* * *
రెండు కూడా వొంటరి అంకే, 2017
*
గూడెం చెప్పిన కథలు, 2016
*
పుస్తక పరిచయం – కౌముది, జూలై 2017
*
పుస్తక పరిచయం – కస్తూరి, మార్చ్-ఏప్రిల్ 2019
*
మనం మైనస్ నువ్వు ఈజ్ ఈక్వల్ టు ఒఠ్ఠి నేను, 2012
*
పుస్తక పరిచయం – కౌముది, జూన్ 2017
*
పుస్తక పరిచయం – దునియా, మన తెలంగాణా, 14 జూలై, 2019
*
పుస్తక పరిచయం – రచన, జూన్ 2013
*
పుస్తక పరిచయం – కౌముది, ఆగష్టు 2013
*
పుస్తక పరిచయం – ఈమాట వెబ్ మ్యాగజైన్, మార్చి 2020
గూడెంలోని పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్ళిన ఒక నిజాయితీ గల టీచరు అనుభవాలు, చిన్న కథలుగా మారిన సంపుటి ఇది. ఒక తరాన్ని బాధ్యతగా తయారు చెయ్యడమంటే, ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో ప్రధాన పాత్ర కుటుంబానిది కాక పాఠశాలలదీ, పంతుళ్ళదీ కావడం ఆలోచించాల్సిన విషయం. రోజుకి ఏడెనిమిది గంటలు బడిలో గడిపే పిల్లలను, వాళ్ళ మనస్తత్వాలను, దగ్గరగా, జాగ్రత్తగా గమనించుకునే ఉపాధ్యాయులు మనకు ఉన్నారా? పిల్లల కుటుంబ నేపథ్యాలు, వాళ్ళ స్నేహితులు, తోటివారి ప్రభావాలు, తల్లిదండ్రులు పిల్లలకు తమ జీవన ప్రాధాన్యతలను తెలిసో తెలియకో చెబుతున్న తీరు, పిల్లల నడవడిక మీద ఎంత బలమైన ముద్ర వేస్తాయో చిన్న చిన్న సంఘటనల్లో చెప్పుకొచ్చిన తీరు చదివించేలా ఉంది.
కథలన్నింటిలోనూ ఒకే నేపథ్యం, ఒకే మనిషి అనుభవాలు కనపడటం వల్ల, అనవసర వాక్యాలు తగ్గిపోయి ఘటన నేరుగా మనసుకు తాకేలా సూటిగా చెప్పే వీలు చిక్కింది. అందరు తల్లిదండ్రులకూ, అందరు ఉపాధ్యాయులకూ పిల్లలను ఇంతలా కనిపెట్టుకు ఉండటం సాధ్యపడకపోవచ్చు, కానీ, పిల్లల ఆలోచనల తీరెలా సాగుతుందో, ఎందాకా ఓపిక పట్టచ్చో, ఎక్కడ హద్దు గీయచ్చో, ఇలాంటి అనుభవాలు లీలామాత్రంగా సూచననిస్తాయి. పిల్లలు తన నుండి ఏమీ నేర్చుకోపోయినా, నవ్వుతూ ఖాళీ పలకను చూపించినా, అసహనం కూడదనీ, చిరునవ్వు చెదరకుండా చదువు చెప్పడమే అవసరమనీ నమ్మిన టీచర్లు కథల్లోనైనా ఉండటం పెద్ద ఊరట. ఉపన్యాసాలూ, ఊయలబల్ల తీర్పులూ లేకుండా, సమస్య మీద చిన్న లాంతరు వెలుగు వేసి సాగిపోయే ఈ సంపుటి వివరాలు:
*
రెండు కూడా ఒంటరి అంకే
ఈ సంపుటిలోని కథలన్నీ ఆధునిక జీవితపు సంక్లిష్టతను, ఈ కాలపు స్వేచ్ఛతో ముడిపడి ఉన్న సందిగ్ధావస్థనూ చిరపరిచితమనిపించే కథాంశాలతోనూ, సన్నివేశాలతోనూ నేర్పుగా అల్లుకున్నవి. ప్రత్యేకించి స్త్రీ కోణంలో రాసిన కథలవడం వల్ల వాళ్ళ శక్తిని, అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వాళ్ళకుండాల్సిన స్వేచ్ఛనూ ఎక్కడా చిన్నబుచ్చకుండానే వారు ఎదుర్కునే సంఘర్షణల గురించి సరళంగా కనపడే సన్నివేశాల ద్వారా చెప్పడం, ఒక ప్రత్యామ్నాయ దృక్పథాన్ని చూపెట్టే ప్రయత్నం చెయ్యడం, ఈ పుస్తకాన్ని ఆసాంతం ఆసక్తిగా చదివిస్తాయి. పరమంత సహనం కథలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన స్త్రీలలో ఆత్మాభిమానం ఎంత బలంగా ఉంటుందో, ఆ అభిమానవంతులు వాళ్ళకున్న జీవితంలోనుండే ఉన్న అరకొర అవకాశాల్లోనుండే ఎంత గౌరవప్రదంగా వారివారి సమస్యలకు పరిష్కారాలు వెదుక్కుంటారో, మనుగడ సాగించుకుంటారో రచయిత చూపిస్తారు. ఒంటరితనం, ఏమీ చెయ్యాలనిపించని ఖాళీతనం మనిషికి అనవసరపు నీరసాన్నిస్తాయని, వియోగానంతరపు ఏకాకితనానికి అందరూ సిద్ధపడే ఉండాలని, కుటుంబం అందుకు అండగా నిలబడాలనీ పరిమళపు అర చెబుతుంది. ఉన్న సందర్భం నుండి బయటపడెయ్యడమొక లక్ష్యంగా సాగిన కథలు కావివి. పొరలుపొరలుగా పాత్ర మనస్తత్వాన్ని విప్పుతూ, ఆ పాత్ర ప్రవర్తనని పాఠకులకు అర్థమయేలా చేసి, ఆలోచనను మిగిల్చే కథలు. అలా అని లేని గాంభీర్యాన్ని తలకెత్తుకున్నవీ కావు.
మొట్టమొదటి కథ కిమాయాలో (కిమాయా అంటే మరాఠీ భాషలో మేజిక్ అని అర్థం) ఎదురొచ్చే ఆహ్లాదకరమైన సన్నివేశాలు, చమత్కారపు ముగింపు, వస్తువును బట్టి శైలిని మార్చుకోగల రచయిత శక్తిని చెబుతాయి. ద్వేషం నుండి ఎంచుకున్న ఒంటరితనం కన్నా, క్షమతో కొసరుకునే కలివిడితనమే మనిషిని సుఖంగా మననీయగలదని చెప్పే జీవితసూత్రం తాలూకు కథ పాత్రను బలహీనతలతో సహా ముందుంచి దగ్గర చేస్తుంది. పెరిగి పెద్దయిన పిల్లలు, తల్లిదండ్రుల మధ్య కథలు, వారి మధ్య ఉన్న దూరాలు, పొరపచ్చాల గురించి చెప్పిన కథలు కూడా ఈ సంపుటిలో చాలానే ఉన్నాయి. అయితే అన్యాపదేశంగా వీటన్నిటిలోనూ చెప్పినది ఒకటే. బాల్యం తిరిగిరానిదని, అప్పుడు తగిలిన గాయాలను పసివాళ్ళు అంత తేలిగ్గా మర్చిపోలేరనీ. కనీసం ఒక వయసొచ్చేదాకా పిల్లలకు బేషరతుగా ప్రేమ పంచాలని, ఒకింట పెరిగే పిల్లల్లోనే భేదాలు చూపిస్తూ సాగే పెంపకం చిన్నారి మనసుల్లో గాఢమైన ముద్ర వేస్తుందనీ చెప్పడం గుర్తుండిపోయే రీతిలో సాగింది. ఇవి అవసరమైన ఆలోచనల మీదుగా సాగిన ఈ కాలపు కథలు. సమతుల్యం లేని ఆలోచనల పునాదుల మీద నిర్మించుకున్న జీవనసౌధం కుదురుగా నిలబడదని చెప్పే కథల అవసరం ఇప్పుడు మరీ కనపడుతోంది.
*

*

*

*
* * *