* * *
దైనందిన జీవితాల్లోంచి బయటకు వచ్చి మనం నివసించే ప్ర్రాంతానికి దూరంగానో, దగ్గరగానో ఉన్న క్రొత్త ప్రదేశాలను చూసేందుకు మనలో చాలామంది ఆసక్తితో ఉంటాం. ఆ ప్రయాణాలు మొదలుపెట్టినప్పటినుండి తిరిగి ఇల్లు చేరేవరకు అనేక సంఘటనలు, సన్నివేశాలు ,అనేకానేక క్రొత్త వ్యక్తులు మనకు ఎదురై జీవితానికి క్రొత్త శక్తిని, ఉత్సాహాన్నిఇస్తాయి. అలాటి ఒక యాత్రలో ప్రకృతి ఒడిలోకి నేరుగా వెళ్లగలిగినప్పుడు ఆ యాత్ర పొడవునా మనం మనం కాకుండా పోతాం, తిరిగొచ్చేక మనజీవితం మనకళ్లకి కొత్త అందాలతో కనిపిస్తుంది.క్రొత్త అర్థాలను చెబుతుంది కూడా. ఇవన్నీ ఏ ఒక్కరికో పరిమితమైన భావనలు కావు. మనమంతా ఎప్పుడో ఒకప్పుడు ఇలాటి అనుభవాన్ని, అనుభూతులను పొందే ఉంటాం.
అలాటి విలువైన అనుభవాన్ని ఇచ్చిన ఒక యాత్ర గురించి ఇప్పుడు చెబుతాను. ఈ ప్రాంతం మనదేశంలోనే చాలా చాలా ప్రత్యేకమైనది. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను మొదటిసారిగా చూసేందుకు వెళ్తూ వారానికి ఒకసారి నడిచే చెన్నై-గౌహతి ఎక్స్ప్రెస్ లో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నాం. అది ఎయిర్ కన్డీషన్డ్ రైలు. పాంట్రీ కారు కూడా ఉంది . ప్రయాణంలో చదువుకుందుకు ఇష్టమైన పుస్తకాలు ఉన్నాయి. సుదీర్ఘమైన రైలు ప్రయాణాలు అంటే మరింత ఇష్టం ఉంది. ఇక ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో చెప్పక్కర్లేదుకదా.
ఈశాన్య రాష్ట్రాల వైపు బయలు దేరుతున్నామని చెప్పినప్పుడు కొందరు స్నేహితులు భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లటం సాహసం అవుతుందని, ఆ ప్రాంతాల్లో చేతిలో ఐ.డి . కార్డ్ లేకుండా కాలు బయట పెట్టలేమని చెప్పారు.
మేము విజయవాడ నుండి ప్రయాణించిన రైలు ముందునుండీ ఆలస్యంగా నడుస్తూ , గౌహతి చేరవలసిన సమయానికి దాదాపు 13 గంటలు ఆలస్యంగా చేరుకుంది. కాని ఆ ఆలస్యం వల్లనే రాత్రి కరిగిపోయి, పగటి పూట ప్రయాణంలో ఆ ప్రాంతాల్నివివరంగా చూసే అవకాశం దొరికింది. ప్రయాణం ఎక్కడా విసుగు రాలేదు. గౌహతి లో మమ్మల్ని రిసీవ్ చేసుకున్న లక్ష్మి, రమేష్ లు దాదాపు 48 గంటల ప్రయాణం తర్వాత కూడా తాజాగా రైలు దిగిన మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారు. కలకత్తా దాటిన తర్వాత రైలు చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత ప్రయాణమంతా రైలు ఆగి ఆగి నెమ్మదిగా నడిచింది. చుట్టూ విశాలమైన మైదానాలు, కొన్ని చోట్ల ఆకుపచ్చని పంట పొలాలు కంటికి విందుచేశాయి. పొలం పనుల్లో మునిగిన స్థానికులను చూస్తే క్రొత్తగా అనిపించలేదు.
విజయవాడ నుండి గౌహతి కి దాదాపు 2200 కిలోమీటర్ల దూరం ఉంది. దక్షిణాది ప్రాంతాలైన చెన్నై, బెంగలూరు,త్రివేండ్రం ల నుండి బయలుదేరే 11 రైళ్లు విజయవాడ మీదుగా గౌహతి చేరతాయి.
అస్సాం లోని గౌహతి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ బాగా అభివృద్ధి చెందిన నగరం. ఈ నగరానికి గౌహతి రైల్వే స్టేషన్ కాకుండా కామాఖ్య పేరుతో మరొక రైల్వే స్టేషన్ కూడా ఉంది. గౌహతిలో కొలువై ఉన్న కామాఖ్య అమ్మవారి పేరు మీద ఆ పేరు పెట్టబడింది. బ్రహ్మపుత్ర నది ఈ నగరాన్ని రెండు సమాన భాగాలు చేస్తూ ప్రవహిస్తోంది. నగర జనాభా 10 లక్షలు.
ఈ నగరం ఎలాటి ఆడంబరాలు, అట్టహాసాలు లేకుండా నిరాడంబరంగా, నిశ్శబ్దంగా ఉంది. అక్కడి ప్రజలు కూడా పలుచని, చిన్నవైన శరీరాకృతులతో నిరాడంబరంగా ఉన్నారు .
మేము అక్కడకి వెళ్లిన మార్చి నెల మొదటి వారం ఆ ప్రాంత సందర్శనకి అనువైన సమయం. అప్పుడప్పుడే చలి వదిలి ఆహ్లాద కరమైన వాతావరణం ఉంది. ఏప్రిల్ నెల నుండి వర్షాలు మొదలు అవుతాయి. జూన్, జూలై నెలలు అధిక వర్షపాతం, వరదలు ఉంటాయి.
ప్రపంచంలో అతి త్వరగా అభివృద్ధి చెందుతున్న వంద నగరాల్లో గౌహతి ఒకటి. అలాగే భారతదేశంలో అతి త్వరగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఐదవది. ఇది ఈశాన్య రాష్ట్రాలకి ముఖ ద్వారం గా చెబుతారు.
గౌహతికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో గౌహతిలోనే ఒకభాగంగా ఉన్న దిస్పూర్ ని రాజధానిగా అభివృద్ధి చేసేరు. అంతకుముందు రాజధాని గా ఉన్న షిల్లాంగ్ నగరం అస్సాం ప్రక్కనే ఏర్పడిన మేఘాలయ రాష్ట్రానికి రాజధానిగా మారటంతో 1973లో దిస్ పూర్ క్రొత్త రాజధానిగా ఏర్పాటైంది . అస్సాం ట్రంక్ రోడ్ దిస్పూర్ గుండా పోతుంది. అలాగే అస్సాం టీ ఆక్షన్ సెంటర్ కూడా దిస్పూర్ లోనే ఉంది. అస్సాం సెక్రటేరియట్, అసెంబ్లీ ఇక్కడే ఉన్నాయి.
ఊరంతా ఎత్తు పల్లాలతో ఉండి, వీధులన్నీ విశాఖ నగరంలోని ఆసిల్మెట్ట, సిరిపురం కాలనీలని జ్ఞప్తికి తెస్తాయి.ఇళ్ళు కొండలమీద ఉన్నట్లు ఉంటాయి. బహుళ అంతస్థుల అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇళ్ల వాకిళ్లలో పనస చెట్లు,అరటి చెట్లు, కరివేపాకు మొక్కలు కనిపిస్తాయి. ఇక్కడ వాళ్లకి కరివేపాకు వాడకం తెలియదు. ఇప్పుడిప్పుడు అక్కడున్న మనవాళ్లు చెప్పడంతో వాటిని వాడకంలోకి తెచ్చుకుంటున్నారు. కూరగాయల దుకాణాల్లో క్యారెట్,బీర, వంగ,క్యాబేజీ, బంగాళాదుంప, బీట్రూట్, టమాట ,ఆనపకాయ వంటి మనకు తెలిసిన కూరగాయలతో పాటు, పేరు తెలియని అనేక రకాల ఆకు కూరలు ఎక్కువగా కనిపిస్తాయి.
గౌహతికి ప్రాగ్జోతిషపురమనే పేరు కూడా ఉంది. దాని అర్థం ‘తూర్పు వెలుగు’ అని. ఇక్కడ సూర్యోదయాలు మన వైపు కంటే చాలా ముందుగా అవుతాయి. అలాగే శీతాకాలంలో సాయంత్రం 4.30 కి సూర్యాస్తమయం అయిపోయి చీకట్లు వ్యాపిస్తాయి.
గౌహతి నగరం మన తెలుగునేల మీద కనిపించే సాధారణ పట్టణంలా అనిపించింది. ఇక్కడ సందర్శకులకి ప్లానెటోరియం, స్టేట్ మ్యూజియం, సైన్స్ మ్యూజియం, రాజ్ భవన్ , శంకరదేవ్ కళాక్షేత్రం, కామాఖ్య దేవాలయం, ఉమానంద దేవాలయం, బాలాజీ దేవాలయం, వశిష్ట ఆశ్రమం, అంతర రాష్ట్ర బస్ టెర్మినస్, ఫ్యాన్సీ బజారు లాటి అనేక చూడదగిన ప్రదేశాలున్నాయి.
గౌహతిలో ప్రస్తుతం ఫ్యాన్సీ బజారుగా చలామణీ అవుతున్నది ముందుగా ఫాంసీ బజారు అన్న పేరు కలిగి ఉండేది.బ్రిటిష్ వారి కాలంలో నేరస్థులని ఇక్కడ ఉరితీసేవారు. అందువల్ల ఈ బజారు ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.కాల క్రమేణా అది ఫ్యాన్సీ బజారుగా మార్పు చెందింది.ఇక్కడ భవన నిర్మాణ వస్తువులు, హార్డ్ వేర్ వస్తువులు మొదలు ఇంకా అనేక రకాల వస్తువులు సరసమైన ధరలకి దొరుకుతాయి. నగరంలోని బ్రహ్మపుత్ర నదిని ఆనుకుని సాగిన ముఖ్య మైన రహదారి గుండా ప్రయాణించి, లంబకోణాకారంలో ప్రక్కకు మలుపు తిరిగితే చిన్నచిన్న సమాంతర గల్లీల్లో అతి సాధారణంగా కనిపించే ఈ బజారుని చూడవచ్చు.
గౌహతి నగరంలో కనిపించే బ్రహ్మపుత్ర నది మీద కట్టిన మొదటి బ్రిడ్జి సరయ్ ఘాట్ బ్రిడ్జి. ఇది రోడ్డు-రైలు మార్గాలతో ఏర్పాటైన వంతెన. 2008 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ వంతెన ఈశాన్య రాష్ట్రాలని ,మిగిలిన దేశంతో కలుపుతున్న అతి ముఖ్యమైన లింక్. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా ఇక్కడ ఫోటోలు తీసుకోనివ్వరు. వంతెన పొడవునా సైనికుల గస్తీ ఉంది. 4,895 అడుగుల పొడవుతో భారతదేశంలో నీటిపైన కట్టిన అతి పొడవైన వంతెన ఇది . ఈ వంతెన చాలా అందమైన నిర్మాణం. చూడంగానే హౌరా బ్రిడ్జిని జ్జ్ఞప్తికి తెస్తుంది. ఈ బ్రిడ్జి మీద నిరంతరం కదిలే ట్రాఫిక్ ను తట్టుకుందుకు దీని ప్రక్కనే సమాంతరంగా మరొక బ్రిడ్జి ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోకీ అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు అభివృధ్ధి పథంలో ఉన్నాయి . ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ దేశ రాజధానికి దూరంగా దేశానికి ఒక ప్రక్కగా ఉండటంచేతనో, పొరుగు దేశాల నుండి నిరంతరం వెల్లువెత్తే చొరబాటుదారుల వల్లనో, ఈ ప్రాంతాల జనాభాలో దాదాపు 28 శాతం గిరిజన జాతులు అవటం వల్లనో ,* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత శ్రధ్ధ తీసుకుని అభివృద్ధి చెయ్యటంలో చూబిస్తున్న అలసత్వం వల్లనో ఇక్కడి ప్రాంతాలు పేదరికంలో మగ్గుతున్నట్లు కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బిచ్చగాళ్ల సంఖ్య చాలా ఎక్కువ .
ఈశాన్య రాష్ట్రాల్లో విద్య్త్తుత్తు పుష్కలంగా ఉంది. వీరికి పవర్ కట్లు తెలియవు.
వ్యవసాయం, టీ తోటలు, పుష్కలంగా లభించే లైమ్ స్టోన్ సహాయంతో ఏర్పడిన సిమెంటు ఫ్యాక్టరీలు, చేతివృత్తులు,మగ్గం పనులు ఇక్కడ జీవనోపాధి అవకాశాలు కలిగిస్తున్నాయి. అస్సాం చేనేత, సిల్కు వస్త్రాలు నాణ్యమైనవిగా పేరుపొందాయి.
అనధికారంగా ఇక్కడికి చొచ్చుకువచ్చే సరిహద్దు దేశాల ప్రజల వలన వీరికున్నఅరకొర ఉపాధి అవకాశాలు కూడా మరింత తగ్గిపోతున్నాయి. దాని తాలూకు ఒక అశాంతి , అసహనం ఇక్కడి ప్రజల్లో కనిపిస్తూ ఉంది. సస్యశ్యామలమైన నేల, పుష్కలంగా జలవనరులు ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలకు బ్రతుకు నిత్యమూ పోరాటమే.ఇది వీరి జీవితాల్లో విషాదం.
బంగ్లాదేశ స్త్రీలు జీవనోపాధికోసం ఇళ్లల్లో పనిపాటలు చేస్తూ కనిపించారు.అక్కడ పరిచయమైన అలాటి ఒక స్త్రీ కొడుకు తనను పోషించకపోవటం వలన వయసు మళ్లిన తర్వాత కూడా పనులు చేసుకుని జీవించాల్సి వస్తోందని చెప్పింది. మేము బస చేసిన అపార్ట్మెంటు మెట్లు ఊడ్చేందుకు దాదాపు ఇరవై సంవత్సరాల వయసున్న అమ్మాయి తన నాలుగేళ్ల కొడుకుతో పనుల్లోకి వస్తూండేది. భర్త ఆమెని వదిలి వెళ్లిపోవటంతో ఇల్లు నడిపే బాధ్యత,పిల్లవాడి బాధ్యత పూర్తిగా ఆమెదే అని చెప్పింది.
ఇలాటివి విన్నప్పుడు మానవ సమాజానికి ఎల్లలు లేవని అర్థమైంది. ఎక్కడ చూసినా అవే జీవితాలు, అదే వేదన, అదే దోపిడీ,అదే పేదరికం.
స్థానికంగా ఉన్న అనేక రకాల తెగల మధ్య నిరంతరం వర్గపోరు జరుగుతూనే ఉంటుంది. అది కాకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకునే కొన్ని సమూహాలు కూడా ఇక్కడ జనస్రవంతిలో కలిసి జీవిస్తున్నప్పటికీ రహదారుల వెంట,కొండ దారుల వెంట ప్రయాణించే వాహనాల్ని ఆపి కొంత డబ్బు సేకరించటం అతి సాధారణ విషయంగా కనిపించింది. అలా సేకరించే డబ్బు వారి జీవికకి అవసరం అన్న అభిప్రాయంతో ప్రజలు కూడా వారికి సహకరిస్తున్నారన్నది అందరూ ఎరిగిన రహస్యమే.
వివిధ తెగల మధ్య ఉన్నట్టుండి మొదలయ్యే ఘర్షణలు ఇక్కడ సర్వ సాధారణం. మేము ఇక్కడ తిరిగిన సమయంలోనే నాగాలాండ్ లోని దీమాపూర్ లో ఒక అవాంచిత సంఘటన జరగటం, ఆ మర్నాడు అక్కడ, పొరుగున ఉన్న ప్రాంతాల్లోనూ కర్ఫ్యూ విధించటం జరిగింది.
ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపైన దేశంలోని ఇతర నగరాల్లో జరుగుతున్న దాడులు చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న వివిధ వర్గాల ప్రజల మధ్య కూడా భిన్న సంస్కృతీ సంప్రదాయాలు ,భిన్న జీవనశైలులు, భేదాభిప్రాయాలు, అంతర్గత ఘర్షణలు గమనించవచ్చు. పొరుగునే ఉన్న అస్సాం, మేఘాలయా రాష్ట్రాలలో హోలీ పండుగ ను వేర్వేరు దినాల్లో జరుపుకోవటం, వేర్వేరు దినాలు శెలవులుగా ప్రకటించటం చూశాము. *
గౌహతిలో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఐ.ఐ.టి. , మ్యానేజిమెంటు కళాశాల, అస్సాం యూనివర్సిటీ వగైరా అనేక విద్యాసంస్థలున్నాయి.కానీ విద్యార్ధుల హడావుడి మన వైపు నగరాల్లో లాగా ఎక్కడా కనిపించలేదు . నగరంలో మల్టిప్లెక్స్ లు లేవు. ఉద్యోగావకాశాలు తక్కువ. చాలా మంది చిన్నచిన్న వ్యాపారాలు నడుపుకుంటూ కనిపించారు. పెద్దపెద్ద బట్టల దుకాణాలు చాలావరకు పూర్వమెప్పుడో వచ్చి స్థిరపడిన మార్వాడీలు, ఉత్తరాది వారి యాజమాన్యంలో నడుస్తున్నవే.
