ్ధులను చేసే హరిప్రసాద్ చౌరసియా చేతిలోని వేణువు జ్ఞాపకం రాక మానదు.
పదిరోజుల యాత్ర ముగించుకుని వస్తూంటే ఆప్తులని వదిలి వస్తున్నట్లు అనిపించింది. రుడాలీ సినిమాలో భూపేన్ హజారికా రాసిన ‘దిల్ హూమ్ హూమ్ కరే’ పాటను అప్రయత్నంగానే మనసు పాడుకుంది. ఆ పదాలకి అర్థం ‘గుండెలోంచి ఎగశ్వాస వస్తోంది’అని. ఎందుకో తెలియని ఒక దిగులు, ఒక దుఃఖం, ఒక ఆరాటం కలిగింది.
ఈశాన్య రాష్ట్రాల గురించి ఇన్ని కబుర్లు విన్నారు కదా. మరి మనవే అయిన ఈప్రాంతాలను, అక్కడి ప్రజలను చూడాలని, అక్కడి ప్రకృతిని పచ్చదనాన్ని కళ్లారా చూసి మురిసిపోవాలని అనిపిస్తోందా? అటు వైపు చేసే యాత్రల వలన మనం పొందే ఆనందంతోపాటు ,అక్కడి ప్రజలకి జీవికని ఇచ్చి ప్రోత్సహించినవాళ్లం అవుతాము కూడా. భారత దేశపటంలో ఆ ఎనిమిది ఈశాన్యరాష్ట్రాల అభివృధ్ధిని ఈ తరంలో తప్పనిసరిగా మనమంతా చూడవలసి ఉంది.
The End
Pingback: ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part III – ద్వైతాద్వైతం
Pingback: భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – ద్వైతాద్వైతం
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike