* * *
కాస్త భావుకత, చుట్టూ ప్రపంచం పట్ల ప్రేమ , అక్షరాల పట్ల విపరీతమైన మోహం….ఇంతే.
చిగుళ్ళెత్తే ఆకుపచ్చని ప్రపంచం, కురుస్తున్నానంటూ ఊరించే నల్ల మబ్బు, కురిసి హత్తుకునే వాన చినుకులు, దూరంగా ఉండి రమ్మని పిలిచే కొండలూ, దగ్గరకెళ్తే చాలు సంతోషంతో చేతులు చాచే సముద్రం, ప్రకృతిలోని సంగీతంతో పాటు సమస్త ప్రాపంచిక సంగీతం…… ఇవన్నీ ఏళ్ల తరబడి సరి క్రొత్తగా ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తూనే ఉన్నాయి.
ప్రొద్దుప్రొద్దున్నే లేచి ఎండ కన్నెరుగని లేత గాలుల గారాల మధ్య అంతుపట్టని హాయేదో అనుభవిస్తుంటే , పెరటి మొక్కల మొదళ్లలో ఆహారాన్ని ఏరుకుంటున్న పిట్టలు ఒక్కసారి తలెత్తి పలుకరిస్తాయి. అక్కడక్కడే కాకర పాదుమీది పుసుపు పచ్చని పూల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కూనిరాగాలు తీస్తున్న సీతాకోక చిలుకలు……..వీటికి చేదు రుచుల్ని తీయని తేనెలుగా ఆస్వాదించటం ఎవరు నేర్పేరు? ఇన్నీమనకు నేర్పే బుల్లి ప్రాణులు ఎక్కడ చదువుకున్నాయో….. నేను ఏమి నేర్చుకున్నాను ఇంత కాలంగా……………
ఎలాటి ఆర్భాటాలు లేకుండా ఆకాశం క్రింద ఒదిగిన యావత్తు ప్రపంచం నన్ను ఆకర్షిస్తుంటుంది. ప్రకృతిలో భాగమై చైతన్యంతో కదిలే ప్రతి ప్రాణి నాలో ఎన్నెన్నో ఆలోచనల్ని, ఆనందాల్ని, దుఃఖాల్ని …………. ఇంకా జీవితేచ్ఛనీ అందిస్తూనే ఉంటుంది.
చాలా చిన్నప్పుడే పుస్తకాలతో స్నేహం నన్ను రాయమని వేధిస్తుండేది. రాయాలన్న కోరిక ఇప్పటికీ నన్నుచుట్టుకునే ఉంది. పుస్తకం చదువుతున్నప్పుడల్లా ఒక ఆవేశం. అక్షరం ఎంత బలమైందో అర్థమవుతూనే ఉంది. రచయిత అన్నవాళ్లు కాఫీ లేదా టీ త్రాగుతూ ఆలోచన చెయ్యటం ఎక్కడ చదివేనో కానీ ఆరోక్లాసులో అమ్మని అడిగేను ‘ పాలు కాకుండా ఇకపై టీ త్రాగుతానని’……అమ్మ జ్ఞాపకం …..ఇప్పటికీ త్రాగే ప్రతి టీ చుక్కా అపురూపమైనదే నాకైతే. కేవలం ఆ భావన కోసమే టీ.
నా పిల్లలకి అ, ఆ లు నేర్పే క్రమంలో ఆ అక్షరాలతో వాళ్ల అందమైన ప్రయోగాలు నన్ను బోధన వైపు లాక్కెళ్లాయి. నా భవిష్యత్తు ఇంత అందంగా వాళ్లే రాసేరనిపిస్తుంది. వాళ్లకేమివ్వగలను? నేను నేనుగా మిగిలే ప్రయత్నంలో సహచరుడి చిరునవ్వూ తోడుంది.
ఇంతకీ …………….ఇదీ నేను.
* * *
Pingback: ప్రియ శరణార్థీ! నా జీవితం ఇలా నడవనీ.. (Dear Refugee, My Life Must Go On..) » FutureSTRONG Academy
Pingback: ప్రియ శరణార్థీ! నా జీవితం ఇలా నడవనీ.. (Dear Refugee, My Life Must Go On..) » FutureSTRONG Academy