గౌహతి వీధుల్లో నడుస్తున్నప్పుడు నగరాన్ని స్పృశిస్తూ, ప్రధాన రహదారికి సమాంతరంగా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర ను చూస్తే ఏదో తెలియని ఆత్మీయత కలిగింది. చిన్నప్పుడు తరగతి గదుల్లో విన్న భౌగోళిక పాఠాలు మనసులో మెదిలేయి. మన ప్రాంతాల్లోని వీధులలో తిరుగుతున్న భావం కలిగింది. ఇక్కడ ప్రజలు స్నేహ స్వభావులు. పలకరించినప్పుడు ఒక్క క్షణం క్రొత్త ముఖాలను తేరిపార చూసినా మృదువుగా సమాధానమిచ్చారు.
ఈశాన్య రాష్ట్రాలు పృకృతికి పుట్టిళ్లు. చుట్టూ అడవులు, జలపాతాలు, ఆకుపచ్చని లోయలు, వాటి అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ప్రపంచ దేశాల నుండీ వచ్చే సందర్శకులకు ఈ ప్రాంతాల పట్ల ఆసక్తి ఎక్కువ లేనట్లుగా తోచింది.
కేరళ, గోవా లాటి ప్రాంతాలు సందర్శించినప్పుడు పర్యాటక రంగంలో విదేశీయులు శాతం ఎక్కువగా ఉందన్న విషయం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అది స్థానిక ప్రజలకి జీవనోపాధిని ఇస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో సహజసౌందర్యంతో ఉట్టిపడే పరిసరాలున్నప్పటికీ స్థానికంగా ఉన్న అశాంతి, అసంతృప్తిలతో పాటు చొరబాటుదారుల, వేర్పాటు దారుల సమస్య వలన ఈ ప్రాంతాల పట్ల ప్రపంచ ప్రజలకి ఒక అభద్రతా భావం ఉన్నట్లు తోస్తుంది.
భారత దేశ పర్యటనకొచ్చే విదేశీయులు తూర్పు వైపు కలకత్తా, డార్జిలింగ్ దాటి ఈ రాష్ట్రాల వరకు రావటానికి కావలసిన పరిస్థితుల్ని కల్పించి, పర్యాటక రంగాన్ని అభివృధ్ధి చెయ్యవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. కేరళ రాష్ట్రం 80% పర్యాటక రంగం మీద ఆదాయాన్ని సమకూర్చుకుంటుంటే , ఈశాన్య రాష్ట్రాలు పర్యాటక రంగం నుండి కేవలం 20%మాత్రమే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి .ఇక్కడి పేదరికం, వెనుకబడినతనం నిర్మూలించబడాలంటే ప్రజలకి జీవనోపాధిని కల్పించే దిశగా పర్యాటకాన్ని అభివృధ్ధి చెయ్యవలసిన అవసరం చాలా ఉంది.
Continued in Part II
Pingback: ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part II – ద్వైతాద్వైతం
Pingback: ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part III – ద్వైతాద్వైతం
నమస్కారములు.. అధ్బుతంగా వివరించారు సరిగ్గా సంవత్సరం తరువాత అంటే 2017 జూలై నెలలో నేను గౌహతి వెళ్ళి అక్కడినుండి షిల్లాంగ్ వెళ్ళాను…. మీ నిశితమైన పరిశీలనకు జోహార్లు…
mrmummidi@gmail.com
LikeLiked by 1 person
మీ కామెంట్ ని ఇప్పటిదాకా చూసుకోలేదు. థాంక్యూ.
Anuradha
LikeLike
థాంక్స్ అండి. మీ కామెంట్ ని ఇంత ఆలస్యంగా చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది.
అనూరాధ
LikeLike
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike